ఆధునికం ..సౌకర్యవంతం


Mon,February 18, 2019 11:23 PM

-దుబ్బాకలో ఆధునిక రీతిలో కూరగాయల మార్కెట్
-రూ.1.21 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి
-రైతులకు, వినియోగదారులకు అన్ని సౌలత్‌లు
-మూడు జిల్లాల రైతులకు తీరనున్న వెతలు
దుబ్బాక టౌన్: ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి పండించిన కూరగాయలను అమ్ముకునేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులు తీరనున్నాయి. ఆధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ దుబ్బాక పట్టణంలో త్వరలో అందుబాటులోకి రానుంది. పెద్ద చెరువు సమీపంలో రూ. కోటి 21 లక్షల నిధులతో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నేతృత్వంలో మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణలో నిర్మాణ పనులు జరిగాయి. సుమారు 120ల మీటర్ల పొడువుతో 6 మీటర్ల వెడల్పుతో ఈ కూరగాయల మార్కెట్‌ను నిర్మించారు. ఇంతకాలం స్థానిక తెలంగాణ తల్లి చౌరస్తా నుంచి లచ్చపేట రోడ్డు వరకు ఉన్న రోడ్డు పైనే కూర్చొని కూరగాయల విక్రయాలు జరుపుతున్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి శనివారం జరిగే అంగడి ఇదే ప్రాంతం కావడంతో రాకపోకలకు మరింత ఇబ్బందిగా మారింది. కూరగాయలు అమ్ముకునేందుకు దుబ్బాక ప్రాంతం నుంచే కాకుండా మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్ పక్క జిల్లాలైన కామారెడ్డి, రాజన్న సిరిసిల్లా, మెదక్ తదితర ప్రాంతాల నుంచి తాము పండించిన కూరగాయలను అమ్ముకునేందుకు ఇక్కడి వస్తున్నారు.

ఈ ప్రాంతంలో ఎండా, వాన నుంచి కాపాడేందుకు ఎలాంటి షెడ్లు లేక ఇబ్బందులు పడుతూ కూరగాయలను అమ్ముకుంటున్నారు. ఈ ఇబ్బందులు గమనించిన ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ నిర్మించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు దృష్టికి తేగా, మార్కెట్ నిర్మాణానికి మంజూరునిచ్చిన మంత్రే శంకుస్థాపన చేశారు. దీంతో రైతులకు, వినియోగదారులకు ఇబ్బందులు కలుగకుండాఉండడంతో పాటు ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు నిరూపయోగంగా ఉన్న చెరువు కట్టపై కూరగాయల మార్కెట్ నిర్మించారు. ఈ నిర్మాణంతో కట్ట మరింత బలోపేతంగా తయారైంది. అంతే కాకుండా ప్రజలకు, రైతులకు ఎంతో సౌకర్యవంతంగా మారింది. ఈ ఆధునాతన రైతు బజారులో కూరగాయలు అమ్ముకునే వీలుగా 39 దుకాణాలను ఏర్పాటు చేశారు. ఒక్కో దుకాణంలో ఇద్దరు అమ్ముకునే వీలుంది. రైతులకు, వినియోగదారులకు తాగేందుకు మంచినీటి ప్లాంట్, మహిళలకు, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు, ఇరుపక్కల స్వాగత తోరణాలు, గార్డెనింగ్ చేపట్టనున్నారు. నిర్మాణ పనులను ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఎస్‌ఈ ఉమామహేశ్వర్‌రావు, డిప్యూటీ డైరెక్టర్ మల్లేశం, డీఈ ఆకుల మహేందర్ నిరంతర పర్యవేక్షించారు.

రైతులు, ప్రజలకు ఉపయోగకరం
దుబ్బాకలో కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రజలకు, రైతులకు అందుబాటులోకి త్వరలో రానుంది. నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్‌లో 80మంది రైతులు అమ్ముకునే వీలుగా ఏర్పాటు చేశాం. ఇప్పటికే రైతుల నుంచి 120కి పైగా దరఖాస్తులు వచ్చాయి. నిజమైన రైతుల ఎంపిక జరుగుతున్నది. సుదూర ప్రాంతాల నుంచి కూరగాయలు విక్రయించుకునేందుకు వచ్చే రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. అలాగే కొనుగోలు చేసే వినియోగదారులకు ఎండా, వాన నుంచి రక్షణ చర్యలు తీసుకున్నాం.
- సోలిపేట రామలింగారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...