ఈవీఎంలలో.. భవితవ్యం


Sat,April 13, 2019 02:33 AM

-వచ్చే నెల 23 వరకు తప్పని టెన్షన్
-స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు భద్రం
-పటిష్ట బందోబస్తు
-జహీరాబాద్ ఈవీఎంలు గీతంలో...
-మెదక్ పార్లమెంట్ ఈవీఎంలు బీవీఆర్‌ఐటీలో...
-అధికార పార్టీలో మెజార్టీపైనే చర్చ
(సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధానప్రతినిధి) : పార్లమెంట్ ఎన్నికల ప్రశాంతంగా ముగిసినప్పటికీ అభ్యర్థ్ధులకు మాత్రం టెన్షన్ తప్పలేదు. ఫలితాలు వెల్లడి కావడానికి నెలరోజులకు పైగా సమయం ఉండడంతో ఈవీఎంలలో ఉన్న భవితవ్యంపై ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. అధికార పార్టీలో మాత్రం మెజార్టీపైనే చర్చ జరుగుతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. రెండు నియోజకవర్గాలకు ప్రశాంతంగా ఎన్నికలు పూర్తవగా గురువారం రాత్రి ఈవీఎంలను స్ట్రాంగ్ రూములకు తరలించారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోకవర్గ ఈవీఎంలను పటాన్‌చెరు మండలంలోని గీతం యూనివర్సిటీకి, మెదక్ పార్లమెంట్ ఈవీఎంలను నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీ కళాశాలలోని స్ట్రాంగ్ రూములకు తరలించారు. సీసీ కెమెరాలు, ప్రత్యేక పోలీసు బలగాల భద్రత మధ్య ఈవీఎంలను భద్రపరిచారు. వచ్చే నెల 23న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో అప్పటి వరకు రాజకీయ పార్టీలకు టెన్షన్ తప్పని పరిస్థితి నెలకొన్నది. కాగా, ఈ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక కాంగ్రెస్, బీజేపీల ప్రచారం నామా మాత్రంగానే కొనసాగింది. ఈ లెక్కన రెండు నియోజకవర్గాల్లో వార్‌వన్ సైడ్‌గానే ఉండనున్నదని, మెజార్టీపైనే అంచనాలు వేసుకుంటున్నామని టీఆర్‌ఎస్ నాయకులు ధీమాతో చెబుతున్నారు.

మెజార్టీపై ప్రభావం చూపనున్న పోలింగ్ శాతం
జహీరాబాద్, మెదక్ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే పోలింగ్ శాతం తగ్గింది. తగ్గిన పోలింగ్ శాతం మెజార్టీపై ప్రభావం చూపనున్నదని, ప్రధానంగా మెదక్ పార్లమెంట్ పరిధిలో అధికార టీఆర్‌ఎస్‌లో చర్చ జరుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మెదక్‌లో పోలింగ్ శాతం బాగానే నమోదైంది. ఇక్కడ 71.71 శాతం పోలింగ్ నమోదు కాగా, జహీరాబాద్‌లో 69.67 శాతం పోలింగ్ నమోదైంది. లక్షల మెజార్టీయే లక్ష్యంగా మెదక్‌లో టీఆర్‌ఎస్ ప్రచారం కొనసాగింది. ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, మెదక్, సంగారెడ్డి, పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. దాదాపుగా అన్ని మండలాలను చుట్టేశారు. సభలు, సమావేశాలు, రోడ్‌షోలతో అనుకున్న స్థాయిలో ప్రచారం చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని అందోలు, నారాయణఖేడ్, జహీరాబాద్‌లో కూడా జోరుగా అధికార పార్టీ ప్రచారం కొనసాగింది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీల నుంచి పోటీ ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ మంచి మెజార్టీతో విజయం సాధిస్తారని టీఆర్‌ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. అయితే రెండు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గడంపై టీఆర్‌ఎస్‌లో ఒకింత ఆందోళన వ్యక్తం అవుతున్నది. తగ్గిన పోలింగ్ శాతం మెజార్టీపై ప్రభావం చూపనున్నదంటున్నారు.

స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు భద్రం
రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూములలో భద్ర పరిచారు. సీసీ కెమెరాలు, పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య ఈవీఎంలను భద్ర పరిచారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎం మిషన్లను నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీ కళాశాలలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను పటాన్‌చెరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూములలో భద్ర పరిచారు. గీతంలో సంగారెడ్డి కలెక్టర్ హనుమంతారావు, బీవీఆర్‌ఐటీలో మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డిలు స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. భద్రత ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. మే 23 వరకు ప్రత్యేక పోలీసు బలగాలు ఇక్కడ బందోబస్తు నిర్వహించనున్నాయి. రోజువారిగా ఆయా జిల్లాల ఎస్పీలు భద్రను పర్యవేక్షించనున్నారు.

ఎవరి లెక్కలు వారివి..
ప్రశాంతంగా పోలింగ్ పూర్తి కాగా, పార్టీల నాయకులు ఇప్పుడు ఓట్లపై లెక్కలు వేసుకుంటున్నారు. ఎవరికి వారు ఫలానా ఓట్లు తమకే పడ్డాయని లెక్కలు కడుతున్నారు. నామా మాత్రంగానే ప్రచారం చేసినా తమ పార్టీకి ఓట్లు బాగానే పడ్డాయంటూ బీజేపీ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్‌కు ఈసారి జనం ఓట్లు వేశారని ఆ పార్టీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. అధికార టీఆర్‌ఎస్ మాత్రం మెజార్టీపైనే లెక్కలు వేసుకుంటున్నది. రెండు పార్లమెంట్ నియోకవర్గాల్లో మంచి మెజార్టీతో టీఆర్‌ఎస్ అభ్యర్ధులు విజయం సాధించనున్నారని ధీమాతో ఉన్నారు. కాగా, గత కొద్ది రోజులుగా మండుతున్న ఎండల్లో ప్రచారంలో పాల్గొన పార్టీల లీడర్లు ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో టూర్లు వెళుతున్నారు. త్వరలోనే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నోటిఫికేషన్ వచ్చే లోగా కొంత రెస్ట్ తీసుకోవడానికి టూర్ వెళుతున్నామని పార్టీల లీడర్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీల నాయకులు శుక్రవారం ఎవరూ పెద్దగా కనిపించలేదు. ఇతర ప్రాంతాలకు వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నప్పటికీ వారి మనసంతా ఈవీఎంలపైనే ఉంటున్నది. మే 23 ఎప్పుడు రానున్నది..? ఫలితాలు ఎప్పుడు వెలువడనున్నాయనే ఆసక్తి నెలకొన్నది.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...