దుబ్బాకను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా


Fri,June 14, 2019 12:28 AM

దుబ్బాక టౌన్: దుబ్బాక మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలిపారు. దుబ్బాకలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను బుధవారం రాత్రి 9 గంటలకు స్విచ్‌ఆన్ చేసి ప్రారంభించారు. దుబ్బాక రామసముద్రం చెరువు కట్ట నుంచి చేర్వాపూర్ మారెమ్మ గుడి వరకు రోడ్డు వెంబడి ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ లైట్లతో పాటు పట్టణంలో ప్రధాన కూడళైన బస్‌డిపో ఎదురుగా ఉన్న చౌరస్తాలో, తెలంగాణ తల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అదే విధంగా పెద్ద చెరువు కట్ట పై ఎల్‌ఈడీ లైట్లను స్విచ్‌ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రధాన పట్టణాలకు ధీటుగా దుబ్బాకను తయారు చేసేందుకు పెద్ద మొత్తంలో నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో దుబ్బాక అభివృద్ధి శరవేగంగా సాగుతున్నదన్నారు. ప్రజల సహకారంతో దుబ్బాక పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. దుబ్బాక మున్సిపాలిటీలో రూ. 84 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ఇప్పటికే సర్వే నిర్వహించి ప్రతిపాదనలు తయారు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే రామలింగారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య, నాయకులు రొట్టె రమేశ్, ఆస స్వామి, వంగ బాల్‌రెడ్డి, గన్నె భూంరెడ్డి, మూర్తి శ్రీనివాస్‌రెడ్డి, బట్టు ఎల్లం, ఎల్లారెడ్డి, పర్సకృష్ణ, మున్సిపల్ సిబ్బంది ప్రవీణ్, దిలీప్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముందు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపుపై కమిషనర్ సమక్షంలో సుదీర్ఘంగా ఎమ్మెల్యే సోలిపేట సమీక్షించారు. మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపుకు ఎమ్మెల్యే అంగీకరిస్తూ కమిషనర్‌ను ఆదేశించారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...