నేటి నుంచి రామాలయంలో బ్రహ్మోత్సవాలు -భక్తోత్సవాలు


Fri,April 26, 2019 12:00 AM

గజ్వేల్‌రూరల్: తెలంగాణ ప్రాంతంలో ఎంతో ప్రాశస్త్యం పొందిన గజ్వేల్ సీతారామ ఉమామహేశ్వరాలయ బ్రహ్మోత్సవాలు-భక్తోత్సవాలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. గజ్వేల్ పట్టణంలో దాదాపు చాళక్యుల కాలం నాటి ఆలయంగా 400 ఏండ్ల చరిత్ర కలిగినది గజ్వేల్ సీతారామాలయం గురించి పెద్దలు చెబుతుంటారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు రామాలయంలో ఏటా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గ్రామానికి చెందిన వెలమలు, వైశ్యులుగా ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ బీటుకూరి వంశస్తులు వంశపారంపర్యంగా ఆలయ అర్చకులుగా రామాలయం కొనసాగుతుంది. సీతారామాలయ ప్రాంగణంలో ఆనాడే ఆలయం శివకేశవ నిలయంగా ఉండాలన్న ఆలోచనతో ఆలయ ప్రాంగణంలో ఉమామహేశ్వరుని ఆలయాన్ని కూడా నిర్మించారు. ఉమామహేశ్వరునికి మఠం వంశస్తులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

రెండు ఆలయాలకు అనాటి కాలంలోని విఠాల వంశస్తులతో పాటు ఇతరులకు కూడా ఆలయాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా భూములను కూడా కేటాయించారు. ఆలయ అర్చకులు బీటుకూరి వంశస్థులు ఏటా భద్రాచలంలోని సీతారాముల కల్యాణంలో పాల్గొని అక్కడి తలంబ్రాలను తీసుకుని వచ్చి 15 రోజులకు గజ్వేల్‌లోని సీతారాముల కల్యాణాన్ని నిర్వహిస్తుంటారు. ఇప్పటికీ అదేవిధంగా రాముల వారి కల్యాణాన్ని నిర్వహిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా ఏటా సీతారామ ఉమామహేశ్వరు బ్రహ్మోత్సవాలు-భక్తోత్సవాలలో ఒకే కల్యాణ మంటపంపై సీతారాములకు, ఉమా మహేశ్వరులకు వేదపండితులు ఒకేసారి కల్యాణం నిర్వహిస్తుంటారు. ఒకవైపు వైష్ణవ సం ప్రదాయం, మరోవైపు శైవ సంప్రదాయంలో వేదమంత్రాల మధ్య జరిగే కల్యాణం జరుపు తారు. అలాగే కల్యాణం తర్వాత శివాలయంలో జరిగే భద్రకాళీ పూజ, అగ్నిగుండాలు తదితర కార్యక్రమాలు భక్తిపారవశ్యాన్ని కలుగజేస్తాయి. ఆ తర్వాత జరిగి సీతారాముల పుష్పరథోత్సవాన్ని దర్శించుకోవడానికి పట్టణ ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వేచి చూస్తుంటారు. ఆలయ అభివృద్ధికి కూడా ప్రభుత్వం కోట్ల రూపాయలు నిధులు కేటాయించగా, నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కాగా, రామాలయ ప్రాంగణంలో ఉమామహేశ్వరాలయంతో పాటు హనుమాన్ దేవాలయం, కన్యకాపరమేశ్వరీ ఆలయం, మార్కండేలయాలు కూడా ఉన్నాయి.

నేటి నుంచి బ్రహ్మోత్సవాలు - భక్తోత్సవాలు
గజ్వేల్‌లోని సీతారామ ఉమామహేశ్వరాలయంలో ఈనెల 26వ తేదీ నుంచి మే1వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు, భక్తోత్సవాలు నిర్వహించనున్నట్లు ధర్మకర్తలు, అర్చకులు తెలిపారు. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ధర్మకర్తలు, అర్చకులు కోరారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...