చకచకా..


Fri,April 26, 2019 12:02 AM

- వేగంగా సిద్దిపేట సమీకృత భవన నిర్మాణ పనులు
- రూ. 40కోట్లతో 40ఎకరాల్లో కార్యాలయాలు
- 70 శాఖలకు సరిపడా ప్రత్యేక గదులు
- 1.68లక్షల చదురపు అడుగుల్లో జీ+2 భవనం
- 500మంది సామర్థ్యంతో భారీ సమావేశ మందిరం
- త్వరలోనే ప్రారంభోత్సవానికి కసరత్తు చేస్తున్న అధికారయంత్రాంగం

నలభై ఎకరాల సువిశాల ప్రదేశం.. రూ.40 కోట్లతో నిర్మిస్తున్న అధునాత భవనం.. అందమైన ఉద్యానవనం.. అబ్బురపరిచే అంతర్గత రోడ్ల నిర్మాణం.. భారీ సమావేశ మందిరాలు.. ఉన్నతాధికారులకు ప్రత్యేక క్యాంపు కార్యాలయాలు.. 70శాఖలకు సరిపడా ప్రత్యేక గదులతో అత్యాధునిక హంగులతో సిద్దిపేట సమీకృత భవనం సిద్ధమవుతున్నది. కొండపాక మండలం దుద్దెడ-మర్పడగ, గ్రామాల శివారులోని ప్రభుత్వ భూమిలో కార్యాలయాల ఏర్పాటు జరుగుతున్నది. ఈ భవన నిర్మాణానికి స్వయంగా సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయగా, రాత్రింబవళ్లు పనులు శరవేగంగా సాగుతున్నాయి.

కొండపాక : 40 ఎకరాల సువిశాల ప్రదేశం.. అందులో 40 కోట్ల భారీ నిధులతో నిర్మిస్తున్న ఆధునిక భవనం. వీటికి తోడు అందమైన ఉద్యానవనం.. అబ్బురపరిచే అంతర్గత రోడ్లు, భారీ సమావేశ మందిరాలు. ఉన్నతాధికారులకు ప్రత్యేక క్యాంపు కార్యాలయాలు ఇలా చెప్పుకుంటూపోతే ఇక్కడ ఓ అద్భుతమే జరుగబోతున్నది. ఇది మరెక్కడో కాదు సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయానికి ప్రత్యేకతలు ఇవి. సిద్దిపేట అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటి (సుడా) పరిధిలో జరుగుతున్న నూతన కలెక్టర్ కార్యాలయం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలువనున్నది.
ముఖ్యమంత్రే స్వయంగా..

స్వయంగా సీఎం కేసీఆర్ ఈ స్థలాన్ని పరిశీలించి కలెక్టరేట్ నిర్మాణం కోసం శంకుస్థాపన కూడా చేశారు. సీఎం కేసీఆర్ సిద్దిపేటను నూతన జిల్లాగా ప్రకటించిన తర్వాత కొద్దిరోజులకే కొండపాక మం డలం దుద్దెడ, మర్పడగ, గ్రామాల శివారులోని ప్రభుత్వ భూమిలో కార్యాలయాలను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. భవిష్యత్ తరాలకు కూడా సరిపోయేలా అద్భుత నిర్మాణాన్ని చేపట్టేందుకు 40 కోట్ల భారీ నిధులను కలెక్టరేట్ నిర్మాణ పనుల కోసం కేటాయించారు. అభివృద్ధికి మారుపేరుగా చెప్పుకునే సిద్దిపేటకు మోడల్ కలెక్టరేట్ భవ నం మరో అదనపు ఆకర్షణగా నిలువనున్నది.

అబ్బురపరిచే హంగులు..
సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ నిర్మాణం ఆశ్చర్యపరిచే హంగులతో సిద్ధమవుతున్నది. 40ఎకరాల సువిశాల ప్రాంగణంలో ప్రభుత్వ కార్యాలయాల సమాహారం శరవేగంగా జరుగుతున్నది. ఒక లక్ష అరవై ఎనిమిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, జీ+2 ఆకృతిలో భవణ నిర్మాణ పనులు జరుతుతున్నాయి. సుమారు 70 శాఖలకు సరిపడే విధంగా భవనాన్ని నిర్మించడంతోపాటు అందులో మూడు సెమినార్, ఒక ఆధునిక వీడియో కాన్ఫరెన్స్ హాల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 500మంది సామర్థ్యంగల ప్రత్యేక సమావేశ మందిరం (ఆడిటోరియం) కూడా ఇందులోనే నిర్మా ణం అవుతున్నది. ఒక అంతస్తులో 58వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మాణాలు జరుగుతున్నాయి. అలాగే ఉన్నతాధికారుల కోసం 5 ప్రత్యేక క్యాంపు కార్యాలయాలను కూడా నిర్మిస్తున్నారు. సిబ్బంది, వివిధ పనులపైన ఇక్కడికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రత్యేక లిఫ్టులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అధికారులకు, సందర్శకులకు వేర్వేరుగా వాహనాలు నిలుపు స్థానాలను కేటాయిస్తున్నారు. ఆహ్లాదం ఉట్టిపడేలా అద్భుతమైన ఉద్యానవనాలను, హైవేలను తలపించేలా అంతర్గత రోడ్డు మార్గాలను నిర్మించనున్నారు.

ప్రారంభోత్సవానికి చేరువలో..
అత్యాధునిక హంగులతో శరవేగంగా నిర్మాణం అవుతున్న సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ సమీకృత కార్యాలయం భవనం ప్రారంభోత్సవానికి చేరువలో ఉంది. మరికొద్ది నెలల్లోనే భవన నిర్మాణ పనులను పూర్తిచేసి, సిద్ధం చేయడమే లక్ష్యంగా పనులు నిర్వహిస్తున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా వం దల మంది భవన నిర్మాణ కార్మికులు పనుల్లో నిమగ్నమయ్యారు. రాత్రి సమయాల్లోనూ ఎల్‌ఈడీ వెలుగుల్లో పనులు నిర్వహిస్తున్నారు. కార్యాలయ నిర్మాణ పనులు నాణ్యతతో జరిగేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

కేసీఆర్ సంకల్పం... హరీశ్‌రావు కృషి..
సీఎం కేసీఆర్ సంకల్పంతో దశాబ్దాల సిద్దిపేట జిల్లా కల సాకారమైంది. గొప్ప ఆశయంతో సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌ను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేలా కేసీఆర్ రూపకల్పన చేశారు. రాష్ట్రంలోని తొలి కలెక్టరేట్‌గా సిద్దిపేట జిల్లా కార్యాలయం స్వయంగా సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకుంది. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక కృషితో కార్యాలయం అనుకున్న స్థాయిలో వేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటుంది. మాజీ మంత్రి హరీశ్‌రావు కలెక్టరేట్ మార్గంలో వచ్చిన ప్రతీసారి భవన నిర్మాణ పనుల గురించి ఆరాతీసి, పనులను పరిశీలించి నిర్మాణ పనులను మరింత వేగంగా నడిపించారు. సీఎం సంకల్పం, మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ వెరసి సిద్దిపేట జిల్లా ఆధునిక సమీకృత కలెక్టరేట్ అతిత్వరలోనే ఆవిష్కరణకు సిద్ధమవుతుంది.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...