అధైర్యం వద్దు.. ఆత్మవిశ్వాసమే ముద్దు..


Wed,April 24, 2019 11:47 PM

సంగారెడ్డి చౌరస్తా: జీవితంలో ఎలాంటి సంఘటన ఎదురైనా ప్రతి ఒక్కరికి ముందుగా కావాల్సింది మనో నిబ్బరం. అవివేకంగా ఆలోచించి క్షణికావేశానికి గురైతే జీవితమే బుగ్గిపాలవుతుంది. వారి జీవితంతో పాటు సంబంధిత వ్యక్తుల కుటుంబంలో కూడా విషాదం నెలకొంటుంది. ఇది ప్రస్తుతం చర్చనీయాంశమైన ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా వర్తిస్తుంది. కేవలం ఆయా సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ఆగిపోదు అనేది నగ్న సత్యం. ఇందుకు నిదర్శనం అనేక మంది పదో తరగతి, ఇంటర్‌లో ఫెయిలై ఆ తరువాత తిరిగి ఉత్తీర్ణులై గొప్ప శాస్త్రవేత్తలుగా మారిన సందర్భాలు విద్యార్థులకు విధితమే. ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో పెద్ద సంఖ్యలో ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆత్మనూన్యతకు లోనవుతున్న పలువురు విద్యార్థులు తమ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. ఈ విషయంలో ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల ప్రవర్తనా తీరుపై వారికి తెలియకుండానే దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది.

ముఖ్యంగా ఇంటర్ చదువుతున్న విద్యార్థులు కౌమార దశలో ఉన్న కారణంగా వారు ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉన్నది. అందుకు విద్యార్థుల మానసిక, శారీరక మార్పులు కూడా ఓ కారణం అయినందున ప్రతి తల్లిదండ్రి వారి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ ఏడాది వెలువడిన ఇంటర్ ఫలితాల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఈ మేరకు బుధవారం సీఎం కేసీఆర్ సంబంధిత శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులతో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏ ఒక్క విద్యార్థి అధైర్య పడవద్దని చెప్పిన సీఏం కేసీఆర్ ఇంటర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ఉచితంగా రీ వెరిఫికేషన్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల కోరిక మేరకు రీ-వాల్యూయేషన్, రీ-కౌంటింగ్‌ను ఉచితంగా కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అయితే ఉత్తీర్ణులైన విద్యార్థులకు కూడా రీ-వాల్యూయేషన్, రీ-కౌంటింగ్‌కు అవకాశం కల్పిస్తున్నట్టు స్పష్టం చేశారు. అయితే వీరికి మాత్రం నిర్దేశిత ఫీజు చెల్లించేందుకు నిర్ణయించారు.

ప్రతి యేటా ఇదే ఫలితాలు
అయితే ఇది కేవలం ఈ ఏడాది మాత్రమే కాదు. ప్రతి ఏడు దాదాపు ఇదే ఉత్తీర్ణత శాతం నమోదవుతున్నది. ప్రతి సంవత్సరం కేవలం 2 నుంచి 5 శాతం ఉత్తీర్ణత అటు ఇటు గా మారుతూ ఉన్న విషయం తెలిసిందే. అయితే గతంలో ఒకరిద్దరు విద్యార్థులు మాత్రమే ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉండేవి. అది కూడా అనుకున్న ర్యాంకులు సాధించలేమని జరిగిన ఆత్మహత్యలే కావడం గమనార్హం. దీంతో నాటి నుంచి అధికారికంగా ర్యాంకులను ప్రకటించడాన్ని ప్రభుత్వం నిషేధించింది. పదో తరగతి వరకు ఆడుతూ పాడుతూ చదువుకున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్‌లో ప్రవేశం పొందగానే ఒక్కసారిగా ఒత్తిడి పెరగుతుందనేది నిపుణుల అభిప్రాయం. ఈ క్రమంలో ఫలితాలపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున విద్యార్థులు అధైర్య పడాల్సిన అవసరం లేదు. ప్రతిసారి మాదిరిగానే ఈ ఏడాది కూడా దాదాపు అదే ఫలితాలు నమోదయ్యాయి. సాంకేతిక లోపమో, మానవ తప్పిదమో కాని కొందరు విద్యార్థుల ఫలితాలు మాత్రం తారుమారు అయ్యాయనేది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వాదన. ఈ నేపథ్యంలోనే సంబంధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ప్రభుత్వం తక్షణమే సమావేశాన్ని నిర్వహించి ఇంటర్ విద్యార్థులకు పైవిధంగా ఊరట కల్పించింది. ఇప్పటికైనా ప్రభుత్వం కల్పించిన సదవకాశంతో ఏ ఒక్క విద్యార్థి కూడా అధైర్య పడకుండా ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్తారని ఆశిద్దాం.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...