ఇక పరిషత్ పోరు


Sun,April 14, 2019 12:04 AM

- ఈ నెల 22 నుంచి మే 14 లోపు పోలింగ్
- మూడు విడుతల్లో ప్రాదేశిక ఎన్నికలు
- జిల్లాలో జడ్పీటీసీలు-22, ఎంపీటీసీలు-229
- 6.12 లక్షల మంది ఓటర్లు, 1,320 పోలింగ్ కేంద్రాలు
- బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు
- జిల్లాకు 3,873 బ్యాలెట్ బాక్సులు సిద్ధం
- డ్రాఫ్ట్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రాదేశిక పోరుకు నగారా మోగనున్నది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ఈ నెల నాల్గో వారంలో ప్రారంభమై, వచ్చే నెల 14లోపు మూడు దశల్లో పోలింగ్ జరుగనున్నది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం డ్రాఫ్ట్ విడుదల చేసింది. మొదటి విడుతలో సిద్దిపేట, రెండో విడుతలో గజ్వేల్, మూడో విడుతలో హుస్నాబాద్ డివిజన్లలో ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం కాగా, గ్రామాల్లో స్థానిక సందడి నెలకొన్నది. జిల్లా వ్యాప్తంగా 22 జడ్పీటీసీ, 229 ఎంపీటీసీ స్థానాలుండగా, జడ్పీ పీఠం జనరల్ మహిళకు కేటాయించారు. ఈ నేపథ్యంలో మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికలకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు జరుగనుండగా, జిల్లాకు 3,873 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ సైతం ప్రారంభించారు.

పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఇక పరిషత్ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. దీంతో గ్రామాల్లో ప్రాదేశిక ఎన్నికల సందడి నెలకొంది. ఈ నెల 22 నుంచి మే 14లోపు జిల్లాలో మూడు విడుతలుగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. కాగా, ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారు చేసింది. జిల్లాలో మూడు విడుతలుగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించి మొదటి విడుతలో సిద్దిపేట, రెండో విడుతలో గజ్వేల్, మూడో విడుతలో హుస్నాబాద్ డివిజన్లలో ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 22 జడ్పీటీసీ స్థానాలు, 229 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జనరల్ మహిళకు కేటాయించారు. ఈ నెల 17న అన్ని రాజకీయ పార్టీలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు.

ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు డ్రాఫ్టు ఖరారైంది. మూడు విడుతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జిల్లాలో 22 మండలాలున్నాయి. వీటి పరిధిలో మొత్తం 229 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఈ ఎన్నికలను మూడు విడుతల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్దిపేట డివిజన్ పరిధిలోని సిద్దిపేట నియోజకవర్గం సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు, దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి, రాయపోల్, దౌల్తాబాద్ మండలాలు మొదటి దశలో , గజ్వేల్ డివిజన్ పరిధిలోని గజ్వేల్, కొండపాక, ములుగు, జగదేవ్‌పూర్, మర్కూక్, వర్గల్ మండలాల్లో రెండవ దశలో , హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాలతో పాటు జనగామ నియోజకవర్గంలోని మద్దూరు, చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో మూడవ విడుతలోఎన్నికలు నిర్వహిస్తారు. దీంతో 22 మండలాల్లో ఎన్నికలను సజావుగా పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా నారాయణరావుపేట మండలం ఏర్పాటైంది. ఈ మండలానికి సంబంధించి రిజర్వేషన్ ఖరారు చేయాల్సి ఉంది. ఇది వరకే జిల్లా యూనిట్‌గా రిజర్వేషన్లు ఖరారు చేసి గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో నారాయణరావుపేట మండలానికి అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ ఖరారు చేయనున్నట్లు సమాచారం.

జిల్లాలో 1,320 పోలింగ్ కేంద్రాలు
జిల్లా వ్యాప్తంగా 1,320 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. తుది పోలింగ్ కేంద్రాల జాబితాను ఈ నెల 20న విడుదల చేయనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 400 లోపు మంది ఓటర్లు ఉంటే 1ప్లస్4 సిబ్బందిని, 400 మందికి మించి 600 లోపు ఉంటే 1ప్లస్5 సిబ్బందిని నియమిస్తున్నారు. ఇప్పటికే ఎంపీటీసీ స్థానాలకు గాను 106 రిటర్నింగ్ అధికారులను, మరో 106 ఏఆర్‌వోలను నియమించింది. జడ్పీటీసీ స్థానాలకు గాను 22 మంది ఆర్‌వోలను నియమించింది. గతంలో జడ్పీటీసీ స్థానానికి జిల్లా కేంద్రంలో నామినేషను వేసేవారు. ఈసారి మండల కేంద్రంలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇందుకోసం మూడు ఎంపీటీసీ స్థానాలకు ఒక రిటర్నింగ్ అధికారితో పాటు ఏఆర్‌వో ఉంటారు. ఒక్కో జడ్పీటీసీ స్థానానికి ఒక్కో రిటర్నింగ్ అధికారి ఉండి నామినేషన్ పత్రాలను ఆయా మండల కేంద్రాల్లోనే స్వీకరించనున్నారు.

బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు
పరషత్తు ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించనున్నారు. ఈమేరకు అవసరమైన బ్యాలెట్ బాక్సులను అధికారులు సిద్ధం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో నిర్వహించిన బ్యాలెట్ బాక్సులను ఈ ఎన్నికల్లో వినియోగించనున్నారు. జిల్లాకు 3,873 బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో 350 చిన్నవి, 3,523 పెద్ద బాక్సులున్నాయి. బ్యాలెట్ పేపర్ల ముద్రణ సైతం ప్రారంభించారు. మొత్తం జిల్లాలో 6,12,393 మంది ఓటర్లున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ సమయం వరకు ఈ సంఖ్య మరింతగాను పెరిగే అవకాశం ఉంది. ఎంపీటీసీ, జడ్పీటీసీవి కలుపుకొని సుమారుగా 15లక్షల వరకు బ్యాలెట్ పేపర్లను ముద్రించనున్నారు. ఎంపీటీసీ గులాబీ రంగు, జడ్పీటీసీ తెలుపు రంగులో బ్యాలెట్ పేపర్లు ఉంటాయి.

మండలాల వారీగా ఎంపీటీసీ స్థానాలు ఇలా..
జిల్లాలోని ఆయా మండలాల్లో ఎంపీటీసీల స్థానాలు ఇలా ఉన్నాయి. అక్కన్నపేట 12, బెజ్జంకి 10, చేర్యాల 11, చిన్నకోడూరు 14, దౌల్తాబాద్ 9, దుబ్బాక 13, గజ్వేల్ 11, హుస్నాబాద్ 6, జగదేవ్‌పూర్ 11, కోహెడ 13, కొమురవెల్లి 6, కొండపాక 14, మద్దూరు 11, మర్కూక్ 7, మిరుదొడ్డి 11, ములుగు 10, నంగునూరు 11, రాయపోల్ 8, సిద్దిపేట రూరల్ 13, సిద్దిపేట అర్బన్ 7, తొగుట 10, వర్గల్ 11 మొత్తం 229 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.

ప్రాదేశిక ఎన్నికల షెడ్యూల్ ఇలా..

1). మొదటి విడుత
నామినేషన్ల స్వీకరణ : 22-04-2019
(ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు)
నామినేషన్ల తుది గడువు : 24-04-2019
స్క్రూటినీ : 25-04-2019
నామినేషన్ల ఉపసంహరణ : 28-04-2019
(మధ్యాహ్నం 3 గంటలలోపు)
పోలింగ్ తేదీ : 06-05-2019 (ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు)

2). రెండో విడుత
నామినేషన్ల స్వీకరణ : 26-04-2019 (ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు)
నామినేషన్ల తుది గడువు : 28-04-2019
స్క్రూటినీ : 29-04-2019
నామినేషన్ల ఉపసంహరణ : 02-04-2019
(మధ్యాహ్నం 3 గంటలలోపు)
పోలింగ్ తేదీ : 10-05-2019 (ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు)

3). మూడో విడుత
నామినేషన్ల స్వీకరణ : 30-04-2019 (ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు)
నామినేషన్ల తుది గడువు : 02-05-2019
స్క్రూటినీ : 03-05-2019
నామినేషన్ల ఉపసంహరణ : 06-05-2019 (మధ్యాహ్నం 3 గంటలలోపు)
పోలింగ్ తేదీ : 14-05-2019 (ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు)

మూడు విడుతల్లో ఎన్నికలు
తొలి విడుత : సిద్దిపేట అర్బన్, రూరల్, చిన్నకోడూరు, నంగునూరు, దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయిపోల్.
రెండో విడుత: గజ్వేల్, కొండపాక, జగదేవ్‌పూర్, మర్కూక్, ములుగు, వర్గల్
మూడో విడుత: హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...