రెట్టింపు ఆసరా


Sat,March 16, 2019 12:19 AM

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : శాసన సభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఆసరా పెన్షన్లు రెట్టింపు కానున్నాయి. వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు భరోసానిస్తున్న ఆసరా పెన్షన్లు రెట్టింపు కానుండడంతో లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయస్సు కుదించడంతో జిల్లాలో కొత్తగా 27,197 మంది ఆసరా పెన్షన్‌కు అర్హత పొందారు. ఇది వరకు ఉన్న లబ్ధిదారులతో పాటు కొత్త వారికి పెంచిన పెన్షన్ల ప్రకారం ఏప్రిల్ మాసం నుంచి ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేశారు.

సిద్దిపేట జిల్లాలోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, గీత కార్మికులు, చేనేత, బీడీ కార్మికులు తదితర వర్గాలకు చెందిన వారికి నెలనెలా ప్రభుత్వం పెన్షన్లను అందిస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో రూ.200 ఉన్న పెన్షన్‌ను టీఆర్‌ఎస్ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి రాగానే, వృద్ధుల పెన్షన్‌ను రూ.వెయ్యికి పెంచింది. వికలాంగులకు రూ.1500 చేసింది. దీంతో ఆ వర్గాలకు చెందిన లబ్ధిదారులు సంతోషంగా తమ జీవితాలను వెల్లదీస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులు 1,66,692 మంది ఉన్నారు. వీరికి ప్రతి నెలా సుమారుగా రూ.18 కోట్లను చెల్లిస్తున్నది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో వృద్ధాప్య పెన్షన్‌దారులు 58,009మంది, వితంతువులు 50,916, వికలాంగులు 14,961, చేనేత కార్మికులు 2,261, గీత కార్మికులు 2,712, బీడీ కార్మికులు 34,436, ఒంటరి మహిళలు 31,197 మంది లబ్ధిదారులు ఉన్నారు. బోదకాలు వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.వెయ్యి చొప్పున పెన్షన్ అందిస్తున్నది సర్కారు. పెన్షన్‌దారుల వయస్సు అర్హత కుదింపుతో జిల్లాలో ఆయా మండలాల్లోని 27,197 మంది అర్హత పొందారు. వీరందరినీ కలుపుకొని ఏప్రిల్ మాసంలో రెట్టింపు చేసిన పెన్షన్‌ను సర్కారు అందించనున్నది. ప్రస్తుతం ఉన్న పెన్షన్ రెట్టింపు కానుండడంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. రూ.వెయ్యి ఉన్న పెన్షన్ రూ.2,016, వికలాంగులకు రూ.1500 ఉన్న పెన్షన్ రూ.3016 కానున్నది. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్‌తో వృద్ధులతో పాటు వివిధ వర్గాలకు చెందిన వారు ఆత్మగౌరవంతో జీవితాన్ని కొనసాగించనున్నారు.

వయస్సు అర్హత కుదింపుతో 27,197 మందికి లబ్ధి
జిల్లాలోని 22 మండలాలు, 5 మున్సిపాలిటీల్లో కొత్తగా మరో 27,197 మంది పెన్షన్ పొందడానికి అర్హత పొందారు. ప్రభుత్వం 58 ఏండ్లకే పెన్షన్ ఇస్తుండడంతో లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. మండలాల వారీగా చూసుకుంటే.. అక్కన్నపేట మండలంలో 1,123 మంది, హుస్నాబాద్ మండలంలో 568, హుస్నాబాద్ మున్సిపాలిటీలో 816, కోహెడ మండలంలో 823, బెజ్జంకిలో 638, చేర్యాల మండలంలో 1,033, చేర్యాల మున్సిపాలిటీలో 907, కొమురవెల్లి మండలంలో 476, మద్దూరులో 1,102, దుబ్బాక మున్సిపాలిటీలో 2,948, దుబ్బాక మండలంలో 1,502, మిరుదొడ్డి మండలంలో 800, రాయిపోల్‌లో 1,028, తొగుటలో 776, గజ్వేల్ మండలంలో 508, గజ్వేల్ మున్సిపాలిటీలో 262, జగదేవ్‌పూర్ మండలంలో 862, కొండపాకలో 436, మర్కూక్‌లో 630, ములుగులో 748, వర్గల్‌లో 715, చిన్నకోడూరులో 3,246, నంగునూరులో 427, సిద్దిపేట రూరల్‌లో 744, సిద్దిపేట అర్బన్‌లో, మున్సిపాలిటీలో 2,874 మంది పెన్షన్‌కు అర్హులయ్యారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...