ప్యాకేజీ సంబురం


Wed,May 15, 2019 12:00 AM

-దాదాపు పూర్తయిన మల్లన్నసాగర్‌ పరిహారం పంపిణీ ప్రక్రియ
-12వ రోజు రెండు గ్రామాల్లో చెక్కుల అందజేత
-మొత్తం నిర్వాసితులు 4,108 కుటుంబాలకు 4,061 కుటుంబాలకు చెక్కుల పంపిణీ
సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మల్లన్నసాగర్‌ ముం పు గ్రామాల్లో పరిహారం పంపిణీ దాదాపు పూర్తి అయ్యింది. ఇప్పటివరకు మొత్తం 8 గ్రామాల్లో 4,108 కుటుంబాలకు 4,061 కుటుంబాలకు పంపిణీ చేయగా 47 కుటుంబాలు ప్యాకేజీని నిరాకరించాయి. 18 ఏండ్లు పైబడిన వారు యువతీ యువకులు 1,055 మంది ప్యాకేజీని అందుకున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ముంపు గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన చెక్కులు పంపిణీ పూర్తి చేయడానికి సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు కృష్ణభాస్కర్‌, వెంకట్రామ్‌రెడ్డిలు ప్రత్యేక చొరవ తీసుకొని చకచకా చెక్కులను అందించారు. గడిచిన 12 రోజులుగా ముంపు గ్రామాల్లోనే ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి 4,061 కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. మంగళవారం నాడు వేములఘాట్‌ గ్రామానికి చెందిన 8 మందికి, తొగుట మండలం రాంపూర్‌ గ్రామానికి చెందిన 50 మందికి పైగా చెక్కులను అందజేశారు.

ఈ నెల 3న సిద్దిపేట, గజ్వేల్‌ ఆర్డీవో కార్యాలయాల్లో మొదటి రోజు చెక్కులు పంపిణీ చేయగా మరుసటి రోజు నుంచి ముంపు గ్రామాల్లోనే ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి కౌంటర్ల వారీగా భూనిర్వాసితులకు పరిహారం ఇచ్చారు. జాయింట్‌ కలెక్టర్‌ పద్మాకర్‌తోపాటు ఆర్డీవోలు జయచంద్రారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, రాజాగౌడ్‌, అనంతరెడ్డి, విజయేందర్‌రెడ్డి, మధుసూదన్‌, గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డిలు గ్రామాల వారీగా ఇన్‌చార్జిలుగా వ్యవహరించారు. ఒక్కో గ్రామంలో 8 నుంచి 10కౌంటర్లు ఏర్పాటు చేసి ఒక్కో కౌంటర్‌కు జిల్లాస్థాయి అధికారితోపాటు తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌, ఇతర అధికారుల బృందాలు కలిసి మొత్తం 10 నుంచి 15 మంది అధికారులు చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌లు, ఫిర్యాదుల కౌంటర్లు ఏర్పాటు చేసి వచ్చిన ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరించారు. బ్యాంకు ఖాతాలు లేని వారికి శిబిరంలోనే ఖాతాలను ప్రారంభించారు.

12 రోజుల్లో మొత్తం గ్రామాల వారీగా పంపిణీ ఇలా..
మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల్లోని సింగారం, ఎర్రవల్లి, రాంపూర్‌, లక్ష్మాపూర్‌, బ్రాహ్మణబంజేరుపల్లి, వేములఘాట్‌, ఏటిగడ్డకిష్టాపూర్‌లో మొత్తం 4,108 కుటుంబాలకు 4,061 కుటుంబాలు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ తీసుకున్నారు. కేవలం 47 కుటుంబాలు మాత్రమే ప్యాకేజీని తిరస్కరించడంతో వాటిని కోర్టులో డిపాజిట్‌ చేయనున్నారు. 18 ఏండ్లు నిండిన యువతీ యువకులు 1,055 మందికి అందరూ ప్యాకేజీని అందుకున్నారు. సింగారంలో 186 కుటుంబాలకు గాను 186, ఎర్రవల్లిలో 544 గాను 544, రాంపూర్‌లో 198 గాను 198, లక్ష్మాపూర్‌లో 223 గాను 223, బ్రాహ్మణబంజేరుపల్లిలో 212 గాను 212, వేములఘాట్‌లో 1,031 గాను 1,020, పల్లెపహాడ్‌లో 743 గాను 743, ఏటిగడ్డకిష్టాపూర్‌లో 971 గాను 935 మంది కుటుంబాలు రూ.7.50 లక్షల ప్యాకేజీ కింద చెక్కులను, 250 గజాల ఇంటి స్థల పట్టాలను తీసుకున్నారు. కాగా వేములఘాట్‌లో 11, ఏటిగడ్డకిష్టాపూర్‌లో 36 కలిపి మొత్తం 47 కుటుంబాలు ప్రభుత్వం అందిస్తున్న ప్యాకేజీని నిరాకరించడంతో వారివి కోర్టులో డిపాజిట్‌ చేస్తారు.

ఐదు బృందాలతో ప్రత్యేక నిఘా
మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల్లో పునరావాసం, పునరోపాధి (ఆర్‌అండ్‌ఆర్‌) కింద పరిహారం పంపిణీలో ఎక్కడా అవకతవకలు జరగకుండా జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు నిఘా పెట్టారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ తప్పుదోవ పట్టించిన వేములఘాట్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నాగరాజు, రాంపూర్‌ వీఆర్‌ఏ స్వామిలను ఇప్పటికే సస్పెండ్‌ చేశారు. వీరితోపాటు మరో ఇద్దరి అధికారులపై వేటు పడనున్నట్లు సమాచారం. కాగా పంపిణీ జరిగిన గ్రామాల్లో ప్రత్యేక బృందాలు తిరిగి సర్వే చేస్తున్నాయి. ఎక్కడైనా తప్పిదం జరిగితే వెంటనే చర్యలు తీసుకుంటున్నారు.

తొగుట మండలం రాంపూర్‌లో..
తొగుట: మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల్లో పరిహారం పంపిణీ ముగింపునకు వచ్చింది. మొత్తం నిర్వాసితుల్లో 47 మంది ప్యాకేజీ తీసుకునేందుకు తిరస్కరించడంతో వారి పరిహారాన్ని కోర్టులో డిపాజిట్‌ చేయనున్నారు. మంగళవారం మండలంలోని రాంపూర్‌లో మొదటి విడతగా 74 కుటుంబాలకు సంబంధించిన చెక్కులను మల్కాజిగిరి ఆర్డీవో మధుసుదన్‌, సిద్దిపేట అర్బన్‌, తొగుట తాసీల్దార్‌లు విజయసాగర్‌, వీర్‌సింగ్‌ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. రాంపూర్‌లో చెక్కులు పంపిణీ చేస్తుండగా, చెక్కులు రాని వారు అధికారుల దృష్టికి తీసుకరావడంతో సిద్దిపేట ఏసీపీ పరమేశ్వర్‌తో పాటు తాసిల్దార్‌లు విజయసాగర్‌, వీర్‌సింగ్‌లు గ్రామస్తులతో మాట్లాడి వారి సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. మొదటి విడత మాత్రమే చెక్కులు ఇవ్వడం జరుగుతుందని, మిగతా అర్హులైన వారికి రెండోవిడతలో ఇస్తారని పేర్కొన్నారు. మరోవైపు పల్లెపహాడ్‌లో ఇళ్లు, ఇంటి స్థలాల పరిహారానికి సంబంధించి హైదరాబాద్‌ ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి, రాయపోలు తాసిల్దార్‌ వాణిరెడ్డిలతోపాటు బృందాలు సర్వే నిర్వహించాయి.

పల్లెపహాడ్‌లో సైతం ఇంటి ఆస్తుల పరిహారం చెక్కులు పంపిణీ చేద్దామని అధికారులు ప్రయత్నం చేసినప్పటికీ చెక్కులు వచ్చేసరికి రాత్రి కావడంతో వీలు కాలేదు. ఏటిగడ్డ కిష్టాపూర్‌లో కోర్టుకు వెళ్లిన 93 మందిలో 64 మంది పరిహారం తీసుకోగా, 29 మంది నిరాకరించడంతో ఆర్డీవో శ్రీనివాస్‌రావుతో పాటు అధికారులు ఇంటింటికి వెళ్లి వారికి అవగాహన కల్పించారు. 29 మంది నిరాకరించడంతో వారికి రెండు సార్లు నోటీసులు అందించారు. పరిహారం తీసుకోకపోతే కోర్టులో డిపాజిట్‌ చేస్తామని నోటీసుల్లో సూచించారు. లక్ష్మాపూర్‌, ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ఇళ్లు, ఇంటి స్థలాలకు సంబంధించిన సర్వే కొనసాగుతున్నది. రూ. 7.50 లక్షల ప్యాకేజీతోపాటు 18 ఏండ్లు నిండిన వారికి సైతం రూ.5లక్షలతోపాటు గజ్వేల్‌లో 250 గజాల ఇంటి స్థలం పట్టా ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలు ముంపుకు గురవుతున్న బాధలో ఉన్నా మెరుగైన ప్యాకేజీ ఇవ్వడంతో ఎంతో ఊరటనిచ్చినైట్లెంది. గజ్వేల్‌ సమీపంలోని ముట్రాజ్‌పల్లిలో డబుల్‌బెడ్‌రూం ఇండ్లు పూర్తయిన తర్వాతే ముంపు గ్రామాల వారు ఖాళీ చేయాలని కలెక్టర్లు కృష్ణభాస్కర్‌, వెంకట్రామ్‌రెడ్డిలు హామీ ఇవ్వడంతో ముంపు బాధితులకు భరోసా కలిగింది.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...