మోండుగా ఉపాధి


Sun,May 19, 2019 02:00 AM

జిల్లాలో జోరుగా ఉపాధి హామీ పనులు
-412 గ్రామాల్లో జరుగుతున్న 399 రకాల పనులు
-నిత్యం పనికి వెళ్తున్న కూలీలు 63,443 మంది
-గతంలో రోజుకు గరిష్టంగా రూ.205, ప్రస్తుతం రూ.211
-వేసవి భత్యంగా 30 శాతం అదనపు చెల్లింపు
-పని ప్రదేశాల వద్ద కూలీలకు అన్ని వసతులు
-నిత్యం పర్యవేక్షిస్తున్న సిబ్బంది..వారానికోసారి చెల్లింపులు

వ్యవసాయ పనులు లేని సమయంతోపాటు కరువు కాలంలో కూలీలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. చేతినిండా పనిఉండడం, కూలీ రేట్లు పెరగడంతో పనులు చేపట్టేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 412 గ్రామాల్లో 399 రకాల పనులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా 372 హరితహారం నర్సరీల నిర్వహణతోపాటు చెరువులు, కుంటల పూడికతీత పనులను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. దాదాపు ప్రతి గ్రామంలో నిత్యం ఏదొక పని జరుగుతూనే ఉన్నది. జిల్లాలో 23 మండలాల్లో 63,443 మంది కూలీలు నిత్యం ఈజీఎస్‌ పనులు చేస్తున్నారు. గతంలో రోజుకూలీ గరిష్టంగా రూ.205 ఉండేది. ప్రస్తుతం దాన్ని రూ.211కు పెంచారు. ప్రస్తుతం 63,443 మంది పనిచేస్తుండగా..పెరిగిన కూలీ ప్రకారం రోజుకు రూ.3,80,658 లబ్ధి పొందనున్నారు. అలాగే వేసవి భత్యం కింద ప్రతి కూలీకి రోజూవారీ వేతనంలో 30 శాతం అదనంగా చెల్లిస్తున్నారు. అంటే రోజుకు రూ.60 లకు పైగా అదనంగా వస్తోంది. ప్రతి ఒక్కరికీ వందరోజుల పని కల్పించాలనే నిబంధన ఉండటంతో ప్రతి ఇంటి నుంచి ఒకరు తప్పకుండా పనులకు వెళ్తున్నారు. గతంలో మాదిరి కాకుం డా ప్రస్తుతం వారానికోసారి కూలీ డబ్బులు చెల్లిస్తున్నారు. అంతేకాదు కూలీలు పనిచేసే ప్రదేశంలో తాగునీటి వసతి, నీడ సదుపాయం కల్పిస్తున్నారు.- హుస్నాబాద్‌,నమస్తే తెలంగాణ

-జిల్లాలో జోరుగా ఉపాధి హామీ పనులు
-కూలీరేట్లు పెరుగడంతో ఉత్సాహంగా పనులకు వెళ్తున్న కూలీలు
-గతంలో రోజుకు గరిష్టంగా రూ.205, ప్రస్తుతం రూ.211
-వేసవి భత్యంగా రోజు కూలీలో 30శాతం అదనపు చెల్లింపు
-జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధి కూలీలు 63,443 మంది
-412 గ్రామాల్లో జరుగుతున్న 399 పనులు
-వారానికోసారి చెల్లింపులు.. హర్షం వ్యక్తం చేస్తున్న కూలీలు

హుస్నాబాద్‌, నమస్తే తెలంగాణ: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు జిల్లాలో జోరందుకున్నాయి. జిల్లాలోని 23మండలాల్లో ఈజీఎస్‌ పనులు నిరంతరాయంగా జరుగుతున్నాయి. అటు వ్యవసాయ పనులు లేక, ఇతర కూలీ పనులు లేక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితుల్లో గ్రామాల్లోని కూలీలను ఉపాధి హామీ పథకం ఆదుకుంటున్నది. దీనికి తోడు ప్రభుత్వం ఉపాధి కూలీ రేట్లను కూడా పెంచడం, పని భారం తక్కువగా ఉండి గిట్టుబాటు కూలీ లభించడంతో పెద్ద సంఖ్యలో కూలీలు ఈజీఎస్‌ పనులకు వెళ్లడానికి ముందుకొస్తున్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు కూడా కూలీలకు తగిన పనులను గుర్తించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుండటంతో పనులు ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతున్నాయి. వేసవిలో కూలీలకు తగి ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని కూలీలకు అదనపు చెల్లింపులు కూడా చేస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఎండవేడిమి పెరుగకముందే పనులను పూర్తి చేయించి ఇండ్లకు పంపిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఈజీఎస్‌ అధికారులు, కూలీల సమన్వయంతో జిల్లాలో ఉపాధి పనులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. చెరువుల్లో పూడికతీత, భూమి అభివృద్ధి పనులు, మట్టి రోడ్ల నిర్మాణం, నర్సరీల నిర్వహణ తదితర పనులు శరవేగంగా నడస్తున్నాయి.

పెరిగిన కూలీ రేట్లు.. వేసవి భత్యం 30 శాతం అదనం..
ఉపాధి హామీ కూలీల రేట్లను ప్రభుత్వం పెంచింది. గతంలో రోజుకూలీ గరిష్టంగా రూ.205 ఉండేది. ఇప్పుడు రోజుకు రూ.211 నిర్ణయించింది. దీంతో ప్రతి కూలీకి రోజుకు రూ.6 అదనంగా వస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 63,443 మంది కూలీలు పనిచేస్తున్నారు. పెరిగిన కూలీ ప్రకారం జిల్లాలోని కూలీలందరూ రోజుకు రూ.3,80,658 లబ్ధి పొందుతారు. అలాగే, వేసవి భత్యం కింద ప్రతి కూలీకి రోజూవారీ కూలీలో 30శాతం అదనపు చెల్లింపులు కూడా చేస్తున్నారు. దీనివల్ల ఒక్కో కూలీకి రోజుకు రూ.60 పైగా అదనంగా కూలీ వస్తున్నది. అంటే వేసవిలో ఈజీఎస్‌ పనులకు వెళ్లే కూలీలకు గరిష్టంగా రోజుకు రూ.272 కూలీ గిట్టుబాటవుతున్నది. వేసవిలో పనులకు వెళితే సాధారణ చెల్లింపులకంటే అదనంగా రావడంతో ఎక్కువ మంది కూలీలు ఈజీఎస్‌ పనులకు వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. జాబ్‌ కార్డులు లేని వారు కూడా కొత్తగా జాబ్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ప్రతి కూలీకి వంద రోజుల పని కల్పించాలనే నిబంధన ఉండటంతో ప్రతి ఇంటి నుంచి ఒకరు తప్పకుండా పనులకు వెళ్తూ ఉపాధి పొందుతున్నారు. గతంలో లాగా కాకుండా ప్రస్తుతం వారికోసారి కూలీ డబ్బులు చెల్లింపు ప్రక్రియ తప్పనిసరిగా జరుగుతోంది.
జిల్లాలో పురోగతిలో 399 పనులు..

నిత్యం పనికి వెళ్తున్న కూలీలు 63,443మంది..
సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం ఉపాధి హామీ పథకం ద్వారా 399 పనులు జరుగుతున్నాయి. జిల్లా మొత్తంలో 372 హరితహారం నర్సరీలను ఈజీఎస్‌ కూలీల ద్వారానే నిర్వహిస్తున్నారు. దాదాపు ప్రతి గ్రామంలో ఏదో ఒక పని జరుగుతూనే ఉంది. అలాగే, జిల్లాలోని 23 మండలాల్లో 63,443 మంది కూలీలు ప్రతి రోజు ఈజీఎస్‌ పనులు చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా చిన్నకోడూరు మండలంలో 8927మంది కూలీలు పనిచేస్తుండగా అత్యల్పంగా ములుగు మండలంలో 1,747 మంది కూలీలు పనిచేస్తున్నారు.

మండలాల వారీగా..
బెజ్జంకి మండలంలో 2,043 మంది కూలీలు పనిచేస్తుండగా, జగదేవ్‌పూర్‌లో 2,425, గజ్వేల్‌లో 2,612, తొగుటలో 2,550, వర్గల్‌లో 2,580, మిరుదొడ్డిలో 2,902, చేర్యాలలో 2,024, మద్దూరులో 3,145, కోహెడలో 3,158, హుస్నాబాద్‌లో 3,826, దౌల్తాబాద్‌లో 4,364, దుబ్బాకలో 6,260, నంగునూరులో 5,526, సిద్దిపేటలో 5,698, కొండపాకలో 5,759మంది కూలీలు పనిచేస్తున్నారు. మొత్తం 412గ్రామాల్లో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా చెరువులు, కుంటల పూడికతీత పనులు ముమ్మరంగా జరుగుతుండగా, రైతులు చెరువు మట్టిన తమ పంట పొలాల్లో వేసుకుంటున్నారు. దీని వల్ల బహుళ ప్రయోజనాలు చేకూరుతున్నాయి.

వేసవిలో ఈజీఎస్‌ పనుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు..
మండుతున్న ఎండల నుంచి కూలీలకు రక్షణ కల్పించేందుకు అధికారులు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. కూలీ పనులు జరుగుతున్న చోట షేడ్‌ నెట్స్‌ ఏర్పాటు చేశారు. తాగునీటిని గతంలో కొందరు కూలీలతో అందించే వారు. అలా చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయనే ఉద్దేశంతో కూలీలు తామే తాగునీరు తెచ్చుకునేలా రోజుకు రూ.5లు అదనంగా చెల్లిస్తున్నారు. పనిచేసే చోటు 5కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటే ఒక్కో కూలీకి ఆటో చార్జీల కింద రోజుకు రూ.10లు ఇస్తున్నారు.


పనిస్థలంలోనే ప్రథమ చికిత్సకు సంబంధించిన బాక్సులను ఏర్పాటు చేయడంతో పాటు ఉచితంగా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను కూలీలకు అందజేస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్నందున ప్రతిరోజు ఉదయం 6గంటల నుంచి 11గంటల వరకు మాత్రమే పనులు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఉదయం పూట ఉపాధి కూలీకి వెళ్లే వారు 11గంటల అనంతరం మరో పని చేసుకునే అవకాశం కూడా ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 16,900 మంది కూలీలు వందరోజుల పాటు పనులు చేసి లబ్ధిపొందారు. జాబ్‌ కార్డు కలిగిన ప్రతి కూలీకి 100రోజుల పని కల్పించాలనే నిబంధనను జిల్లాలో అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు.

కూలీల వెంటే అధికారులు, సిబ్బంది..
జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా, మండలస్థాయి అధికారులతో పాటు గ్రామస్థాయి సిబ్బంది కూడా నిరంతరం శ్రమిస్తున్నారు. జిల్లాలో మొత్తం 375మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఉద యం నుంచి కూలీలతో ఉండి వారితో పాటే ఇండ్లకు వెళ్లిపోతారు. అలాగే, 86మంది టెక్నికల్‌ అసిస్టెంట్లు కూలీలకు తగిన పనులను గుర్తించడంతో పాటు కూలీలు చేసిన పనులను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తుంటారు. 14మంది ఏపీవో వారివారి మండలాల్లో జరుగుతున్న పనులను నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. డీఆర్‌డీవోలాంటి జిల్లాస్థాయి అధికారులు కూడా పనులు జరుగుతున్న తీరుపై వారానికోసారి సమీక్షిస్తున్నారు. దీంతో జిల్లాలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా జరుగడంతో పాటు కరువు కాలంలో కూలీలకు కూడా ఉపాధి లభిస్తున్నది.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...