అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం


Mon,June 10, 2019 11:41 PM

- ప్రైవేట్ స్కూల్‌కు పంపిస్తే రేషన్ కట్
- రైతుల ఖాతాల్లోకి నేరుగా రైతుబంధు నగదు జమ
-విజయవంతంగా కొనసాగుతున్న బడిబాట
-చేర్యాల దవాఖాన వైద్యులపై చర్యలు తీసుకోవాలని తీర్మానం
చేర్యాల, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయమేని ఎంపీపీ మేడిశెట్టి శ్రీ ధర్, జడ్పీటీసీ సుంకరి సరిత అన్నారు. సోమవారం చేర్యాల, కొమురవెల్లి మండలాల మండల సర్వ సభ్య సమావేశం ఎం పీపీ మేడిశెట్టి శ్రీధర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మండల సభ పలు తీర్మానాలు చేసింది. చేర్యాల ప్రభుత్వ దవాఖానలో 18 మంది వైద్యులను ప్రభుత్వం నియమిస్తే కేవలం ఐదుగురు వైద్యులు విధుల్లో చేరి డ్యూటీలకు రావడం లేదని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే వారి పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సభ తీర్మానించింది. అలాగే అన్ని ప్రభుత్వ శాఖల పనితీరుపై ఎం పీటీసీలతో పాటు సర్పంచ్‌లు చర్చించి పలు సమస్యలను ప్రస్తావించడంతో పాటు పరిష్కారానికి అధికారుల నుంచి హామీలు తీసుకున్నారు. మండలంలోని చిట్యాల, తాడూరు గ్రామాల్లోకి ప్రైవేట్ పాఠశాలల బస్సులు రానివ్వమని సర్పంచ్‌లు ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు, నర్ర ప్రేమలత తెలిపారు.

మంగళవారం గ్రామాల్లో చాటింపు వేయించి గ్రామ పంచాయతీ తీర్మానం చేయనున్నట్లు సభలో తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రైతుబంధు పథకం నగదు రైతుల బ్యాంకు అకౌంట్స్ జమ ప్రారంభమైందన్నారు. ఆగ్రో సేవా కేంద్రంలో జీలుగలు, వరి ధాన్యం విత్తనాలు సబ్సిడీ ధరకు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఏవో అఫ్రోజ్ తెలిపారు. ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులను వేయనున్నట్లు పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రస్తుతం మండలంలో ని అన్ని గ్రామాల్లో అంగన్‌వాడీ బడిబాట కార్యక్రమం కొనసాగుతున్నదని, ర్యాలీల్లో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో పాటు స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొనాలని సీడీపీవో సం తోషిబాయి కోరారు. పౌష్టికహారాన్ని లబ్ధిదారులు సకాలంలో అందించేందుకు అంగన్‌వాడీ టీచర్లు కృషి చేయాలని,ఆయా గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీలు అంగన్‌వాడీలు నిర్వహించే ప్రతి కార్యక్రమంలో పాలుపంచుకోవాలని సూచించారు.

మండలంలోని ఆకునూరు, కొత్త దొమ్మాట, ముస్త్యాల గ్రా మాల్లో మిషన్ భగీరథ పథకం నీటి ట్యాంకు నిర్మించాలని ఆ యా గ్రామాల సర్పంచ్‌లు చీపురు రేఖ, సొంటిరెక్కల భిక్షపతి, పెడుతల ఎల్లారెడ్డి కోరారు. పోతిరెడ్డిపల్లి గ్రామంలో మిషన్ భగీరథ పనులు చేసేందుకు సీసీ రోడ్లు పగులగొట్టారని దీంతో వీధుల్లో నడువలేని పరిస్థితి ఉందని, వెంటనే వాటికి మరమ్మతులు చేయాలని సర్పంచ్ కత్తుల కృష్ణవేణి కోరారు. దొమ్మాట కార్యదర్శి రాంబాబు విధులకు గత రెండు నెలలుగా హాజరుకావడం లేదని వెంటనే అతనిపై చర్యలు తీసుకోవడంతో పాటు మరో కార్యదర్శిని నియమించాలని సర్పంచ్ గాలిపల్లి సుభాణిణిరెడ్డి కోరారు. సమస్యను డీపీవో దృష్టికి తీసుకుపో యి కార్యదర్శి పై చర్యలు తీసుకునే విధంగా నివేదిక అందిస్తానని ఇన్‌చార్జీ ఎంపీడీవో రాంప్రసాద్ హామీ ఇచ్చారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన బడిబాట కార్యక్రమం చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో విజయవంతంగా కొనసాగుతున్నదని, ఇప్పటికే 70 శాతం పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశామని, మిగిలిన పుస్తకాలను పాఠశాల ప్రారంభం వరకు సరఫరా చేస్తామని ఎంఈవో జి.రాములు తెలిపారు. సభలో ఇన్‌చార్జీ ఎంపీడీవో రాంప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ బొడిగం మహిపాల్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ అనిల్‌తో పాటు ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...