కిడ్నీ రోగులుకు సాంత్వన


Sat,March 16, 2019 11:48 PM

-సిద్దిపేట ప్రభుత్వ డయాలసిస్ కేంద్రంలోఅత్యుత్తమ సేవలు
-10 యంత్రాలు..10 పడకలు ఏర్పాటు
-నిత్యం 35 నుంచి 40 మందికి రక్తశుద్ధి
-20 నెలల్లో 10,070 సెషన్లలో డయాలసిస్
-ప్రైవేటు దవాఖానల్లో ఈ సేవలు ఖరీదు
-కార్పొరేట్ దవాఖానలకు దీటుగాప్రభుత్వ వైద్య సేవలు
-సౌలత్‌లు బాగున్నాయని రోగుల కితాబు
కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : ఒక్కసారి కిడ్నీలు పాడై రోగానికి గురైతే ఆ రోగికి నరకయాతన. కిడ్నీలను బాగు చేసే వైద్య ప్రక్రియ డయాలసిస్. డయాలసిస్ అంటే మూత్రపిండాలు పనిచేయడం ఆపివేసినప్పుడు వాటిని కృత్రిమంగా పనిచేయించడం.. అంటే శరీరంలో చేరుకున్న అనవసర పదార్థాలు, నీరు, లవణం, ఆమ్లము వంటి రసాయనిక పదార్థాల నుంచి కృత్రిమ పద్ధతిలో రక్తాన్ని శుభ్రపరిచే ప్రక్రియ డయాలసిస్ అంటారు. డయాలసిస్ ప్రక్రియ ఒకప్పుడు ఎక్కువ ఖర్చుతో కూడుకొని ఉండేది. దీనివల్ల కిడ్నీ రోగులు ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతుండేవారు. కార్పొరేట్ ఆస్పత్రుల్ల్లో మాత్రమే అందుబాటులోఉండేది. దీనిని గుర్తించిన సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసి కిడ్నీ వ్యాధి బాధితులకు అండగా నిలిచారు. సిద్దిపేటకు డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా సిద్దిపేటలో ఉచిత డయాలసిస్ సేవలను 2017 ఆగస్టు 17న అప్పటి మంత్రులు లకా్ష్మరెడ్డి, హరీశ్‌రావులు ప్రారంభించారు. ఇప్పటికీ నిత్యం 80 మంది రోగులకు 10,070 సెషన్లు రోగులకు చికిత్స అందిస్తున్నారు.

కిడ్నీ వ్యాధికి గురైతే దాని వైద్యానికి ఆయ్యే ఖర్చుతో వ్యాధికి గురైన కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా కుంగిపోవడం ఒక ఎత్తు అయితే, వారి కుటుంబ సభ్యుల బాధలు వర్ణాతీతం.. కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సిద్దిపేటలో డయాలసిస్ సెంటర్‌ను ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో సిద్దిపేట జిల్లా దవాఖానలో ఏర్పాటు చేయించారు. ఇందుకోసం ప్రభుత్వం, డీమెడ్ ఏజెన్సీలు సంయుక్తంగా సిద్దిపేటలో 05 యంత్రాలు 05 మంచాలతో ప్రారంభించారు. కాగా, రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతుండటంతో మరో 5 యం త్రాలు, 5 మంచాలను ఏర్పాటు చేశారు. డయాలసిస్ కోసం ప్రత్యేక ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. డయాలసిస్ సెంటర్‌లో వైద్య సేవలను ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు సుమారు 80మంది కిడ్నీ రోగులకు 10,070సెషన్లో డయాలసిస్ సేవలను అందించారు. జిల్లావ్యాప్తంగా అధికారికంగా డయాలసిస్ సెంటర్‌లో వైద్య సేవల కోసం 80మంది కిడ్నీ రోగులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. రోగులకు 10 యంత్రాల ద్వారా డయాలసిస్ చేస్తున్నారు.

ఒక్కొక్క రోగికి 4 గంటల పాటు డయాలసిస్ చేస్తారు. మొత్తం 10 డయాలసిస్ యంత్రాల ద్వారా రోగుల రక్తాన్ని శుద్ధి చేస్తున్నారు. రోజుకు సుమారు 35-40 మంది రోగులకు డయాలసిస్ చేస్తున్నారు. ఒక్కో రోగికి డయాలసిస్ చేసే ప్రక్రియను సెషన్ అంటారు. ఒక సెషన్లో 4 గంటల పాటు రోగుల రక్తాన్ని శుద్ధి చేస్తారు. రోగులకు రక్తాన్ని శుద్ధి చేసేటప్పుడు అవసరమైన ఎరితోపటిన్ ఐరన్ ఇంజక్షన్లను ఉచితంగా అందిస్తున్నారు. రోగులకు రక్తశుద్ధి చేయడం కోసం ప్రైవేట్ ఆసుపత్రిలోను ఒక డయాలైజర్‌ను సుమారు 5 నుంచి 10మార్లు వాడుతారు. కానీ ఈ సెంటర్‌లో ఒక రోగికి ఒక డయాలైజర్‌ను ఒకసారి మాత్రమే వాడుతారు. దేశంలోనే ఈ విధానం అమలు చేస్తున్న తొలి డయాలసిస్ సెంటర్ సిద్దిపేట. ఆరోగ్యశ్రీ ద్వారా పేద రోగులకు ఇక్కడ ఉచితంగా వైద్య సేవలు అందుతాయి. మందులను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది. కిడ్నీ వ్యాధి భాధితులు డయాలసిస్ కోసం సిద్దిపేటకు వచ్చేందుకు ఉచితంగా ప్రభుత్వం బస్సు పాస్‌లను అందిస్తుంది. సిద్దిపేట జిల్లాతో పాటు ఇతర సమీప జిల్లాల నుంచి కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేసుకోవడానికి మంచి అవకాశం కల్పించింది.

సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం
రెండేండ్ల కింద కిడ్నీ వ్యాధి వచ్చింది. దీంతో హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖానలో వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకున్న. నెలకు సుమారు రూ.10 నుంచి 12 వేలు ఖర్చయ్యేది. దీంతో పాటు వారానికి రెండుమార్లు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. సిద్దిపేటలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసి మా బాధ తీర్చిండ్రు. డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్, హరీశ్‌రావుసార్‌కు రుణపడి ఉంటాం.
-సావిలి సరోజినిదేవి (కొండపాక మండలం, వెలికట్ట)

బీదలకు మేలు
కిడ్నీ వ్యాధితో రెండేం డ్లుగా ఇబ్బందులు పడుతున్న. వ్యాధి రావడం మా కుటుంబాన్ని తీవ్ర మనోవేదనకు గురిచేసింది. వారానికి రెండుసార్లు కరీంనగర్‌లో డయాలసిస్ చేయించుకున్నం. ఇప్పుడు సిద్దిపేటలో ప్రారంభం కావడంతో ఇక్కడకు వచ్చి డయాలసిస్ చేయించుకుంటున్నాం. డయాలసిస్ సెం టర్ ఏర్పాటు చేయడంతో మాలాంటి బీదలకు ఎంతో మేలు జరుగుతుంది. ఉచితంగా బస్సు పాస్‌లను అందిస్తుంది. ఎమ్మెల్యే హరీశ్‌రావుకు ధన్యవాదాలు.
-సుశీల (నంగునూరు మండలం, కొండంరాజ్‌పల్లి)

మంచి సౌలత్ చేసిండ్రు
కిడ్నీల వ్యాధి వచ్చిన మొదట్లో హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖాండ్ల డయాలసిస్ చేయించుకున్న... కాని వారానికి మూడు సార్లు పట్నం పోయి రావడం వల్ల ఇబ్బంది పడేటోళ్లం. నెలాకు రూ. 3000 ఖర్చు అయ్యేది. ఐదు నెల్లానుంచి సిద్దిపేటకు వచ్చి చూపించుకుంటున్న, ఇక్కడ మంచి సౌలత్ చేసిండ్రు, దీంతో పట్నం పోయె భాద తప్పింది. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
-కె.నర్సింలు (దుబ్బాక మండలం, చిన్ననిజాంపేట)

రోజుకు 35-40 మంది రోగులకు డయాలసిస్
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 80 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ కోసం తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ సెంటర్‌లో ఒక డయాలైజర్‌ను ఒక రోగికి ఒక సారి మాత్రమే వాడుతున్నాం. మొత్తం 10 బెడ్‌ల్లో రోజుకు 4 షిప్టుల్లో 35-40 మందికి నిత్యం డయాలసిస్ సేవలు అందుతున్నాయి.
-కిషన్ (డయాలసిస్ సెంటర్ ఇన్‌చార్జి)

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...