ప్రజావాణిలో నూతన ఒరవడికి శ్రీకారం


Mon,February 18, 2019 11:16 PM

-అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
-ప్రజావాణిలో 84విజ్ఞప్తులు
-సత్వరమే పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆదేశం
కలెక్టరేట్, నమస్తే తెలంగాణ: ప్రతి సోమవారం ప్రజల నుంచి విజ్ఞప్తులను తీసుకునే ప్రజావాణి వీడియో వీక్షణంగా మారింది. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జరిగే ప్రజావాణిలో కొత్త మార్పుకు జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ శ్రీకారం చుట్టారు. ప్రజావాణి కార్యక్రమంలో మండలాల్లోని తహసీల్దార్, రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో అన్నిశాఖలు హాజరుకావాలని ఈ నెల 16న కలెక్టర్ సర్కూలర్ జారీ చేశారు. జిల్లాలోని ఆయా మండల కేంద్రంలోని తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహించిన మండలస్థాయి అధికారులంతా తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించినప్పటికీ మండల స్థాయిలో సక్రమంగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించకపోవడం వల్ల అర్జీదారులు వివిధ గ్రామాల నుంచి వ్యవప్రయాసాలు పడుతూ జిల్లా కేంద్రానికి వచ్చి అర్జీలు సమర్పిస్తున్నారని సర్కూలర్‌లో పేర్కొన్నారు. గత వారంతోపాటు ఈ సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో సైతం హాజరుకాని జిల్లా అధికారుల తీరుపై కలెక్టర్ కృష్ణభాస్కర్ అగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని మండల కేం ద్రాల్లో మండల అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, జేసీ పద్మాకర్, డీఆర్వో చంద్రశేఖర్‌లు వీక్షించారు.

పలు మండలాలకు చెందిన విజ్ఞప్తులను అక్కడికక్కడే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విన్నవించినా వ్యక్తులను చూపుతూ వారి విజ్ఞప్తిని సత్వరమే పరిష్కరించాలని మండల అధికారులను ఆదేశించారు. అయితే జిల్లా కేంద్రం సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ శాఖల వారీగా హాజరుకాని జిల్లా అధికారులకు గతంలోనే మెమో జారీ చేసినప్పటికీ వివరణ ఇవ్వలేదని తమాషాలు చేస్తున్నారా.. అంటూ అగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు హాజరుకాని అధికారుల విషయమై ఆరా తీయగా, లీగల్ మెట్రాలజీ, ఆర్టీసీ, ఏజీఎం-నాబార్డు, ఎక్సైజ్‌శాఖ, అసిస్టెంట్ లేబర్, సెట్వీన్ ఎండీలకు వెంటనే స్పెషల్ మెమోలు జారీ చేయాలని డీఆర్వో చంద్రశేఖర్‌కు సూచించారు. ప్రజా సమస్యలు పరిష్కారం కోసమే ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నామని, వచ్చిన విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అధికారిక యంత్రాంగానికి కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి 84విజ్ఞప్తులు వచ్చినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిశీలించి పరిష్కరించే దిశగా కృషి చేయాలని అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో జేసీ పద్మాకర్, డీఆర్వో చంద్రశేఖర్, డీడబ్ల్యూవో జరీనాబేగం, డీఈవో రవికాంత్, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...