పత్తి రైతుపై నకిలీ కత్తి


Sat,June 15, 2019 12:09 AM

గజ్వేల్‌, నమస్తే తెలంగాణ : రైతుల అమాయకత్వం.. ఈ యేడు అయినా మంచి దిగుబడి సాధించాలనే కర్షకుల ఆశ.. దళారులకు వరంగా మారుతున్నది. దీనిని ఆసరా చేసుకొని, గుంటూరు కేంద్రంగా జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల వ్యాపారం పెద్ద ఎత్తున నడిపిస్తుండగా, పత్తి దిగుబడులను నకిలీ విత్తనం కాటేస్తున్నది. విత్తనం మొలక రాక, మొలిచినా మొక్క ఎదగక, మొలకెత్తినా పూత-కాత నిలవక, పోగా చీడ పీడ తెగుళ్ల బెడదతో రైతు ఆశలను నాశనం చేస్తున్నది. విత్తన నకలీతో ఏటా వందల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతున్నది.
వర్గల్‌, ములుగు మండలాల్లో బుధవారం పట్టుబడిన రూ.34లక్షల విలువ గల నకిలీ పత్తి విత్తనాలు ఎంత నష్టానికి గురిచేసేదో! ఎంత మంది రైతులను నిండా ముంచేదో! అక్కడ 1365 కిలోల నకిలీ విత్తనాలు పట్టుబడగా, ఈ విత్తనాలతో సుమారు 1800 ఎకరాల్లో సాగయ్యేది. ఈ విస్తీర్ణంలో దిగుబడి విలువ 6 నుంచి 7 కోట్ల వరకు ఉంటుంది. నకిలీ విత్తనమైతే, ఈ దిగుబడి పూర్తిగా చేతికందకుండా పోతుంది. కోట్లాది రూపాయల పెట్టుబడి రైతుకు నష్టంగా మిగులుతుంది. అధిక దిగుబడి, తక్కువ పెట్టుబడి ఆశలు ఆవిరై అసలుకే మోసం వస్తే, ఆర్నేళ్ల రైతు కష్టం మంటకలిసి పోతుంది.

బీజీ-3 పేరా నకిలీ జోరు
కలుపు నివారణ కోసం జన్యు మార్పిడి పత్తి బీజీ-3 రకం విత్తనంపై నకిలీ విత్తన వ్యాపారం జోరుగా సాగుతున్నది. జిల్లాలో మూడు, నాలుగేండ్లుగా ఈ విత్తనం సాగవుతున్నదని తెలిసింది. ముఖ్యంగా వర్గల్‌, ములుగు, దౌల్తాబాద్‌, మర్కూక్‌, రాయపోల్‌, జగదేవ్‌పూర్‌తో పాటు చేర్యాల, హుస్నాబాద్‌ తదితర మండలాల్లో ఈ రకాలు సాగవుతున్నట్లు తెలుస్తోంది. ప్యాకింగ్‌ లేకుండా, కొత్త పేర్లతో ప్యాకింగ్‌ చేసిన విత్తనాలను గ్రామాల్లో దళారులతో పాటు పలు దుకాణదారులు కూడా రహస్యంగా విక్రయించారు.
విత్తన ఖర్చు ఎక్కువే..
జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం 1,97,610 ఎకారలు కాగా, 5 లక్షల ప్యాకెట్ల పత్తి విత్తనాలు అవసరమవుతాయి. ఇందుకు వ్యవసాయ శాఖ అనేక కంపెనీలకు చెందిన ముఖ్య రకాలు అందుబాటులో ఉంచింది. అయినా రైతులను వ్యాపారులు నమ్మించి నకిలీ, గుర్తింపు లేని విత్తనాలు అంటగడుతున్నారు. 450 గ్రామాల పత్తి విత్తన ప్యాకెటు ధర రూ.650 కాగా, ఈ రకం విత్తనాలకు అదనంగా మరి కొంత డబ్బు వసూలు చేసున్నట్లు తెలిసింది. దీంతో విత్తనాల ఖర్చు పెరుగడమే కాకుండా, పెట్టుబడి భారం కూడా రైతుపై పడడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామాల్లో కూడా దళారులు రైతులకు నేరుగా అమ్ముతున్నారు. పరిచయం ఉన్న రైతుకు మాత్రమే ఇస్తారు. వర్గల్‌లో కొంత మంది ఈ విత్తనాలను మూడు, నాలుగేండ్లుగా విక్రయిస్తున్నారు.

హెచ్చరికలు ఖాతరు చేయక..
వానకాలం ముందు నుంచే నకిలీ, గుర్తింపులేని విత్తనాలపై కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం హెచ్చరికలు చేస్తున్నా, వ్యాపారులు ఖాతరు చేయడం లేదు. విత్తనాలను స్టాకు పెట్టుకుంటున్నారు. పెద్దపెద్ద బస్తాల్లో విత్తనాలను తెచ్చి, ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. ఇంకా పలు ప్రాంతాల్లో విత్తనాల దందా గతంలో నడిపించిన వారు ఇప్పటికైనా మానుకుంటారా? అన్నది అధికారులు నిఘా పెట్టి పరిశీలిస్తున్నారు. నకిలీ విత్తనాలను అమ్మిన వారిపై కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...