అకాల బీభత్సం


Wed,April 17, 2019 11:42 PM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. రైతుకు తీరని నష్టాన్ని మిగిల్చింది. బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా పెనుగాలులు, ఉరుములు, మెరుపులతో ప్రారంభమైన వర్షంతో హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లోని పలు గ్రామాల్లో మామిడి, వరి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. అరగంట పాటు గాలిదుమారం, వర్షంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. హుస్నాబాద్ మండలంలోని బంజేరుపల్లి, పందిల్ల, కూచనపల్లి, పొట్లపల్లి తదితర గ్రామాల్లో విరగకాసిన మామిడి చెట్లు వేళ్లతో సహా నేలకొరిగాయి. ఇతర పెద్దపెద్ద వృక్షాలు సైతం పెనుగాలులకు నేలకొరిగాయి. అక్కన్నపేట మండలం అంతకపేటలో రాయికుంట రాంచంద్రం అనే రైతుకు చెందిన పాడి ఆవు పిడుగుపాటుకు మృతి చెందింది. పిడుగుపాటుతో పలు గ్రామాల్లోని ఇండ్లలో గల ఎలక్ట్రిక్ పరికరాలు ధ్వంసమయ్యాయి. వరిపంట సైతం పెనుగాలులు, వర్షానికి దెబ్బతిని వడ్లు మొత్తం నేలరాలాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పందిల్లలో పెద్ద వృక్షం విరిగి ఇంటిపై పడింది. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కొందరు రైతులు ఆరబోసుకున్న ధాన్యం తడిసి ముద్దయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండవేడిమిని తట్టుకోలేక ఇబ్బందులు పడ్డ ప్రజలు సాయంత్రం కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడటం వల్ల కొంత ఉపశమనం పొందారు.

బెక్కల్‌లో 12 మేకల మృత్యువాత
మద్దూరు: మండంలోని బెక్కల్‌లో బుధవారం సాయంత్రం పిడుగుపాటుకు 12 మేకలు మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన బొల్లు మల్లయ్య రోజూ మాదిరిగానే ఉదయం తన మేకలను మేతకు తీసుకెళ్లగా, సాయంత్రం వర్షం రావడంతో ఓ చెట్టు నీడకు మేకలను చేర్చాడు. పెద్ద శబ్దంతో చెట్టుపై పిడుగుపడడంతో చెట్టు కింద ఉన్న మేకలు అక్కడికక్కడే మృత్యవాత పడ్డాయి. సమీపంలో ఉన్న మల్లయ్య ప్రమాదం బారినుంచి బయటపడ్డాడు. ఈ ఘటనలోతనకు సుమారు రూ. 1లక్ష నష్టం వాటిల్లిందని బాదితుడు వాపోయాడు. సంఘటన స్థలాన్ని వీఆర్వో కృష్ణంరాజు సందర్శించి పంచనామాను నిర్వహించారు.

బస్వాపూర్‌లో కొబ్బరిచెట్టుపై పిడుగు
కోహెడ: శ్రీరాములపల్లి, బస్వాపూర్, చెంచల్‌చెర్వుపల్లి, వెంకటేశ్వర్లపల్లి, సముద్రాలతో పాటు మండలంలో బుదవారం సాయంత్రం పెను గాలులతో వర్షం కురిసింది. పెనుగాలులతో కూడిన వర్షానికి చేతికొచ్చిన వరిపంట నేలకొరిగింది. అలాగే మామిడి కాయలు పెద్ద మొత్తంలో రాలాయి. పలు గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడగా, రేకుల షెడ్లు దెబ్బతిన్నాయి. బస్వాపూర్‌లో పల్లె మహేందర్ వ్యక్తి ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడి, చెట్టు కాలిపోయింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అలాగే ఇంట్లోని టీవీ, ఫ్యాన్ తదితర వస్తులు కాలిపోయాయి. ఎంపీపీ ఉప్పుల స్వామి వెంకటేశ్వర్లపల్లిలో నేల కూలిన చెట్లను, నేలరాలిన మామిడితోటలను పరిశీలించారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...