బాల్యవివాహాలు చేస్తే కఠిన శిక్షలు


Wed,April 24, 2019 11:46 PM

సంగారెడ్డి అర్బన్, నమస్తే తెలంగాణ : పెళ్లీడుకు రాని ఆడపిల్లలకు పెండ్లీల్లు చేస్తే బాల్య వివాహాల చట్టాల కింద కఠిన శిక్షలు తప్పవని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.భవాని హెచ్చరించారు. బుధవారం సంగారెడ్డిలోని మహిళా ప్రాంగణంలో మెడ్వాన్ నెట్‌వర్క్ ఆధ్వర్యం లో మహిత ప్లాన్ ఇండియా సహకారంతో గల్స్ అడ్వకసి అలయన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం లో బాల్య వివాహాల నిరోధక అధికారులకు (ఐసీడీఎస్, సీడీపీవో, సూపర్‌వైజర్) బాల్య వివాహాల నిషేధ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భవానీ మాట్లాడారు.

పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లలను తల్లిదండ్రులు పెళ్లీడు రాకముందే పెండ్లి చేస్తే బాల్యవివాహాల చట్టం కింద నేరస్తులవుతారని హెచ్చరించారు. అంతేకాకుండా అలాంటి వివాహాలకు సహకరించిన బంధువులు, గ్రామస్తులు, కులపెద్దలు ఎవరైనా సరే చట్టానికి లోబడి చర్యలుంటాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా బాల్యవివాహాలు జరుగుతున్న విషయాలు తెలిస్తే (సీఎంపీఓ) బాల్యవివాహ నిరోధక అధికారులు తహసీల్దార్, సీడీపీవో, సూపర్‌వైజర్, వీఆర్వో, చైల్డ్‌లైన్ టీమ్స్ సభ్యులు పోలీసుల సహకారంతో పెండ్లిని నిలిపివేయాలని సూచించారు. బాల్య వివాహం చేస్తున్నారంటే బాలల హక్కులకు భంగం కలిగించినట్లేనని, చిన్నారుల బాధ్యతల గుర్తు చేసుకొని సీఎంపీవోలు విధులు నిర్వహించాలన్నారు. గ్రామస్థాయిలో బాల్యవివాహ నిషేధ, పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని జీవో ఎంఎస్ నెంబర్ 13లో ఉందని అధికారులకు గుర్తు చేశారు. బాల్యవివాహాలు అడ్డుకోవడానికి వెళ్లిన అధికారులపై దాడి చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ముఖ్యంగా పూజారులు, పాస్టర్లు, ఖాజీలకు, మండపాల యజమానులు వధూవరుల వయస్సును నిర్ధారించుకుని పనులు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మ హిళా అభివృద్ధి శిశు సంక్షేమశాఖ అధికారి మోతి, బాలల సంరక్షణ అధికారి రత్నం, మెడ్వాన్ కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, మహితా ప్లాన్ ప్రతినిధి నాగమ్మ, జిల్లా సమన్వయ కర్త విజయరేఖ, చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ యాదగిరి, సీడీపీవోలు లక్ష్మిబాయి, స్వప్న, బ్రహ్మాజీ, రేణుక, చంద్రకళ, అసిస్టెంట్ సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, మెడ్వాన్ సిబ్బంది పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...