అన్ని విధాలా ఆదుకుంటాం..


Sun,April 21, 2019 11:35 PM

-ప్రకృతి రైతులను పగబట్టింది
-సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా..
-అన్ని విధాలా సాయం అందేలా చేస్తా
-చేతికొచ్చే సమయంలో నష్టం జరుగడం బాధాకరం
-అధికారులే పొలాలకు వచ్చి నష్టం అంచనా వేస్తారు
-మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు
-వడగండ్లతో నష్టపోయిన రైతులకు భరోసా
చిన్నకోడూరు : అమ్మా ఏడ్వొద్దు.. నేనున్నా... అన్ని విధాలా సాయం చేస్తా.. రైతులను పగబట్టినట్లు పంట చేతికొచ్చే సమయంలో వడగండ్ల వాన పడి తీవ్రంగా నష్టం జరుగడం బాధాకరం. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తా.. రైతులెవరూ అధైర్యపడొద్దు.. నేనున్నానని వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఓదార్చి భరోసా ఇచ్చారు. చిన్నకోడూరు మండలం మైలారం, కమ్మర్లపల్లి, చౌడారం, మేడిపల్లి, అనంతసాగర్, చర్లఅంకిరెడ్డిపల్లి, మల్లారం, సికింద్లాపూర్ గ్రామాల్లో వడగండ్ల ధాటికి 610 మంది రైతులకు చెందిన 850 ఎకరాల వరి పంట నష్టపోగా, ఆయా పంటపొలాలను ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ గతంలో ఇలాంటి వడగండ్ల వర్షాన్ని చూడలేదని ఇంత భారీ ఎత్తున వడగండ్ల వాన కురువడంతో రైతుల పంటలకు తీవ్రంగా నష్టం జరిగిందన్నారు. వరి, మామిడి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయన్నారు.

రైతులకు నష్టపరిహారం అందేలా ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడడం జరిగిందన్నారు. ప్రభుత్వం దృష్టికి సైతం తీసుకెళ్లి రైతులకు నష్టపరిహారాన్ని అందజేస్తామని తెలిపారు. నష్టపోయిన వరి, మామిడి, కూరగాయల తోటల నివేదికను తయారు చేయాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టం వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. అధికారులే మీ పంట పొలాలకు వచ్చి నష్టం అంచనా వేస్తారని రైతులకు తెలిపారు. ప్రభు త్వం అందరినీ ఆదుకుంటుందని తెలిపారు. ఎమ్మెల్యే వెంట టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ రామచంద్రం, సొసైటీ చైర్మన్లు బాల్‌రెడ్డి, పాపయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యుడు కాముని శ్రీనివాస్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కనకరాజు, టీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు మహేశ్, వ్యవసాయాధికారులు, రెవెన్యూ అధికారులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఉన్నారు.

ఎమ్మెల్యే ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న రైతులు
మండలంలో రెండు మూడు రోజులు ఆయా గ్రామాల్లో వడగండ్లు వర్షాలు కురుస్తున్నాయి. శనివారం కురిసిన వడగండ్ల వర్షం ధాటికి చేతికొచ్చిన వరి పంట పూర్తిగా దెబ్బతిన్నాయి. వరి గింజలన్నీ నేలరాలిపోయాయి. క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించేందుకు ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆయా గ్రామాలకు రాగా.. మహిళా రైతులు ఆరుగాలం కష్టించిన పంట నేలపాలైందని ఎమ్మెల్యే ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. మరికొన్ని గ్రామాల్లో రైతులు వేల పెట్టుబడి పెట్టి పంట పండిస్తే వడగండ్ల వానతో మొత్తం నష్టం జరిగిందని ఆదుకోవాలని ఏడుస్తూ వారి వారి పంటలను ఎమ్మెల్యే హరీశ్‌రావుకు చూపించారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...