ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం కేసీఆర్ దంపతులు


Fri,April 12, 2019 12:08 AM

సిద్దిపేట రూరల్ : పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం తన సొంత గ్రామం చింతమడకలో సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని చింతమడక జిల్లా పరిషత్ హైస్కూల్ బూత్‌లోకి వెళ్లి, రెండు నిమిషాల్లో ఓటు వేసి, తిరిగి వాహనంలో బయలుదేరారు. అంతకు ముందు సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల వద్ద సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలు స్వాగతం పలికారు.

గ్రామస్తులకు అభివాదం చేస్తూ..
ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన సీఎం కేసీఆర్ దంపతులు, ఓటు వేసేందుకు క్యూ లైన్లలో వేచి ఉన్న గ్రామస్తులకు అభివాదం చేస్తూ పోలింగ్ స్టేషన్‌లోకి వెళ్లారు. హుందాగా గ్రామస్తులందరికీ దండాలు పెడుతూ అంతా బాగేనా.. అంటూ పలుకరించడంతో గ్రామస్తులంతా సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చింతమడక వచ్చిన నేపథ్యంలో సిద్దిపేట సీపీ కమిషనర్ జోయెల్ డెవిస్, అడిషనల్ డీసీపీలు నర్సింహారెడ్డి, బాపురావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఓటేసిన హరీశ్‌రావు, ప్రముఖులు..
కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : సిద్దిపేటలోని భారత్‌నగర్ అంబిటాస్ స్కూల్‌లోని 107వ పోలింగ్ కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సుతో కలిసి ఎమ్మెల్యే హరీశ్‌రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత్‌నగర్‌లోని న్యూజనరేషన్ కళాశాలలో పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్ దంపతులు, చిన్నకోడూరు మండలం గోనెపల్లిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి దంపతులు, సిద్దిపేట హరిప్రియనగర్‌లో కలెక్టర్ కృష్ణభాస్కర్, నాసర్‌పుర ఉర్దూ మీడియం పాఠశాలలో సీపీ జోయల్ డెవిస్ దంపతులు, రూరల్ మండలం ఇర్కోడులో రాష్ట్ర సివిల్ సైప్లె కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అంబేద్కర్‌నగర్ ఉర్దూమీడియం పాఠశాలలో టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఎంపీ అభ్యర్థి కేపీఆర్, ఎమ్మెల్యే సోలిపేట..
దుబ్బాక: మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఆయన సతీమణి మంజులత, కుమారుడు పృథ్వీ, కూతురు కీర్తి స్వగ్రామం దుబ్బాక మండలం పోతారం లో ఓటు వేశారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, ఆయన సతీమణి సుజాత, కొడుకు సతీష్‌రెడ్డి, కోడలు అనూష చిట్టాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొగుట మండలం తుక్కాపూర్‌లో మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి, ఆయన భార్య విజయలక్ష్మి, కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి ఓటు వేశారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...