ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు


Sat,June 15, 2019 12:08 AM

-విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలి..
-ఆదర్శంగా నిలుస్తున్న ఘనపూర్‌ పాఠశాల
-పాఠశాల అభివృద్ధికి సహకారమందిస్తా
-బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్సీ
-ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డికి ఘన స్వాగతం పలికిన ఉపాధ్యాయులు
తొగుట: కృషి ఉంటేనే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను అందుకుంటారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ఘనపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత పుస్తకాలు, యూనిఫాంతో పాటు అన్నిరకాల వసతులతో పాటు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రాణిస్తున్నారన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలు అంటే కొంత చులకన భావన ఉండేదని, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలపై ఆసక్తి పెరుగుతుందన్నారు. పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రధానోపాధ్యాయులు గన్నె రాజిరెడ్డి కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి డీఈవో రవికాంత్‌రావు, సర్పంచ్‌ కుంబాల వెంకటమ్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి గ్రామంలో బడిబాట ర్యాలీ నిర్వహించారు.

తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు విద్యార్థులను పంపమని గ్రామస్తులు తీర్మానం చేశారు. అనంతరం 9.8 జీపీఏ పాయింట్లు సాధించిన శృతిని ఎమ్మెల్సీ సన్మానించారు. అలాగే మండలపరిషత్‌ మాజీ ఉపాధ్యక్షుడు పుల్లగూర్ల ఎల్లారెడ్డి రూ.10 వేల ఆర్ధికసాయం అందించారు. 2018-19కి పాఠశాలలో రూ.3,16,750, 2019-20 సంవత్సరానికి రూ. 2,50,000ల విరాళాలు సేకరించి, అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. విరాళాలు అందించిన దాతలకు హెచ్‌ఎం గన్నె రాజిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డిని డీఈవో రవికాంత్‌రావుతో పాటు ఉపాధ్యాయ బృందం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా తొగుట మండలం ఘనపూర్‌కు రావడంతో ఉపాధ్యాయ బృందం ఘన స్వాగతం పలికింది. డీఈవో రవికాంత్‌రావు, ఎంఈవో యాదవరెడ్డిని ఎమ్మెల్సీ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈవో సత్తు యాదవరెడ్డి, హెచ్‌ఎం గన్నె రాజిరెడ్డి, సర్పంచ్‌ కుంబాల వెంకటమ్మ, ఎంపీటీసీ శరత్‌, మాజీ మండల ఉపాధ్యక్షుడు పుల్లగూర్ల ఎల్లారెడ్డి, మాజీ సర్పంచ్‌ అక్కం స్వామి, నాయకులు కుంబాల శ్రీనివాస్‌లున్నారు.

మండలంలో కొనసాగిన బడిబాట....
దుబ్బాక,నమస్తే తెలంగాణ: బడిబాట కార్యక్రమంలో భాగంగా దుబ్బాక మండలంలో శుక్రవారం మన ఊరిబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలో చౌదర్‌పల్లి, పెద్దగుండవెళ్లి, ఆకారం, రఘత్తోంపల్లి, చీకోడ్‌, తదితర గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. మన ఊరి బడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలల కంటే సర్కారుబడుల్లోనే గుణాత్మక విద్య అందిస్తున్నట్లు ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లో సద్ది రాజిరెడ్డి, కుమ్మరెంకు కుమార్‌, భూషణం, శ్రీనివాస్‌ తదితరులున్నారు.

ప్రభుత్వపాఠశాలల్లో నాణ్యమైన విద్య...
రాయపోల్‌: ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందని మండల విద్యాధికారి నర్సవ్వ అన్నారు. శుక్రవారం రాయపోల్‌ మండలపరిధిలోని కొత్తపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామంలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఆమె సూచించారు. ఈ సంవత్సరం ప్రాథమిక పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తుందని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రతి విద్యార్థిని తల్లిదండ్రులు ప్రైవేట్‌ పాఠశాలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలకు పంపించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధనతో పాటు విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం, అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో బోధన ఉంటుందని చిన్నారులందరని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు. కాగా మండలంలోని రాంసాగర్‌ తదితర గ్రామాల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రాయపోల్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్‌, పాఠశాల హెచ్‌ఎం నాగరాజు, ఉపాధ్యాయులు విద్యార్ధులు పాల్గొన్నారు.

సర్కార్‌ బడికి పిల్లలను పంపండి...
మిరుదొడ్డి: ప్రతిఒక్కరూ వారి పిల్లలను సర్కార్‌ బడికి పంపించి బాల బాలికలు నాణ్యమైన విద్యను పొందేలా చూడాలని మిరుదొడ్డి మండల విద్యాధికారి జోగు ప్రభుదాస్‌, మోతె, అల్మాజీపూర్‌ గ్రామాల సర్పంచ్‌లు శ్రీనివాస్‌, మంజూల నర్సింహారెడ్డిలు అన్నారు. శుక్రవారం కాసులాబాద్‌, మోతె, అల్మాజీపూర్‌ గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో, సర్పంచ్‌లు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు సర్కార్‌ బడుల్లో ప్రైవేట్‌ బడులకు దీటుగా సక్రమమైన విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...