డీసీసీబీకి జాతీయ అవార్డు


Mon,June 17, 2019 11:28 PM

-అత్యధిక లావాదేవీలు జరిపినందుకు వరించిన అవార్డు
-దేశంలోనే మొదటిసారి డీసీసీబీకి అవార్డు
-ఈ సంవత్సరం రుణ టార్గెట్ రూ.1,500 కోట్లు
-లాభాల బాటలో డీసీసీబీ
-డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి
సంగారెడ్డి టౌన్ : ఉమ్మడి జిల్లా డీసీసీబీ బ్యాంకుకు జాతీయ అవార్డు వచ్చిందని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలోని డీసీసీబీ జిల్లా కేంద్ర బ్యాంకు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో డీసీసీబీ బ్యాంకుకు అవార్డు రావడం మొదటిసారని, దేశంలోనే డీసీసీబీ బ్యాంకుల ద్వారా అత్యధిక లావాదేవీలు జరిపినందుకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అవార్డును అందజేసిందన్నారు. ఉమ్మడి జిల్లాలో డీసీసీబీ బ్యాంకుల ద్వారా 75 వేల ఏటీఎం కార్డులు ఉన్నాయని, అందులో 68 వేల కార్డుదారులు ప్రతి నెల ఫాస్ట్ ట్రాన్జక్షన్స్, ఆన్‌లైన్ చెల్లింపులు చేశారన్నారు. ప్రధానమంత్రి నోట్ల రద్దు చేసిన తర్వాత అత్యధికంగా ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేసిన బ్యాంకు కేవలం డీసీసీబీ అని, అందుకోసమే దేశంలోనే అత్యధిక చెల్లింపులు చేసినందు వల్ల ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ బ్యాంకుకు అవార్డు వరించిందన్నారు. జాతీయ బ్యాంకులన్నింటికీ అత్యధికంగా చెల్లింపులు చేసినందువల్ల ఈ అవార్డు ప్రతి సంవత్సరం వస్తుందని, 2018-19 సంవత్సరానికి డీసీసీబీ బ్యాంకును ఎంపిక చేయడం సంతోషకరమన్నారు. అత్యధికంగా ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేసినందుకు బ్యాంకుకు రూ.10 లక్షల కమిషన్ వచ్చిందని, ఇది ఏ బ్యాంకులకు రాలేదన్నారు.

డీసీసీబీకి ఉత్తమ అవార్డు...
మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలను అత్యధికంగా ఇచ్చినందుకు డీసీసీబీ బ్యాంకుకు బెస్ట్ ఫర్‌ఫామెన్స్ అవార్డు వరించిందని డీసీసీబీ చైర్మన్ తెలిపారు. జిల్లాలో ఉన్న 1250 గ్రాపులకు రూ.60 కోట్ల రుణాలు ఇచ్చి 99 శాతం రికవరీ సాధించడం వల్ల ఈ అవార్డు దక్కిందన్నారు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇవ్వడమే కాకుండా ఉమ్మడి స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి రుణాలను అందించామన్నారు. ఈ రుణాల ద్వారా పాడి పశువులు, గొర్రెల కొనుగోలు, పౌల్ట్రీఫామ్, డైరీలను ఏర్పాటు చేసుకునేందుకు సహాయాన్ని అందించామన్నారు. ఈ రుణాలను అందించినందుకు సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ర్టానికి రావాల్సినవి రూ.12 కోట్లు ఉంటే అందులో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ బ్యాంకుకు రూ.8 కోట్ల సబ్సిడీ వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.

పెరిగిన డీసీసీబీ బ్యాంకు టర్నోవర్...
ఇంతకుముందు 350 కోట్లు ఉన్న డీసీసీబీ బ్యాంకు టర్నోవర్ ప్రస్తుతం రూ.980 కోట్లకు చేరుకుని లాభాలబాటలో పయణిస్తుందని ఆయన తెలిపారు. బ్యాంకులో రూ.339 కోట్ల డిపాజిట్లు, రూ.356 కోట్ల పంట రుణాలు, రూ.117 కోట్ల ఎల్‌టీ రుణాలు, రూ.60 స్వయం సహాయక సంఘాల రుణాలు, రూ.29 కోట్లు జేఎల్‌జీ రుణాలు, రూ.37 కోట్లు గోల్డ్‌లోన్స్, రూ.1.50 కోట్లు ఉన్నత విద్య కోసం రుణాలు మొత్తం రూ.980.12 కోట్ల రుణాలను ఇచ్చామని, దీంతో బ్యాంకు టర్నోవర్ అత్యధికంగా పెరిగి లాభాల బాటలోకి పయనిస్తున్నామని వివరించారు. ప్రస్తుతం 2019-20 సంవత్సరానికి గాను రూ.1500 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగిందని వివరించారు.

జిల్లాలో 23 బ్రాంచీల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నామని, నూతనంగా మరో 15 బ్రాంచీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. అదే విధంగా 18 ఏటీఎంలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపితే ఎనిమిదింటిని ప్రభుత్వం మంజూరు చేసిందని, సంగారెడ్డిలో 3, సిద్దిపేటలో 3, మెదక్ 2 ఏటీఎంలను త్వరలో ఏర్పాటు చేస్తామని వివరించారు. బ్యాంకులో తీసుకున్న రుణాలను లబ్ధిదారులు 90 శాతం రికవరీ అయిందని వందశాతం రికవరీ జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డీసీసీబీ బ్యాంకు అభివృద్ధి కోసం సొసైటీల ద్వారా వరి కొనుగోలు కేంద్రాలు, ఎరువులు, విత్తనాల విక్రయ కేంద్రాలను 71 సంఘాల ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డీసీసీబీ వైస్ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, డైరెక్టర్ ఉడుత మల్లేశం, సీఈవో శ్రీనివాస్, జీఏం వెంకటేశం, యాదగిరి, మాజీ సీఈవో శివకోటేశ్వర్‌రావు తదితరులు ఉన్నారు.

142
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles