ముగిసిన ఓట్ల పండుగ


Fri,April 12, 2019 12:10 AM

- ప్రశాంతంగా పార్లమెంట్ పోలింగ్
- జిల్లావ్యాప్తంగా 72.18 శాతం పోలింగ్ నమోదు
- స్వగ్రామం చింతమడకలో ఓటేసిన సీఎం కేసీఆర్ దంపతులు
- సిద్దిపేట, పోతారం, చిట్టాపూర్‌లలో ఓటు హక్కు వినియోగించుకున్న హరీశ్‌రావు, కేపీఆర్, సోలిపేట
- ఉదయం ఉద్ధృతంగా..మధ్యాహ్నం మందకొడిగా ఓటింగ్
- సిద్దిపేట 19 వార్డులో ఓటేసిన 102 ఏండ్ల వృద్ధురాలు
- పోలింగ్ సరళిని పరిశీలించిన మంత్రి ఈటల, జిల్లా ఎమ్మెల్యేలు
- ఉదయం నుంచే ఓటేసేందుకు బారులు
- గజ్వేల్ నియోజకవర్గంలో 76.50 శాతం, సిద్దిపేటలో 68.17, దుబ్బాకలో 73.81, హుస్నాబాద్‌లో 69.94 శాతం నమోదు
- స్ట్రాంగ్‌రూంలకు తరలిన ఈవీఎంలు.. మే 23న కౌంటింగ్

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఓ ఘట్టం ముగిసింది. పార్లమెంట్ ఎన్నికల సమరంలో అతికీలకమైన పోలింగ్ ప్రక్రియ గురువారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. తొలినుంచి ఎన్నికల యంత్రాంగం, పోలీసు ఉన్నతాధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టడడంతో ఎక్కడా చిన్న ఘటన కూడా చోటు చేసుకోలేదు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగానే చాలామంది ఓటర్లు తరలి వచ్చి ఓటేశారు. ఎండ మండిపోవడంతో మధ్యాహ్నం తర్వాత మందకొడిగా సాగి జిల్లా వ్యాప్తంగా 72.18 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా గజ్వేల్ నియోజకవర్గంలో 76.50 శాతం, దుబ్బాకలో 73.81 శాతం, హుస్నాబాద్ 69.94 శాతం, సిద్దిపేట నియోజకవర్గంలో 68.17 శాతం పోలింగ్ నమోదైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు స్వగ్రామం చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం సీఎం అభివాదం చేస్తూ, గ్రామస్తులను ఆప్యాయంగా పలుకరించారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీశ్ రావు, ఎంపీ అభ్యర్థి కేపీఆర్ దుబ్బాక మండలం పోతారంలో, ఎమ్మెల్యే సోలిపేట చిట్టాపూర్‌లో, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ సిద్దిపేటలో ఓటేశారు. కలెక్టర్ కృష్ణభాస్కర్, జేసీ పద్మాకర్, సీపీ జోయల్ డెవిస్ ఆయా పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఎంపీ అభ్యర్థి కేపీఆర్ దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో పర్యటించి ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ సిద్దిపేట రూరల్ మండలం ఇబ్రహీంపూర్ పోలింగ్ కేంద్రంలో టీఆర్‌ఎస్ ఏజెంట్లను దుర్భాషలాడడంతో వారు పోలీసులు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కొత్తగా ఓటు హక్కు వచ్చినవారితోపాటు 102 ఏండ్ల వృద్ధురాలు కాటం బాలమ్మ సిద్దిపేట 19 వార్డులో ఓటేసింది.

పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల సంగ్రామం ముగిసింది. జిల్లా పరిధిలో మెదక్, కరీంనగర్, భువనగిరి పార్లమెంట్ స్థానాలుండగా, ఉదయం 7గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు ఎన్నికలు జరుగగా, జిల్లా వ్యాప్తంగా 72.18 శాతం పోలింగ్ నమోదైంది. సిద్దిపేట నియోజకవర్గంలో 68.17 శాతం, గజ్వేల్‌లో 76.50శాతం, హుస్నాబాద్ 69.94 శాతం, దుబ్బాకలో 73.81శాతం పోలింగ్ కాగా, మే 23న ఓట్ల లెక్కింపు జరుగనున్నది. ఎన్నికల నిర్వహణపై ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషనర్ వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలించగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కృష్ణభాస్కర్, జాయింట్ కలెక్టర్ పద్మాకర్‌లు జిల్లాలో పర్యటిస్తూ ఆయా పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వారివారి నియోజకవర్గాల్లో పోలింగ్ సరళిని ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, రామలింగారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, సతీశ్‌కుమార్ పరిశీలించారు. మెదక్ పార్లమెంట్ స్థానానికి పోటీలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళి తెలుసుకున్నారు.

ఉదయం పూట బారులు తీరిన ఓటర్లు
గ్రామాలు, పట్టణాల్లో ఉదయం పూటనే మహిళలు, పురుషులు, వృద్ధులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉదయం మందకొడిగా సాగిన 9 తర్వాత పుంజుకుంది. మధ్యాహ్నం సమయంలో పోలింగ్ మందకోడిగా కొనసాగింది. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్‌చైర్లు, వాహనాలు ఏర్పాటు చేయడంతో వారంతా ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనా, ఎండను సైతం జనం లెక్క చేయకుండా ఓటు హక్కు విని యోగించుకున్నారు. సిద్దిపేటలో 102 ఏండ్ల వృద్ధురాలు కాటం బాలమ్మ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భువనగిరి నియోజకవర్గం మద్దూరు మండలంలోని అర్జున్‌పట్ల, కమలాయపల్లి గ్రామాల ను చేర్యాల మండలంలో కలుపాలని ఆ గ్రామస్తులు ఉదయం ఓటింగ్‌లో పాల్గొనలేదు. పోలీసు, రెవెన్యూ యంత్రాంగం గ్రామానికి వెళ్లి సర్దిచెప్పడంతో మధ్యాహ్నం తర్వాత ఓట్లు వేశారు. అక్కన్నపేట మండలంలోని కేశ్‌నాయక్ తండాలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయలేదని, తాము ఓటు వేయమని గ్రామస్తులు చెప్పగా, అధికారులు గ్రామానికి వెళ్లి, సర్ది చెప్పిన తర్వాత పక్కనే ఉన్న గొల్లపల్లి గ్రామానికి వెళ్లి ఓటింగ్‌లో పాల్గొన్నారు. సిద్దిపేట రూరల్ మండలం ఇబ్రహీంపూర్ పోలింగ్ కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ చేరుకొని టీఆర్‌ఎస్ ఏజెంట్లను దుర్భాషలాడగా, అతనిపై టీఆర్‌ఎస్ నాయకులు ఠాణా, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరిన ఈవీఎంలు
జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల నుంచి నియోజకవర్గ కేంద్రాలైన సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ పరిధిలోని డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలకు ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్లు చేరుకున్నాయి. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎంలను, వీవీ ప్యాట్లను మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని బీవీఆర్ ఐటీ కళాశాలకు తరలించేందుకు అధికారులు, ఎన్నికల యంత్రాంగం నిమగ్నమైంది. సిద్దిపేటలోని ఇందూర్ కళాశాలలో గురువారం రాత్రి జిల్లా ఎన్నికల అధికారి కృష్ణభాస్కర్, జేసీ పద్మాకర్, ఆర్డీవో జయచంద్రారెడ్డి ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపు చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా గ్రామాల నుంచి వచ్చిన ఈవీఎంలు, వీవీప్యాట్లను నర్సాపూర్ తరలించేందుకు సిద్ధం చేస్తున్న తీరుతెన్నులను పర్యవేక్షించారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...