జీవన ప్రమాణాలు పెంచడమే నిజమైన అభివృద్ధి


Mon,February 18, 2019 11:15 PM

-ప్రజా సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శం
-దుబ్బాకలో ఫైర్‌స్టేషన్ ఏర్పాటుతో దశాబ్దాల కల నెరవేరింది..
-మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి,దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి
దుబ్బాక టౌన్ : ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే నిజమైన అభివృద్ధిగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం భావించే మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం దుబ్బాకలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో కలిసి అగ్నిమాపక వాహనాన్ని ప్రారంభించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనంలో తాత్కాలికంగా అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుతో దుబ్బాక ప్రజల దశాబ్దాల కల నెరవేరిందన్నారు. మారుమూల ప్రాంతం దుబ్బాకకు లక్షల రూపాయలు వెచ్చించి అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ప్రభుత్వ పని తీరుకు నిదర్శనమన్నారు. 30ఏండ్లుగా గత ప్రభుత్వాలను వేడుకున్నా ఫలితం లేదని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజావసరాల కోసం పాటుపడుతుందనడానికి అగ్నిమాపక కేంద్ర ఏర్పాటే నిదర్శనమన్నారు. దుబ్బాక ప్రాంతంలో ఏ అగ్ని ప్రమాదం జరిగిన సిద్దిపేట లాంటి దూర ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలను తెప్పించుకునే వారని తీరా నష్టం భారీగా జరిగిపోయేందన్నారు. దుబ్బాకలో ఏర్పాటు చేసిన అగ్నిమాపక కేంద్రంతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మేలు జరగుతుందన్నారు. గ్రామాల్లో ప్రమాదం జరిగిన చోటుకు అగ్నిమాపక వాహనం వెళ్లేందుకు తగిన సౌకర్యాన్ని గ్రామస్తులు వెంటనే కల్పించి ప్రమాద తీవ్రతను తగ్గించాలన్నారు. అందుకు గ్రామాల్లో అగ్నిమాపక సిబ్బంది అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.

ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ అగ్నిమాపక యంత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేసుకోవద్దన్నారు. అగ్ని ప్రమాదాలే కాదు వరదలు, రోడ్డు ప్రమాదాలు వంటివి జరిగిన సేవలందించేందుకు అగ్నిమాపక సిబ్బంది సిద్ధంగా ఉంటారన్నారు. దుబ్బాకలో సుమారు 45లక్షల నిధులతో అధునాతన సౌకర్యాలతో కూడిన అగ్నిమాపక వాహనం అందుబాటులోకి వచ్చిందన్నారు. త్వరలోనే చిన్నచిన్న ప్రమాదాలను అరికట్టేందుకు బుల్లెట్ వాహనాలను అందుబాటులోకి రానున్నాయన్నారు. ఫైర్‌స్టేషన్ నిర్మాణం కోసం తన సొంత స్థలాన్ని అందజేసిన రేపాక గోపాల్‌రెడ్డిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే రైతు గోపాల్‌రెడ్డిని సన్మానించారు. ఉమ్మడి జిల్లా అగ్నిమాపక కేంద్రాల అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ దుబ్బాకలో త్వరలోనే సొంత భవనం ఏర్పాటవుతుందన్నారు. ఇప్పటికే 12 మంది సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వాహనంలోని ప్రత్యేకతలను ఎమ్మెల్యేకు చూపించారు. అనంతరం తాత్కాలిక భవనంలో ఎంపీ, ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సిద్దిపేట, మెదక్ జిల్లాల అగ్నిమాపక కేంద్రాల సహాయ అధికారి పి.సురేశ్‌కుమార్, అధికారులు సుదర్శన్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్, రాఘవరెడ్డి, దుబ్బాక, మిరుదొడ్డి ఎంపీపీలు ర్యాకం పద్మాశ్రీరాములు, పంజాల కవితాశ్రీనివాస్‌గౌడ్, తహసీల్దార్ అన్వర్, కమిషనర్ నర్సయ్య, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు బక్కి వెంకటయ్య, రొట్టె రాజమౌళి, సంజీవరెడ్డి, బాల్‌రెడ్డి, ఎల్లారెడ్డి, బాలకిషన్‌గౌడ్, రొట్టె రమేశ్, పర్సకృష్ణ, ఆసస్వామి, బండిరాజు, ఆస యాదగిరి, చీకోడ్ సర్పంచ్ తౌడ శ్రీనివాస్ పాల్గొన్నారు. కార్యక్రమం అనంత రం స్థానిక తెలంగాణ తల్లి చౌరస్తాలో అగ్నిమాపక పనితీరును ప్రదర్శించగా ఎంపీ, ఎమ్మెల్యేలు స్వయంగా పరిశీలించారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 అగ్నిమాపక కేంద్రాలు :ఉమ్మడి జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్
ఉమ్మడి మెదక్ జిల్లాలో నూతనంగా ప్రారంభించిన దుబ్బాకతో పాటు మొత్తం 10అగ్నిమాపక కేంద్రాలు పని చేస్తున్నాయని ఉమ్మడి జిల్లా అగ్నిమాపక అధికారి వి.శ్రీనివాస్ అన్నారు. సోమవారం దుబ్బాకలో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్‌చెరువు, జోగిపేట, సదాశివపేట, నారాయణ్‌ఖేడ్, గజ్వేల్, సిద్దిపేట, మెదక్, దుబ్బాకలో అగ్నిమాపక కేంద్రాలు పని చేస్తుండగా, రామాయంపేట, హుస్నాబాద్, నర్సాపూర్‌లలో ఫైర్‌అవుట్ పోస్టులుగా పని చేస్తున్నాయని శ్రీనివాస్ తెలిపారు. త్వరలోనే ఈ మూడు ఫైర్‌అవుట్ పోస్టు లు రెగ్యులర్ అగ్నిమాపక కేంద్రాలుగా మారబోతున్నాయన్నారు. ఫైర్‌అవుట్ పోస్టులకు రూ.20 లక్షల 36వేల రూపాయలను ఏడాది పాటు నిర్వహణకు ఓ ఏజెన్సీ ద్వారా సిబ్బందిని నియమించి అగ్నిమాపక కేంద్రాన్ని నిర్వహించేవారని రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఉమ్మడి జిల్లాలోని మూడు ఫైర్‌అవుట్ పోస్టులు త్వరలోనే రెగ్యులర్ కాబోతున్నాయన్నారు.

జిల్లాలో అగ్నిమాపక వాహనాలు, సిబ్బందికి ఎలాంటి కొరత లేదని శ్రీనివాస్ తెలిపారు. అత్యవసర సమయంలో హోంగార్డు సేవలను వినియోగించుకుంటున్నామని శ్రీనివాస్ తెలిపారు. దుబ్బాకలో అందుబాటులో తెచ్చిన అగ్నిమాపక వాహనంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. ఎలాంటి అగ్ని ప్రమాదమైన నివారించగలిగే సౌకర్యాలు వాహనంలో ఉన్నాయన్నారు. సిద్దిపేట నుంచి రామాయంపేట మధ్య ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరిగిన ఈ వాహనం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 12 మంది సిబ్బందిని దుబ్బాక అగ్నిమాపక కేంద్రంలో అందుబాటులో ఉంచామన్నారు. ఏడాదిలోగా శాశ్వత భవనాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సిద్దిపేటలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో వెదురు బొంగులు, కట్టెలు ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని తమ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించి నష్టాన్ని నివారించగలిగారని తెలిపారు. సిద్దిపేట, హుస్నాబాద్ నుంచి అగ్నిమాపక వాహనాలను తెప్పించి మూడు గంటల్లో మంటలను అదుపులోకి తెచ్చామన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...