మూడో విడుత సమరం నేడే


Tue,May 14, 2019 03:51 AM

-హుస్నాబాద్ డివిజన్‌లో నేడు పరిషత్ పోలింగ్
-7 జడ్పీటీసీలు, 67 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
-డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి గ్రామాలకు తరలిన సిబ్బంది

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక ఎన్నికల మూడో విడుత పోలింగ్‌కు సర్వం సిద్ధమయింది. నేటి ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి, మద్దూరు మండలాలతోపాటు చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో నేడు పోలింగ్ జరుగుతున్నది. సోమవారం హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియ పట్టణంలోని మోడల్ స్కూల్‌లో జరిగింది. పంపిణీ కేంద్రాన్ని డీపీవో సురేశ్‌బాబు సందర్శించి పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. అలాగే ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పీవో, ఏపీవో, ఓపీవోలు ఎన్నికల సామగ్రిని తీసుకొని వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల్లో అధికారులు, సిబ్బందితో పాటు వీరిని పోలింగ్ కేంద్రాలకు చేరవేసే వాహనాలతో సందడి ఏర్పడింది. బ్యాలెట్ బాక్సులు, ఇతర ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది అక్కడ పోలింగ్‌కు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకోనున్న 1,84,228మంది ఓటర్లు.. 393 పోలింగ్ కేంద్రాలు
మూడో విడుత ఎన్నికల్లో భాగంగా ఏడు మండలాల్లోని 1,84,228 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 91,590 మంది పురుషులు, 92,638 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మండలాల వారీగా చూస్తే హుస్నాబాద్ మండలంలో 16,795మంది ఓటర్లు ఉండగా, అక్కన్నపేటలో 32,415, కోహెడలో 35,888, బెజ్జంకిలో 27,582, మద్దూరులో 29,703, చేర్యాలలో 28,233, కొమురవెల్లిలో 13,612మంది ఓటర్లు ఉన్నారు. ఏడు మండలాల్లో మొత్తం 393పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. హుస్నాబాద్ మండలంలో 39పోలింగ్ కేంద్రాలు ఉండగా, అక్కన్నపేటలో 71, కోహెడలో 74, బెజ్జంకిలో 59, మద్దూరులో 66, చేర్యాలలో 57, కొమురవెల్లిలో 27పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటన్నింటిలో అధికారులు ఇప్పటికే ఏర్పాటు పూర్తి చేయగా, పోలింగ్ అధికారులు పోలింగ్‌కు కావాల్సిన ఏర్పాట్లను కూడా పూర్తి చేసుకున్నారు.

పోలింగ్ విధుల్లో 2,712 మంది సిబ్బంది.. 328మందితో భద్రతా ఏర్పాట్లు..
మూడో విడుత పోలింగ్‌లో ఏడు మండలాల్లో మొత్తం 2,712 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఇందులో 511మంది ప్రిసైడింగ్ అధికారులు, 511మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 1,690మంది ఓపీవోలు ఉన్నారు. హుస్నాబాద్ మండలంలో 270మంది విధులు నిర్వహిస్తుండగా, అక్కన్నపేటలో 489, కోహెడ 510, బెజ్జంకి 408, మద్దూరు 456, చేర్యాల 393, కొమురవెల్లి మండలంలో 186మంది పీవో, ఏపీవో, ఓపీవోలు విధులు నిర్వహిస్తారు. వీరికి ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక వసతి ఏర్పాటు చేశారు. అలాగే ఏడు మండలాల్లో 328 మందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సీపీ జోయల్ డెవిస్ ఆదేశాల మేరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు హుస్నాబాద్ ఏసీపీ ఎస్.మహేందర్ తెలిపారు. 8మంది సీఐడీ డీఎస్‌పీలతో పాటు 20మంది సీఐలు, 300మంది పోలీస్ కానిస్టేబుళ్లు, హోంగార్డులు భద్రతా విధులు నిర్వహిస్తారని ఆయన చెప్పారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

2ఎంపీటీసీలు ఏకగ్రీవం బరిలో 296మంది అభ్యర్థులు..
అక్కన్నపేట మండలంలోని పోతారం (జే) ఎంపీటీసీ స్థానంతో పాటు కోహెడ మండలంలోని బస్వాపూర్ ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం కావడంతో మొత్తం 69ఎంపీటీసీ స్థానాలకు గాను 67స్థానాలకు మాత్రమే పోలింగ్ జరుగనున్నది. ఏడు మండలాల్లో ఏడు జడ్పీటీసీ స్థానాలతోపాటు 67 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. హుస్నాబాద్ మండలంలో 6ఎంపీటీసీ స్థానాలతోపాటు అక్కన్నపేట మండలంలో 11, కోహెడ మండలంలో 12, బెజ్జంకిలో 10, మద్దూరు 11, చేర్యాల 11, కొమురవెల్లి 6ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగనున్నది. మొత్తం జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు గాను 296మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జడ్పీటీసీ స్థానాలకు 35మంది, ఎంపీటీసీ స్థానాలకు 261 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. హుస్నాబాద్ మండలంలో 6ఎంపీటీసీ స్థానాలకు గాను 25మంది పోటీ పడుతుండగా అక్కన్నపేట మండలంలో 11స్థానాలకు 39 మంది, కోహెడ మండలంలో 12 స్థానాలకు 45 మంది, బెజ్జంకి మండలంలో 10 స్థానాలకు 42 మంది, మద్దూరులో 11స్థానాలకు 35మంది, చేర్యాలలో 11స్థానాలకు 48 మంది, కోమురవెల్లి మండలంలో 6 ఎంపీటీసీ స్థానాలకు గాను 27మంది పోటీ పడుతున్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...