తుది అంకానికి మండలి పోరు


Tue,March 19, 2019 11:35 PM

-22న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
-నేటి సాయంత్రంతో ముగియనున్న ప్రచారం
-పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు 24 మంది అభ్యర్థులు పోటీ
-దూసుకెళ్తున్న గ్రాడ్యుయేట్ అభ్యర్థి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్
కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు గత నెల 25న నోటిఫికేషన్ విడుదలైంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధిలో జరిగే ఈ ఎన్నికలకు అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలై, ఈ నెల 5న ముగిసింది. ఈ నెల 8న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత, రెండు నియోజకవర్గాల్లో 24 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పట్టభద్రుల స్థానానికి 17 మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఏడుగురు పోటీలో ఉన్నారు. ఈ నెల 22న ఎన్నికలు ఉండగా, ఇప్పటికే అభ్యర్థులంతా రంగంలోకి దిగారు. గెలుపుపై దృష్టి సారించి, నాలుగు ఉమ్మడి జిల్లాలు తిరుగుతున్నారు. టీచర్లు, గ్రాడ్యుయేట్ల మద్దతు కూడగడుతున్నారు. ఎవరికి వారే హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం.. నేటి సాయంత్రంతో ప్రచారం ముగియనుండగా, సాధ్యమైనంత మేర ఎక్కువ మంది ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

దూసుకెళ్తున్న చంద్రశేఖర్‌గౌడ్..
పట్టభద్రుల ఎమ్మెల్సీకి 17 మంది పోటీ పడుతుండగా, మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఒక సామాన్య కుటుంబం నుంచి గ్రూపు -1 అధికారిగా ఎదిగిన చంద్రశేఖర్, తనదైన శైలిలో అందరిని కలుపుకుంటూ వెళ్తున్నారు. ఉద్యమ సమయంలో చురకైన పాత్ర పోషించిన ఆయనకు, టీఎన్జీవోల సంఘాల సభ్యులు ముందు నుంచి సంపూర్ణ మద్దుతు ప్రకటించారు. ట్రస్మా సంఘం సభ్యులు కూడా మద్దతు తెలిపారు. వీరు కూడా చంద్రశేఖర్‌గౌడ్ తరఫున విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ముందు నుంచి ఈ సంఘాల ప్రతినిధులు ప్రణాళికాబద్ధంగా ఓటర్ల వద్దకు వెళ్తున్నారు. అలాగే, పీఆర్టీయూ, ప్రైవేట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, తదిర సంఘాల ప్రతినిధులు ఇప్పటికే మద్దతు ప్రకటించి ప్రచారం ముమ్మరం చేశారు. వీరితోపాటు సెకండ్ గ్రేడ్ టీచర్స్ ఫోరం, బీసీ సంఘాల సభ్యులు కూడా తమ మద్దతును ప్రకటించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా చంద్రశేఖర్‌గౌడ్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. అటు మెజార్టీ సంఘాల నాయకులు, ఇటు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చంద్రశేఖర్‌గౌడ్ వైపు ప్రచారం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పెద్దల సభలో మేధాసంపత్తి ఉండాలన్న లక్ష్యంతో తాను ఎమ్మెల్సీ బరిలోకి దిగాననీ, పట్టభద్రులంతా తనకు ఓటువేసి గెలిపించాలని చంద్రశేఖర్ గౌడ్ విజ్ఞప్తి చేస్తున్నారు.

పూర్వ కరీంనగర్ కీలకం..
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూర్వ కరీంనగర్ జిల్లా ఓటర్లే కీలక పాత్ర పోషించనున్నారు. పూర్వ కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీగా పేరు ఉన్నప్పటికీ, గతంలో ఉన్న ఆ నాలుగు జిల్లాల పరిధి పునర్వ్యవస్థీకరణ తదుపరి 15 జిల్లాలకు పెరిగింది. పూర్వ నాలుగు జిల్లాలో ఉన్న ఓటర్లు ప్రస్తుతం 15 జిల్లాల పరిధిలో ఉన్నారు. కాగా, ఈ సారి ఎన్నికల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి 23,214 మంది ఉపాధ్యాయ, అధ్యాపకులు ఓటర్లుగా తమ పేరును నమోదు చేసుకున్నారు. ఇందులో పూర్వ కరీంనగర్ ఉమ్మడి జిల్లానుంచే 6,289 మంది ఉన్నారు. అభ్యర్థి గెలుపు, ఓటమిలో ఇక్కడి ఓటర్లే కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఓట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అభ్యర్థులంతా ఇక్కడే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ విషయంలోనూ అదే పరిస్థితి ఉంది. మొత్తం 1,96,321 ఓట్లు ఉండగా, ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 80,366 ఓట్లున్నాయి. అందులోనూ కొత్త కరీంనగర్ జిల్లాలోనే 35,703 ఓట్లున్నాయి. అంటే అభ్యర్థుల గెలుపోటములను పూర్వ కరీంనగర్ జిల్లాలో నిర్ణయించే అవకాశముండగా, మెజార్టీ అభ్యర్థులు తమ ప్రచార సమయాన్ని ఎక్కువగా ఇక్కడే చేస్తున్నారు.

పకడ్బందీ ఏర్పాట్లు..
ఈనెల 22 పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్ల్లు చేస్తున్నారు. మొత్తం 15 జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 253, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి 313 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల కోసం అధికారులను ప్రత్యేక పరిశీలకులుగా నియమించారు. అంతేకాదు, గంట గంటకూ పోలింగ్ వివరాలను అన్ని కేంద్రాల వద్ద నుంచి తెప్పించేందుకు సిద్ధం చేశారు. అలాగే, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఇతర కార్యాలయాల్లో పనిచేసే వారు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని సదరు యాజమాన్యాలకు ఆదేశాలిచ్చారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...