శరవేగంగా...


Thu,May 16, 2019 12:49 AM

-3 లక్షల చదరపు అడుగులతో ఆధునిక భవనం
-రాష్ట్రంలోనే మొదటి ఉద్యానవన విశ్వవిద్యాలయం
-సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీతో యూనివర్సిటీకి అదనపు హంగులు
-పరిశోధనలకు కేంద్రం కానున్న ములుగు యునివర్సిటీ
-జూన్‌లో ప్రారంభించేందుకు అధికారుల చర్యలు
ములుగు : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజవర్గంలోని ములుగు మండలం తెలంగాణ ఉద్యానవనంగా నిలువనున్నది. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపాలని దృఢంగా సంకల్పించిన సీఎం కేసీఆర్‌ ఆ దిశగా అడుగులు వేస్తూ రూ.135కోట్ల ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌(ఐసీఏఆర్‌) నిధులతో 12 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 3లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొండాలక్ష్మణ్‌బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. రెండేండ్ల కిందట ప్రారంభమైన విశ్వవిద్యాలయం పనులు, శరవేగంగా సాగుతున్నాయి. భవననిర్మాణ పనులను దాదాపుగా పూర్తయ్యాయి. ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్‌తో గ్రీన్‌ బిల్డింగ్‌ యూనివర్సిటీగా ములుగు ఉద్యావనవన విశ్వవిద్యాలయం నిలువనున్నది.

ముఖ్యమంత్రే స్వయంగా..విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 2016 జనవరి 7న శంకుస్థాపన చేశారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచే వ్యవసాయరంగ బలోపేతానికి సముచిత మార్పులు తీసుకొచ్చారు. ఆ దిశగా ములుగులో ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే విద్యార్థులతో పాటు ఆ ప్రాంత రైతులకు ఎంతో మేలు జరుగుతుందని భావించి, విశ్వవిద్యాలయ ఏర్పాటుకు నాంది పలికారు. అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిన గజ్వేల్‌ నియోజకవర్గానికి ములుగులోని కొండాలక్ష్మణ్‌ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయం అదనపు ఆకర్షణగా నిలువనున్నది.

రూ.135 కోట్ల ఐసీఏర్‌ నిధులతో 12 ఎకరాల సువిశాల ప్రాంగణంలో కొండా లక్ష్మణ్‌బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నది. ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్‌తో భవనంలోనికి సహజంగా గాలి, వెలుతురు వచ్చేలా గ్రీన్‌ బిల్డింగ్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ విశ్వవిద్యాలయంలో నాలుగు అంతస్తుల్లో అకాడమిక్‌ బ్లాక్‌లు 3, అడ్మినిస్ట్రేషన్‌ బ్లాక్‌లు 3 నిర్మిస్తున్నారు. విద్యార్థిని, విద్యార్థులకు వేర్వేరుగా వసతి గదులు నిర్మిస్తున్నారు. దీంతో పాటు అత్యంత సౌకర్యవంతమైన గెస్ట్‌హౌస్‌, స్టాఫ్‌ క్వార్టర్స్‌, ఆడిటోరియం, పార్కింగ్‌తో పాటు పెవేలియన్‌ నిర్మిస్తున్నారు. విశ్వవిద్యాలయం ప్రాంగణంలో విశాలవంతమైన సీసీరోడ్లు ఏర్పాటు చేయడంతో పాటు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో 120 రకాల మొక్కలను పెంచేందుకు పనులు శరవేగంగా సాగుతున్నాయి. 55 ఎకరాల సువిశాల ప్రాంగణంలో విశ్వవిద్యాలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ’ని విశ్వవిద్యాలయానికి అనుసంధానం చేసి అదనపు హంగులు దిద్దనున్నారు.

బహుళ ప్రయోజనాలు ఈ విశ్వవిద్యాలయం పూర్తయితే ఉద్యాన విద్యనభ్యసించే విద్యార్థులతో పాటు రైతులకు మరిన్ని ఆధునిక వ్యవసాయ పద్దతులు చేరువకానున్నాయి. ఇక్కడ చదువుకునే పీజీ విద్యార్థులకు క్షేత్రస్థాయిలో పంటల సాగు విధానం, వాటిపై చేపట్టాల్సిన సంరక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తారు. దీంతో రైతులకు కూడాఎంతో మేలు జరిగే అవకాశమున్నది. రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకున్న సీఎం కేసీఆర్‌, ఉద్యానశాఖ అధికారులను తయారు చేసేందుకు విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలని సంకల్పించారు. ఇందుకు గానూ కేంద్రప్రభుత్వంతో చర్చలు జరిపి, తెలంగాణకు విశ్వవిద్యాలయం మంజూరు చేయించడంలో సఫలీకృతులయ్యారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో చేపట్టిన విశ్వవిద్యాలయం పనులు త్వరలోనే పూర్తయి, ఆయన ఆశయం నెరవేరనున్నది. రైతులకు మరిన్ని సేవలు చేరువకానున్నాయి. క్షేత్రస్థాయిలో జరిగే పరిశోధనలతో రైతులకు మరిన్ని లాభాలు, అధిక దిగుబడులు, నాణ్యమైన విత్తనాలు లభించనున్నాయి.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...