మోగనున్న బడిగంట


Mon,June 10, 2019 11:41 PM

-నేటితో ముగియనున్న పాఠశాలల సెలవులు
-ఆట పాటలతో ఎంజాయ్ చేసిన విద్యార్థులు
-రేపటి నుంచి స్కూళ్లు పున: ప్రారంభం
సిద్దిపేట టౌన్ : ఆట పాటలతో పాఠశాలల సెలవులను విద్యార్థులు ఎంజాయ్ చేశారు. సెలవులు ఆసాంతం విహార, విజ్ఞాన యాత్రలకు వెళ్లారు. సొంత ఊళ్లోకి వెళ్లి తాతయ్య అమ్మమ్మల ఆప్యాయతలను అందుకున్నారు. సుమారు రెండు నెలల పాటు పాఠశాలల సెలవులను ఆస్వాదించిన విద్యార్థులు తిరిగి బడిబాట పట్టే సమయం ఆసన్నమైంది. విద్యార్థుల సౌకర్యార్థం ప్రతి ఏడాది ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివే విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తు న్నది. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతుంది. భేషభావాలు లేకుండా అందరూ ఒకే గూటి పక్షులనే నినాదాన్ని చాటుతున్నది. ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందిస్తూ మంచి వాతావరణాన్ని నెలకొల్పింది. ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిన విద్యార్థులు ఉన్నతంగా ఎదిగారనే నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చాటుతున్నది. పాఠశాలల్లో చదువుతో పాటు క్రీడలకు అనేక పతకాలు, ప్రోత్సాహాలను విద్యార్థులకు అందిస్తూ వారిలోని నైపుణ్యాన్ని వెలికితీస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లోనే బంగారు భవిష్యత్ దాగి ఉందనే నినాదాన్ని వెలిగెత్తి చాటేలా ప్రతి ఏడాది బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చదివించేలా ప్రభుత్వం కృషి చేస్తున్నది. నేటితో పాఠశాలల సెలవులు ముగియనున్న నేపథ్యంలో నమస్తే తెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఆట పాటలతో ముగిసిన సెలవులు
సంవత్సరం పాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు ఏప్రిల్ 13న విద్యార్థులందరికీ ప్రభుత్వం సెలవులను ఇచ్చింది. విద్యార్థులు సెలవులను ఎంజాయ్ చేసేందుకు సొంత ఊళ్లకు వెళ్లి వాటిని ఆస్వాదించారు. కొందరు విద్యార్థులు విహార యాత్రలకు వెళ్తే.. మరికొందరు చదువుల్లో నైపుణ్యం చాటేందుకు స్పోకెన్ ఇంగ్లిష్‌తో పాటు ప్రత్యేక తరగతుల్లో నిష్ణాతులయ్యేందుకు శిక్షణ తీసుకున్నారు. వేసవి శిక్షణ శిబిరంలో వివిధ అంశాలను నేర్చుకున్నారు. ప్రభుత్వం ముందుగా మే 31 వరకు సెలవులు ఇచ్చింది. జూన్ 1 పాఠశాలలు తిరిగి ప్రారంభించాలని సూచించింది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం జూన్ 12 వరకు సెలవులను పొడిగించింది.

జిల్లాలో 276 ప్రభుత్వ పాఠశాలలు
సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్నారు. అందుకగుణంగా పాఠశాలల్లో అన్ని వసతులను కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందిస్తున్నారు. అందులో భాగంగా జిల్లాలో 217 జిల్లా పరిషత్ పాఠశాలలు, 10 ప్రభుత్వ హైస్కూళ్లు, కేజీబీవీ 22, అర్బన్ రెసిడెన్షియల్ 1, తెలంగాణ మోడల్ స్కూళ్లు 14, మైనార్టీ, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు 12 మొత్తం 276 పాఠశాలలు ఉన్నాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు
ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందివ్వాలనే సంకల్పంతో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చదివించేలా అన్ని వసతులు, సౌకర్యాలు సమకూర్చారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా వాటిని తీర్చిదిద్దారు. దొడ్డు బియ్యంతో విద్యార్థులు మధ్యాహ్న భోజనం గత ప్రభుత్వాలు అందించేవి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు గుడ్డు, ఆకుకూరలు, నాన్‌వెజ్‌తో భోజనాలు అందిస్తున్నది. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు, క్రీడా మైదానాలు, విద్యార్థుల సౌకర్యార్థం డ్యూయల్ డెస్క్‌లు అందించింది. నిరుపేద విద్యార్థులకు వారి సౌకర్యార్థం బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లను నిర్మించి ఉన్నతంగా ఎదిగేలా చేయూతనందిస్తున్నది.

ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం విద్యార్థుల కోసం నాలుగు సంవత్సరాల క్రితం ఇంగిష్ మీడియం పాఠశాలలను ఏర్పాటు చేసింది. విద్యార్థుల్లో ఇంగ్లిష్‌పై పట్టు పెంచేందుకు ఈ పాఠశాలలు ఉపయోగపడుతున్నాయి. ప్రత్యేకంగా పాఠశాలల్లో ఇంగ్లిష్‌లో బోధన చేసేందుకు బోధన సిబ్బందిని ఏర్పాటు చేసింది. కంప్యూటర్ నాలెడ్జ్ పెంచేందుకు కంప్యూటర్ శిక్షణకు ల్యాబ్‌లను రూపొందించింది. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం లైబ్రరీలను ఏర్పాటు చేసి వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీస్తున్నది.

ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు
ప్రైవేట్ టెక్నో స్కూళ్లలో మాదిరిగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం డిజిటల్ పాఠాలను బోధిస్తున్నది. పాఠశాలల్లో ప్రత్యేక స్క్రీన్ ఏర్పాటు చేసి విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధంగా ఉపాధ్యాయులు పాఠాలను వల్లిస్తూ వారిని ఉన్నతంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నారు. మొదట కస్తుర్బా, గురుకుల, ఆదర్శ, హైస్కూళ్లలో డిజిటల్ తరగతులు ప్రారంభించారు. దినదిన ప్రవర్తమానంగా డిజిటల్ తరగతులు అన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేసి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తు న్నది.

ముమ్మరంగా బడిబాట
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అనే నినాదంతో బడిబాట కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే బడిబాట కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఆ శాఖ ముమ్మరం చేసింది. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, విద్యావంతులతో కలిసి బడీడు పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలను వివరిస్తూ ముందుకు వెళుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యతోపాటు పాఠశాల పుస్తకాలు, యూనిఫామ్‌లు అందిస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు, డిజిటల్ తరగతులు, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరుతున్నారు. బడిబాటకు మంచి స్పందన వస్తున్నది.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...