ప్రతి పల్లెలో గొర్రెల షెడ్ల నిర్మాణాలు


Mon,March 18, 2019 11:12 PM

-గొల్ల కురుమలకు అండగా ఉంటాం
-గొల్ల కురుమల సమావేశంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు
కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమంతో గొల్లకురుమల కుటుంబాల్లో వెలుగులు నింపారని ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం సిద్దిపేటలోని తన నివాసంలో సిద్దిపేట నియోజకవర్గ గొల్లకురుమలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గంలోని గొల్లకురుమలకు అండగా ఉంటామని చెప్పారు. ప్రతి గ్రామంలో గొర్రెల షెడ్లు నిర్మించేందుకు ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని సూచించారు. సీఎం కేసీఆర్ గొల్లకురుమలకు జీవనోపాధి పెంచేందుకు గొర్రెల పంపిణీ చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రతి గ్రామంలోను గొర్రెల పంపిణీ చేశామని, గొర్రెలకు మంచి వసతి ఉండే విధంగా సామూహిక గొర్రెల షెడ్డులను నిర్మాణం చేపట్టాలన్నారు.

నియోజకవర్గంలో ఇప్పటికే ఇబ్రహీంపూర్, నర్మెట, ఇర్కోడు, గంగాపూర్ గ్రామాల్లో సామూహిక గొర్రెల షెడ్లు నిర్మించామన్నారు. అన్ని గ్రామాల్లో గొర్రెల షెడ్లు నిర్మించాలన్నారు. పుల్లూరు, ఎన్సాన్‌పల్లి, బుస్సాపూర్ గ్రామాల్లో గొర్రెల షెడ్లు నిర్మించేందుకు గొల్లకురుమలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో స్థలాలు ఉన్నాయని సర్పంచ్‌లు ఎమ్మెల్యే హరీశ్‌రావు దృష్టికి తీసుకురావడంతో ఆయా గ్రామాల్లో సర్పంచ్‌లు, గొల్లకురుమల సహకారంతో గ్రామంలో వారు సూచించిన స్థలాలను పరిశీలించాలని తహసీల్దార్లను ఆదేశించారు. వెంటనే స్థల సేకరణ పూర్తి చేసి పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఈజీఎస్ అధికారులు, టీఏలకు సూచించారు.

గొర్రెలను కాపాడుకునే బాధ్యత మీదే..
గొర్రెలు ఇచ్చి గొల్లకురుమల కుటుంబాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారు. మీకిచ్చిన గొర్రెలను కాపాడుకునే బాధ్యత మీది. గొర్రెలతో పాటు షెడ్లను కూడా కట్టిస్తున్నాం. గొర్రెలను అమ్ముకోవద్దని గొల్లకురుమలకు సూచించారు. నియోజకవర్గంలో గొర్రెల యూనిట్లపై వెటర్నరీ ఏడీతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామంలో వెటర్నరీ డాక్టర్లు అందుబాటులో ఉండాలన్నారు. ఈ సందర్భంగా గొల్లకురుమలతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు సాదాసీదాగా నేలపై కూర్చుని మూడు గంటల పాటు ఆయా గ్రామాల నుంచి వచ్చిన ప్రజలను కలుస్తూ గ్రామాల్లోని సమస్యలపై ప్రతినిధులతో చర్చిస్తూ పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ వారి సమస్యలను ఓపిగ్గా వింటూ సాదా సీదాగా గడిపారు. కార్యక్రమంలో ఎంపీపీలు కూర మాణిక్యరెడ్డి, జాప శ్రీకాంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...