హుండీ దొంగతనం కేసులో నిందితుల రిమాండ్


Sat,March 16, 2019 12:18 AM

గజ్వేల్‌టౌన్ : ఈనెల 1న జగదేవ్‌పూర్ మండలం తీగుల్ నర్సాపూర్ గ్రామంలోని కొండపోచమ్మ దేవాలయంలో హుండీలో నగదును అపహరించిన దొంగలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రజ్ఞాఫూర్‌లోని ఏసీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నారాయణ వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ నాగోలులో నివాసముంటున్న కారు డ్రైవర్లు ఐదుగురు కల్లు తాగేందుకు చేర్యాల మండలం దొమ్మాటకు వచ్చారు. రాత్రి వరకు ఫుల్లుగా తాగి 10.30 గంటల సమయంలో కొమురవెల్లి మీదుగా కొండపోచమ్మకు చేరుకున్నారు. అప్పటికే కొండపోచమ్మ దేవాలయం మూసివేయడంతో అదునుగా భావించిన నాగర్‌కర్నూలుకు చెందిన డేరంగుల మల్లేశ్, శివ, నల్గొండకు చెందిన పల్సం సత్యనారాయణ, సింగం, వరంగల్‌కు చెందిన బోయిని రాజులు తమవెంట కారులో తెచ్చుకున్న కట్టర్‌ల సాయంతో ఆలయం డోర్‌ను కట్ చేశారు.

ఆ తర్వాత మూడు హుండీలను కట్ చేసి అందులోని నగదునున దొంగిలించారు. మరో హుండీ తాళం కట్టర్‌కు రాకపోవడంతో కారులో హుండీని తీసుకెళ్లి మార్గమధ్యలో ధ్వంసం చేసి అందులోని నగదును సమానంగా రూ.12వేల చొప్పున పంచుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆలయంలోని సీసీ కెమెరాల్లో పుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలించారు. కారు నెం బర్‌ను గుర్తించి మిత్రా ఏజెన్సీ కారు షోరూంలో కారును స్వాధీనం చేసుకొని దొంగతనానికి పాల్పడిన పల్సం సత్యనారాయణ, బోయిన రాజు, సింగంలను అదుపులోకి తీసుకొని విచారించగా చోరీ చిట్టా విప్పారు. వారిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.28,860 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డేరంగుల మల్లేశ్, శివ పరారీలో ఉన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన రూరల్ సీఐ శివలింగం, ఎస్‌ఐ సాయి రాం, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...