బడి చదువులు బండెడు ఫీజులు


Mon,June 17, 2019 12:19 AM

(సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ):జిల్లాలో ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారం చేస్తున్నాయి. వేల రూపాయల ఫీజులను విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి గుంజేస్తున్నారు. అడ్మిషన్ ఫీజు, స్కూల్ ఫీజు, పుస్తకాలు, యూనిఫామ్స్, టై బెల్టు, స్పోర్ట్స్ డ్రస్సు, ఇతర యాక్టివిటీస్ తదితర వాటి కింద అందినంతగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. జిల్లాలో సుమారుగా 140పై చిలుకు వరకు గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు ఉన్నట్లు విద్యాశాఖ అధికారుల లెక్కల ద్వారా తెలుస్తోంది. ఒక్కో స్కూల్‌లో ఒక్కో రకంగా ఫీజులను నిర్ణయించుకొని అందినకాడికి దోచుకుంటున్నారు. యథేచ్చగా పాఠశాలలోనే పుస్తకాలు, నోట్ పుస్తకాలు అమ్ముతున్నారు. కొన్ని కార్పొరేట్ పాఠశాలలు అడ్మిషన్ పొందాక నేరుగా విద్యార్థులు తరగతి గదులకు రాగానే వారికి పుస్తకాలు, నోట్స్ అందిస్తున్నారు. వారు అడిగినకాడికి తల్లిదండ్రులు ముట్టజెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. మండలాల వారీగా విద్యాధికారులు ఉన్నప్పటికీ ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు చెప్పినట్లుగా నడుచుకుంటున్నారే తప్పా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలు నడుస్తున్నాయా.. లేవా అని చూడడం లేదన్న విమర్శలు ఉన్నాయి. విద్యాధికారులు ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేసి ఆ పాఠశాలలో ఫీజుల వివరాలు ఏమిటి.. అనే తదితర రికార్డులను పరిశీలించాల్సిన అవసరం ఉంది.

పాఠశాలల వారీగా స్కూల్ ఫీజులు
ప్రైవేటు పాఠశాలలో ప్రాంతాల వారిగా ఫీజుల వివరాలు సామాన్యునికి అందనంతగా ఉన్నాయి. నర్సరీ విద్యార్థికి ఒక్కో స్కూల్‌లో ఒక్కో రకంగా ఉంది. సుమారు రూ.13 వేలకు తక్కువగా ఏ స్కూళ్లో ఫీజు లేదు. ఎల్‌కేజీ, యూకేజీకి రూ.13వేల పై మాటే. ఒకటో తరగతికి రూ.14వేల ఫీజులను వసూలు చేస్తున్నారు. ఇలా లెక్కించుకుంటూ పోతే తరగతి తరగతికి రూ.2 వేల నుంచి రూ.3 వేల దాకా పెంచుకుంటూ వెళ్తున్నారు. చివరికి 10వ తరగతి చదివే విద్యార్థికి 30 వేల రూపాయలకు తక్కువగా ఫీజు లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ పాఠశాలలో కూడా ఫీజులు నియంత్రణలో లేవు. ప్రైవేటు పాఠశాలలో ఫీజుల నియంత్రణ కోసం అన్ని పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఎక్కడ ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. పాఠశాలల ఫీజులకు తోడు బస్సు చార్జీలు తల్లిదండ్రులకు భారంగా మారుతున్నాయి. 10 - 15 కిలో మీటర్ల దూరంలోని గ్రామీణ ప్రాంతాల్లో నుంచి పట్టణాల్లోని పాఠశాలలకు విద్యార్థులను తీసుకరావడానికి ఆయా పాఠశాలల యజమాన్యాలు ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి 5 వేల నుంచి 6 వేల రూపాయలు పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల నుంచి అయితే 20 కిలో మీటర్ల వరకు 8 వేల నుంచి 10 వేలు వసూలు చేస్తున్నాయి.

పుస్తకాల పేరిట దోపిడీ...
పుస్తకాల పేరిట జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యజమాన్యం అందినకాడికి దోచుకుంటున్నాయి. నర్సరీ నుంచి పదవ తరగతి వరకు అధిక ధరలకు అమ్ముతున్నారు. ఆయా పాఠశాలల యజమాన్యాలు విద్యాశాఖకు అనుమానం రాకుండా బయటి వ్యక్తులతో ప్రత్యేకంగా దుకాణాలు ఏర్పాటు చేసి పుస్తకాలను అమ్ముతున్నారు. కొన్ని పాఠశాలల్లోనే గుట్టు చప్పుడు కాకుండా యధేచ్ఛగా అమ్ముతున్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం 6 వతరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలనే వాడాలి. దీంతో ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు నర్సరీ నుంచి 5 వ తరగతి వరకు పుస్తకాల రేట్లు అమాంతం పెంచేశారు. ఎల్‌కేజీ, యుకేజీ విద్యార్థుల పుస్తకాలకు సుమారుగా 3 వేల నుంచి రూ.4 వేల వరకు, 1వ, 2వ తరగతులకు సుమారు రూ.5 వేలు, 3వ,4వ,5వ తరగతి చదివే విద్యార్థుల పుస్తకాలకు రూ. 6వేల వరకు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తునారు.
విద్యాశాఖాధికారులు దృష్టి సారించాలి
జిల్లాలో ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు పుస్తకాలను అధిక ధరలకు విక్రయస్తున్నప్పటికీ విద్యాశాఖాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. జిల్లా కేంద్రంలోనే ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు ఫీజులు, పుస్తకాలు, అడ్మిషన్ల పేరిట అధిక దోపిడి చేస్తున్న మౌనంగా ఉండిపోతున్నారు. ఇంత జరుగుతున్న చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖాధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు బలంగా విన్పిస్తున్నాయి. విద్యాశాఖాధికారులు అధిక ఫీజులు, పుస్తకాలపై అధిక ధరలను అరికట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...