గజ్వేల్‌లో రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం


Sun,February 17, 2019 11:13 PM

-క్రీడాసౌకర్యాల మెరుగుకు చర్యలు
-మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
గజ్వేల్, నమస్తే తెలంగాణ: ఉమ్మడి 10జిల్లాలకు చెందిన బాలుర, బాలికల 4వ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు ఆదివారం రాత్రి గజ్వేల్ శివాలయం ప్లేగ్రౌండ్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడాపోటీలను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సీసీ జోయల్ డెవిస్‌తో కలిసి ప్రారంభించారు. అంతకు ముందు క్రీడాకారులు అమరజవాన్ల మృతిపట్ల రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం మార్చ్‌ఫాస్ట్ నిర్వహించారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి క్రీడాకారులతో పరిచయం అనంతరం సర్వీస్‌తో వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం ప్రభు త్వం ప్రాధాన్యతను కల్పిస్తూ బడ్జెట్‌లో గతంలో ఎప్పుడూ లేనివిధంగా నిధులు కేటాయించిందని తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి క్రీడాకారులు ఎదుగాలన్నారు. గ్రామీణ స్థాయి నుంచి నైపుణ్యం కలిగిన క్రీడాకారులు అంచెలంచెలుగా రాష్ట్ర, జాతీ య, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి తమ రాష్ర్టానికి గుర్తింపు తేవాలని సూచించారు. ఇందుకోసం క్రీడా సౌకర్యాలు మెరుగుపర్చడంతోపాటు క్రీడాకారుల్లో నైపుణ్యం పెంచడానికి శిక్షణ ఏర్పాట్లను రాష్ట్ర ప్రభు త్వం కల్పిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ క్రీడలపై అత్యంత ప్రాధాన్యత చూపిస్తారని, అందుకోసం నిధులను కూడా బడ్జెట్‌లో గతంలో ఎప్పుడూ లేని విధంగా కేటాయించినట్లు తెలిపారు. గజ్వేల్‌లో క్రీడాసౌకర్యాలు మెరుగుపర్చడానికి అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రీడాపోటీల్లో భవిష్యత్‌లో మంచి క్రీడాకారులుగా ఎదిగి గుర్తింపు తీసుకురావాలని సూచించారు
.
క్రీడలు స్ఫూర్తినిస్తాయి: సీపీ జోయల్ డెవిస్
నేను, మా నాన్న వాలీబాల్ ప్లేయర్లమని, ఆటలపై తమకు ఎంతో ఆసక్తి ఉంటుందని సిద్దిపేట సీపీ జోయల్ డెవిస్ పేర్కొన్నారు. జీవితంలో క్రీడాకారులకు గెలుపోటములు స్ఫూర్తినిచ్చి మిగతా వారీ లాగా కాకుండా తమ సాధారణ జీవితానికి కొత్త తొవ్వను చూపుతాయన్నారు. క్రీడలకు సంబంధం లేని వ్యక్తు లు తమ జీవితంలో ఓటమి పాలైనప్పుడు మానసిక క్షోభకు గురై ఆవేదనతో ఇబ్బందులకు గురవుతారన్నారు. క్రీడలను గజ్వేల్‌లో రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించడం శుభపరిణమమని, స్థానిక క్రీడాకారులకు ఇది మంచి అవకాశమని నిర్వాహకులు క్రీడలు నిర్వహించడం హర్షనీయమన్నారు.
వాలీబాల్ మన సంప్రదాయ క్రీడ
టూరిజం కార్పొరేషన్ చైర్మన్, భూపతిరెడ్డి
వాలీబాల్ మన రాష్ట్ర సంప్రదాయ క్రీడ అని, అంతర్జాతీయ స్థాయిలో వాలీబాల్ మంచి గుర్తింపు ఉందని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ భూపతిరెడ్డి అన్నారు. క్రికెట్‌పై క్రీడా అభిమానులు ఎక్కువ ఆసక్తి చూపుతుండగా, వాలీబాల్‌కు కూడా క్రీడాకారులు గుర్తింపు లభించడం హర్షనీయమన్నారు. ఆటల వల్ల శారీరక, మానసికోల్లాసం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, శ్రీధర్‌రావు, గజ్వేల్ పట్టణ ప్రముఖులు మాదాటి జశ్వంత్‌రెడ్డి, వినోద్‌రెడ్డి, వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్‌బాబు, జిల్లా కార్యదర్శి నర్సింలు, కొన్నె రాజిరెడ్డి, ఎన్సీ రాజమౌళి, ఎన్సీ రాజయ్య, ఊడెం కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...