నేటి నుంచి నామినేషన్లు


Sun,March 17, 2019 10:47 PM

-ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ
-ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి
-మొత్తం 2043 పోలింగ్ కేంద్రాలు
-4086 మంది పీవోలు, ఏపీవోలు
-8172 మంది సిబ్బందితో ఎన్నికల విధులు
-అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా డీఆర్‌వో వెంకటేశ్వర్లు
మెదక్ ప్రతినిధి,నమస్తే తెలంగాణ :మెదక్ పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. కలెక్టర్, పార్లమెంట్ ఎన్నికల అధికారి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మెదక్ కలెక్టరేట్‌లో కలెక్టర్ చాంబర్‌నే ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంగా ఏర్పాటు చేశారు. అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా డీఆర్‌వో వెంకటేశ్వర్లను నియమించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోటీచేసే అభ్యర్థులు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధర్మారెడ్డి నమస్తే తెలంగాణ ప్రతినిధితో తెలిపారు.

రేపు మెదక్ పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికెషన్ వెలువరించిన అనంతరం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. వంద మీటర్ల బయటనే తమ వాహనాలను నిలిపి నామినేషన్ వేసే క్యాండెట్‌తో సహా ఐదుగురికి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి నామినేషన్ వేయడానికి అనుమతి ఉన్నది. కలెక్టరేట్ ప్రహరీ బయటనే పార్కింగ్‌కు స్థలాలను ఏర్పాటు చేశారు.
ఈ నెల 18 సోమవారం నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 26న నామినేషన్ల పరిశీలన (స్క్యూట్నీ) ఉంటుంది. ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున అన్ని రాజకీయ పార్టీల నాయకులు తప్పకుండా వీటిని పాటించాలని కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధర్మారెడ్డి సూచించారు.

కలెక్టర్ చాంబర్‌లోనే ప్రత్యేక కౌంటర్లు..
నామినేషన్ల స్వీకరణ కోసం మెదక్ కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ధర్మారెడ్డి, సహాయ ఎన్నికల అధికారిగా డీఆర్‌వో వెంకటేశ్వర్లు వ్యవహరిస్తున్నారు. ఈ రెండు కౌంటర్లతో పాటు సహాయకులు విధులు నిర్వహించనున్నారు. నేటి నుంచి నామినేషన్ల పత్రాలు కలెక్టరేట్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు.

21, 23, 24 సెలవులు..
నామినేషన్లు స్వీకరించబడవు...
ఈ నెల 21, 23, 24వ తేదీల్లో సెలవులు ఉన్నందున ఈ తేదీల్లో నామినేషన్లు స్వీకరించబడవని కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధర్మారెడ్డి తెలిపారు.

అభ్యర్థులు బ్యాంకు ఖాతాలతోనే
- నామినేషన్ డిపాజిట్లు చెల్లించాలి..
అభ్యర్థులు బ్యాంకు ఖాతాలతోనే నామినేషన్ డిపాజిట్లు చెల్లించాలని ప్రత్యేకంగా బ్యాంకు అకౌంట్‌ను ప్రతీ అభ్యర్థి తీయాలని కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధర్మారెడ్డి వెల్లడించారు. అభ్యర్థులు తమకు సంబంధించిన అఫిడవిట్, ఇన్‌కమ్‌ట్యాక్స్, విద్యా ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఆస్తుల బకాయిలు ఉండకూడదు. అభ్యర్థులకు నేర చరిత్ర, తమపై నమోదైన కేసులకు సంబంధించి అఫిడవిట్స్‌ను ఇవ్వాల్సి ఉంటుందని ఎన్నికల అధికారి తెలిపారు. నామినేషన్ పత్రాలతో పాటు అఫిడవిట్‌ను అభ్యర్థులు సమర్పించాల్సి ఉంటుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. మెదక్ పార్లమెంట్‌లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక అసిస్టెంట్ ఎన్నికల అధికారిణి నియమించినట్లు కలెక్టర్ వెల్లడించారు.

మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో
-2043 పోలింగ్ కేంద్రాలు...
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం 2043 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ధర్మారెడ్డి వెల్లడించారు. ఎన్నికల పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు 4086 మందితో కలిపి 8172 మంది పోలింగ్ సిబ్బంది అవసరాన్ని గుర్తించి నియమించినట్లు తెలిపారు. మొత్తంగా పోలీస్, పోలింగ్ సిబ్బంది కలిపి 16 వేల మంది వరకు ఎన్నికల విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. 10 శాతం మంది ఉద్యోగులను రిజర్వులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు.

ప్రత్యేక కమిటీలు.. స్పెషల్ స్కాడ్‌లు
ఎన్నికల నిబంధనలు అమలు చేసేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాల్లో ప్లయింగ్ స్కాడ్ బృందాలు, వీడియో, సర్వేలైన్ బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ బృందాలు ఎన్నికల పోలింగ్ వరకు విసృతంగా తనిఖీలు నిర్వహిస్తాయని కలెక్టర్ వివరించారు.
నామినేషన్ల ప్రక్రియకు భారీ బందోబస్తు..
నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో కలెక్టర్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద ప్రత్యేక బందోబస్తును ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ చందనదీప్తి తెలిపారు. ఎఎస్పీ నాగరాజుతో పాటు, డీఎస్పీ, సీఐలు, ఎస్‌ఐలు విధులు నిర్వహించనున్నారు.

పోలీంగ్ అధికారులకు శిక్షణ పూర్తి...
పోలింగ్ నిర్వహించే పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులకు శిక్షణ పూర్తయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధర్మారెడ్డి తెలిపారు. ఇప్పటికే రాజకీయ పార్టీల నాయకులకు సమావేశాలు నిర్వహించి ఎన్నికల కోడ్ ఇతర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు సహకరించి ఎన్నికల నియమావళిని అందరూ పాటించాలని కలెక్టర్ ధర్మారెడ్డి కోరారు.
కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు...
ఎన్నికల కోడ్ ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధర్మారెడ్డి హెచ్చరించారు. అభ్యర్థులకు సంబంధించిన అనుమతులన్ని ఆన్‌లైన్‌లోనే ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
నర్సాపూర్‌లో కౌంటింగ్...
18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26 న నామినేషన్లు పరిశీలన చేస్తా రు. 28 న నామినేషన్ల ఉపసంహరణ, ఏప్రిల్ 11 న పోలి ంగ్ ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు. మే 23న ఓట్ల లెక్కింపు నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...