జనం మధ్యనే..కోసమే..


Mon,May 27, 2019 02:29 AM

-మెతుకుసీమ ప్రజల ఆదరాభిమానాలు మరువలేనివి
-గడిచిన ఐదేండ్లు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశా..
-రెండోసారి భారీ మెజార్టీతో గెలిపించారు
-వచ్చే ఐదేండ్లూ అభివృద్ధే నా లక్ష్యం...
-సీఎం కేసీఆర్ సహకారంతో కేంద్రం నుంచి నిధులు సాధిస్తా..
-పెండింగ్ పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తా..
-నమస్తేతెలంగాణతో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

సంగారెడ్డి, నమస్తేతెలంగాణ ప్రధానప్రతినిధి;ఉద్యమాల పురిటిగడ్డ.. మెతుకుసీమ ప్రజల ఆదరాభిమానాలు మరువలేనివి.. సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 3 లక్షల పైచిలుకు భారీ మెజార్టీతో విజయం కట్టబెట్టారు.. గడిచిన ఐదేండ్లలో ఎంపీగా ప్రజల కోసమే పని చేసిన.. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేసిన.. సీఎం కేసీఆర్ సహకారంతో ప్రధానంగా రైల్వే పనులు, రోడ్ల అభివృద్ధికి కేంద్రం నిధులు రాబట్టగలిగా.. సిద్దిపేటకు కేంద్రీయ విద్యాలయం, పాస్‌పోర్టు సేవా కేంద్రం తీసుకొచ్చాం.. రోడ్ల అభివృద్ధికి నిధులు తీసుకువచ్చాం.. భారీ రైల్వే ప్రాజెక్టు పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి.. ఈ పనులు కొనసాగుతున్న సందర్భంలోనే రెండోసారి ఎంపీగా గెలిపించారు.. కేసీఆర్ సర్కారుపై నమ్మకం, తనపై అభిమానంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి కృతజ్ఞతలు చెబుతున్నా.. పార్టీ శ్రేణులను సమన్వయపరిచి భారీ మెజార్టీ రావడానికి కృషి చేసిన మాజీమంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.. వచ్చే ఐదేండ్లు ఎంపీగా జనం మధ్యనే ఉంటా.. జనం కోసమే పనిచేస్తా.. అని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన కేపీఆర్, ఆదివారం నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.


భారీ మెజార్టీ రావడంపై మీ స్పందన..?
ఎంపీ : చాలా సంతోషంగా ఉన్నది. ఈ సంతోషాన్ని జీవితంలో మరచిపోను. ఈ ఎన్నికలతో ఉద్యమాల పురిటిగడ్డ మెతుకు సీమ పేరు మరోమారు చరిత్రలోకి ఎక్కింది. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఇతర నేతలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సీఎం కేసీఆర్ పాలనను నిండు మనస్సుతో ప్రజలు దీవించారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా జనం మాత్రం సీఎం టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే జై కొట్టారు. మూడు లక్షల పై చిలుకు ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్న.

ఈ మెజార్టీని ముందే ఊహించారా..?
ఎంపీ : సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు వంటి ముఖ్యులు ఉన్న నియోజకవర్గాలు మెదక్ పార్లమెంట్ పరిధిలోనే ఉండటం నా అదృష్టం. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో మిగతా నియోజకవర్గాలు కూడా టీఆర్‌ఎస్ కంచుకోటలుగా మారిపోయాయి. మెదక్, నర్సాపూర్, పటాన్‌చెరు, సంగారెడ్డి, దుబ్బాక అన్ని చోట్ల ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రజలంతా టీఆర్‌ఎస్ కారు గుర్తుకు ఓటు వేశారు. ప్రతిపక్ష పార్టీలు చేసిన కుట్రలను తిప్పికొట్టారు. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే 80 వేల పైచిలుకు మెజార్టీ వచ్చింది. ఇలా అన్ని నియోజకవర్గాల నుంచి మంచి మెజార్టీయే వచ్చింది. సంగారెడ్డిలో టీఆర్‌ఎస్ బలమైన శక్తిగా ఎదుగడం సంతోషంగా ఉన్నది.

మొదటి సారి ఎంపీగా చేపట్టిన అభివృద్ధి ఏమిటి..?
ఎంపీ : మొదటి సారిగా మెదక్ ఎంపీగా సాధ్యమైనంత వరకు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన. సీఎం కేసీఆర్ సహకారంతో కేంద్రం నుంచి నిధులు రాబట్టగలిగాను. ప్రధానంగా రోడ్ల అభివృద్ధికి అధిక నిధులు తీసుకువచ్చాను. రూ.1226 కోట్లతో సంగారెడ్డి నుంచి కర్ణాటక వరకు, జిన్నారం నుంచి మెదక్ వరకు జాతీయ రహదారుల విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర రహదారులకు రూ.2069 కోట్లు మంజూరు అయ్యాయి. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు నిధులు అందించడంలో ప్రాధ్యానత ఇచ్చాం.
రూ.133 కోట్లతో అండర్‌పాస్ బ్రిడ్జీల నిర్మాణం కొనసాగుతున్నది. రూ.1100 మనోహరాబాద్ - క్తొతపల్లి వరకు 151 కిలోమీటర్ల రైల్వేలైను పనులు కొనసాగుతున్నాయి. మరో రూ.169 కోట్లతో మెదక్ - అక్కనపేట లైను మంజూరు కాగా పనులు ప్రారంభమయ్యాయి. రూ.150 కోట్ల కేంద్రం నిధులతో విద్యుదీకరణ పనులు చేయించాం. ఎంపీ నిధులతో బస్‌షెల్టర్లను నిర్మించాం. దవాఖానలకు అంబులెన్స్‌లు, బోర్లు వేయించాం, కమ్యూనిటీ హాల్స్, పాఠశాల ప్రహరీల నిర్మాణం జరిపించాం. ఇతర అభివృద్ధి పనులకు నిధులు అందించాం. సిద్దిపేటకు పాసుపోర్టు సేవ కేంద్రం, కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయించాం.

రానున్న ఐదేండ్లలో చేపట్టబోయే అభివృద్ధి పనులేమిటి..?
ఎంపీ : తెలంగాణ కోటీ ఎకరాల మాగాణి లక్ష్యంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రజెక్టుల నిర్మాణం చేపట్టారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు రాబట్టడానికి కృషి చేస్తా. మిగిలిఉన్న రోడ్ల నిర్మాణం పూర్తి చేయించడానికి నిధులు తీసుకువస్తాం.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రేటర్ హైదరాబాద్ సమీపంలోని సంగారెడ్డి వరకు ఎంఎంటీఎస్ రైల్వే లైను పొడిగింపునకు కృషి చేస్తా. పటాన్‌చెరు పారిశ్రామిక వాడలో కాలుష్య నియంత్రణకు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సాధ్యమైనంత వరకు కృషి చేస్తా. ఒక్కటని కాదు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ సూచనలు, సలహాలు తీసుకుని కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి పనిచేస్తా.

పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మీరిచ్చే సందేశం..?
ఎంపీ : మెతుకు సీమ ప్రజలు ఉత్సాహ వంతులు, తెలివైన వారు. వారికి అన్నీ తెలుసు. మెతుకుసీమ ఉద్యమాల పురిటిగడ్డ. ఎవరు ఎన్ని చెప్పినా, కుట్రలు, కుతంత్రాలు చేసినా సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్‌ఎస్ కారు గుర్తు ఓటు వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించారంటేనే ఇక్కడి ప్రజలు ఎంత చైతన్యవంతులో అర్థం అవుతుంది.
భారీ మెజార్టీతో తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ, పార్టీ నాయకులు, కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇప్పటి వరకు జనంతో మమేకం వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేసినా. రానున్న ఐదేండ్లు ప్రజల కోసమే పనిచేస్తా. ఏడు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మనోడు అనేలా అందరి నుంచి పేరు తెచ్చుకుంటా. సమస్యల పరిష్కారం కోసం నన్ను నేరుగా కలువొచ్చు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు ఇతర పార్టీ పెద్దల సహకారంతో వాటి పరిష్కారానికి కృషి చేస్తా.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...