బడికి బాట పట్టారు...


Wed,June 19, 2019 11:34 PM

- జయశంకర్ బడిబాటకు అనూహ్య స్పందన
-ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన అడ్మిషన్లు
-జిల్లాలో 12,321 మంది విద్యార్థుల చేరిక
- ముగిసిన బడిబాట
సిద్దిపేట టౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతాం అనే వారి సంఖ్య నానాటికి పెరుగుతున్నది. నాణ్యమైన విద్యకు కేరాఫ్ అడ్రస్‌గా ప్రభుత్వ పాఠశాలలు మారాయి. చక్కటి చదువుతో పాటు రెండు జతల యూనిఫామ్స్, పుస్తకాలు, నైపుణ్యం కలిగిన అధ్యాపకులతో బోధన, విద్యార్థులకు ఉపకార వేతనాలు, క్రీడలకు ప్రత్యేక ప్రోత్సాహం ఇలా వేటికవే ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేశాయి. ఈ ఏడాది ఉపాధ్యాయులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో కంటే ఎక్కువ అడ్మిషన్లు ఇచ్చాయి. విద్యాశాఖ జిల్లాలో 10 వేల మంది విద్యార్థులను బడిలో చేర్పించాలనే లక్ష్యంతో బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రెండు రోజుల ముందుగానే లక్ష్యం చేరుకొని బుధవారం నాటికి 12,321 మందిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు.

బడిబాట కొనసాగిందిలా..
ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలనే సంకల్పంతో విద్యాశాఖ ఈ ఏడాది ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లింది. లక్ష్యాన్ని నిర్దేశించుకొని ప్రతి గడపను తట్టింది. విద్యావంతులు, ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులను భాగస్వాములను చేసుకొని సర్వశక్తులను కూడగట్టుకొని ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతను విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తూ రోజుకో విధంగా బడిబాట కార్యక్రమం చేపట్టి సత్ఫలితాలు రాబట్టింది.

జిల్లాలో 12321 మంది విద్యార్థులకు అడ్మిషన్లు
సిద్దిపేట జిల్లాలో ఇది వరకు ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు, డిజిటల్ తరగతులు, నాణ్యమైన విద్య అందుతుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివేందుకు విద్యార్థులు ఆకర్శితులయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో సొంత భవనాలు, డ్యూయల్ డెస్క్‌లతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్నది. జిల్లాలో ఈ ఏడాది బాలురు 6,138, బాలికలు 6,183 మొత్తం 12,321 ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు తీసుకున్నారు. 6 రోజులుగా బడిబాట జిల్లాలో ముమ్మరంగా కొనసాగింది. బుధవారం నాటికి బడిబాట కార్యక్రమం ముగిసింది. విద్యాశాఖ అనుకున్న లక్ష్యానికి చేరుకొని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్యను పెంచింది.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...