నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్


Fri,April 12, 2019 12:08 AM

దుబ్బాక, నమస్తే తెలంగాణ/ దుబ్బాకటౌన్/మిరుదొడ్డి/ తొగుట/ రాయపోల్: నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. పలు పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించటంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ కృష్ణభాస్కర్, జేసీ పద్మాకర్, మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి వేర్వేరుగా పరిశీలించారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగియటంతో అధికారులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు...
నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించటంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దుబ్బాక మండలం చీకోడ్, కమ్మర్‌పల్లి గ్రామాల్లో ప్రారంభసమయంలోనే ఈవీఎంలు మొరాయించటంతో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. తిమ్మాపూర్‌లో పోలింగ్‌కేంద్రంలో సాయంత్రం 4 గంటల సమయంలో ఈవీఎం మొరాయించగా ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు అరగంట పాటు ఇబ్బంది పడ్డారు. మిరుదొడ్డి మండలకేంద్రంలో, తొగుట మండలం ఘణపూర్‌లో, రాయపోల్ మండలం మంతూర్ పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

73.81శాతం పోలింగ్
పార్లమెంట్ ఎన్నికలలో దుబ్బాక నియోజకవర్గంలో 73.81శాతం పోలింగ్ జరిగినట్లు దుబ్బాక ఏఆర్వో నవీన్‌కుమార్ తెలిపారు. ఉదయం 9 గంటల వరకు 16.49 శాతం పోలింగ్ జరిగింది. 11 గంటల వరకు 39.26 శాతం, మధ్యాహ్నం 1 వరకు 48.67శాతం, 3 గంటల వరకు 65.95 శాతం, అనంతరం 73.81 శాతంతో పోలింగ్ ముగిసింది. శాసనసభ ఎన్నికలతో పోల్చితే పార్లమెంట్ ఎన్నికలలో పోలింగ్ శాతం తగ్గింది. దుబ్బాక నియోజకవర్గంలో శాసనసభ ఎన్నికలలో 85.99శాతం పోలింగ్ జరిగితే ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలలో 73.81 శాతం పోలింగ్ జరిగింది. 12.18శాతం పోలింగ్ తగ్గింది. ఇందుకు ఉష్ణోగ్రత ప్రభావమే కారణామని రాజకీయనేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


టీఆర్‌ఎస్‌కు 16 ఎంపీ సీట్లు ఖాయం
దుబ్బాక టౌన్: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ 16 ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని దుబ్బాక నియోజకవర్గంలో లక్ష మెజార్టీ ఖాయమని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. గురువారం తన స్వగ్రామమైన చిట్టాపూర్‌లో కుటుంబ సభ్యులతో ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం విలేకరుల సమావేశంలో సోలిపేట మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కార్యకర్తలే కరువైనారన్నారు. ప్రతి కార్యకర్త టీఆర్‌ఎస్ విజయానికి కృషి చేస్తున్నారని, 99 శాతం ఓట్లు టీఆర్‌ఎస్‌కు అనుకూలమేనని ఆయన అన్నారు.

పోలింగ్ సరళిని పరిశీలించిన కొత్త ప్రభాకర్‌రెడ్డి
మిరుదొడ్డి: మండల పరిధిలోని భూంపల్లి గ్రామంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని గురువారం టీఆర్‌ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి సందర్శించి పోలింగ్ సరళిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య, జిల్లా గ్రంథాలయ బోర్డు డైరెక్టర్ బోయ శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ జిల్లా మానిటరింగ్ బోర్డు సభ్యుడు ఎర్మని దుబ్బరాజం, గ్రామ టీఆర్‌ఎస్ నేతలు తదితరులు ఉన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...