ఇక రైతు వేదికలు


Fri,February 15, 2019 11:35 PM

- త్వరలో జిల్లావ్యాప్తంగా నిర్మించేందుకు సర్కారు శ్రీకారం
- జిల్లాలో 121 వేదికల నిర్మాణానికి ప్రతిపాదనలు
- వేదికలో ఏఈవో కార్యాలయం, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, సమావేశ మందిరం, భూసార పరీక్ష కేంద్రం
- ఇక్కడే రైతులంతా కూర్చొని మద్దతు ధర నిర్ణయించేలా ఏర్పాట్లు
- ఆమోదం రాగానే పనులు ప్రారంభం
- రైతునురాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం
చేర్యాల, నమస్తే తెలంగాణ:రాష్ట్రంలో రైతును రాజు చేసేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇప్పటికే రైతు బంధు పథకంతో పెట్టబడి సాయం, రైతుబీమా అమలు చేసి రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపిన తెలంగాణ సర్కారు ఇక రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ రైతులకు సేవలందించేందుకు మరో చారిత్మ్రక కార్యక్రమానికి నాంది పలుకనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ విస్తీర్ణాధికారి పరిధిలోని ప్రధాన గ్రామాల్లో ఒక వేదిక నిర్మించేందుకు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి ఇటీవల ప్రతిపాదనలు పం పించారు. వేదికల నిర్మాణం కోసం ఇప్పటికే జిల్లాలోని అన్ని వ్యవసాయశాఖ క్లస్టర్ గ్రామాల్లో భూములను సైతం గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాలతో పాటు ఆయా ప్రధాన గ్రామాల్లో 121 రైతు వేదికలు నిర్మించేందుకు సంబంధితశాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు.

ఇక రైతు వేదికల నిర్మాణాలతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. వ్యవసాయశాఖ అధికారులు ప్రతి 5వేల ఎకరాలకు వ్యవసాయ విస్తీర్ణాధికారి పరిధిని ఏర్పాటు చేశారు. ఇదే ప్రతిపాదికన రైతు వేదికలు నిర్మాణానికి నోచుకోనున్నాయి. రైతు వేదికలో ఏఈవో కార్యాలయం, రైతులకు ప్రభు త్వం పంపిణీ చేసే ఎరువులు, విత్తనాలు, సబ్సిడీ పరికరాల నిల్వ కోసం, టాయిలెట్స్, సమావేశపు గది నిర్మాణాలతో పాటు ప్రహరీ నిర్మించడంతో పాటు మైక్‌సెట్, ప్యాన్లు, తాగునీరు తదితర వసతులు కల్పించనున్నారు. అలాగే రైతులు వారి భూములను పరీక్షలు చేయించుకునేందుకు భూసార పరీక్షా కేంద్రాలను అందులో ఏర్పాటు చేయనున్నారు. రైతు వేదికల వద్ద రైతులు సమావేశం ఏర్పాటు చేసుకొని వారి పంటల మద్దతు ధర, వాతావరణ, సీజన్ల వారీగా సాగు చేయాల్సిన పంటల తదితర వాటిని చర్చించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారు. ప్రతి మూడు గ్రామాల పరిధిలో ఒకటి, మండల కేంద్రాల్లో మరొకటి మొదటి విడుతలో నిర్మించనున్నారు. వ్యవసాయ విస్తీర్ణాధికారి పరిధిలో రూ.12లక్షలు, మండల కేంద్రంలో రూ.15 లక్షల వ్యయంతో వేదికల నిర్మాణాలకు ఖర్చు చేయనున్నారు. రైతు సమన్వయ సమితి మం డల కోఆర్డినేటర్, గ్రామ కోఆర్డినేటర్లు సభ్యులు ఇక కేంద్రాల్లో వారి పనులు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

జిల్లాలో 121 వేదికల నిర్మాణాలకు శ్రీకారం
రాష్ట్రంలోనే మొట్టమొదటగా జిల్లాలోనే రైతు వేదికలు నిర్మించేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించారు. దీంతో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు జిల్లా వ్యాప్తంగా నిర్మాణాలకు సంబంధించిన ప్రతిపాదలను పంపించే విధంగా కృషి చేయడంతో ఆయా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు రైతు వేదికల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మొదటి విడుతలో సిద్దిపేట అర్బన్ పరిధిలోని మిట్టపల్లి, పొన్నాల, ఎన్సాన్‌పల్లి, బక్రిచెప్యాల, సిద్దిపేట రూరల్ మండల పరిధిలో ఇర్కోడు, వెంకటాపూర్, పుల్లూరు, రాఘావపూర్, నారాయణ్‌రావుపేట, చింతమడక, గుర్రాలగొంది, జక్కాపూర్, చిన్నకోడూరు మండలంలోని అల్లీపూర్, చిన్నకోడూరు, విఠాలపూర్, మాచాపూర్, చంద్లాపూర్, గోనేపల్లి, చెర్ల అంకిరెడ్డిపల్లి, ఇబ్రహీంనగర్, నంగునూరు మండలంలోని నంగునూరు, అంకిరెడ్డిపల్లి, గట్లమల్యాల, బద్దిపడిగె, పాలమాకుల, తిమ్మాయపల్లి, నర్మెట్ట, అంక్షాపూర్‌లో వేదికలు నిర్మించనున్నారు.

దుబ్బాక మండల కేంద్రంతో పాటు దౌల్తాబాద్, దొమ్మాట, ముబ్బార్సపూర్, ఇందూప్రియాల్, మిరిదొడ్డి, తొగుట, వెంకట్రావుపేట, ఎల్లారెడ్డిపేట, గుడికందుల, రాయపోల్, ఆరెపల్లి, వడ్డెపల్లి, మంతూర్, గజ్వేల్ మండల కేంద్రంతో పాటు పెద్దమాన్‌సాన్‌పల్లి, కొండపాక, దుద్దెడ, మర్పడగా, కుకునూర్‌పల్లి, మెద్నిపూర్, కొమురవెల్లి, చేర్యాల మండలంలోని ముస్త్యాల, ఆకునూరు, ములుగు, మర్కూక్, దామెరకుంట, ఎర్రవల్లి, జగదేవ్‌పూర్ మండలంలోని తిమ్మాపూర్, తీగుల్, మునిగడప, చాట్లపల్లి, ఇటిక్యాల, వర్గల్, మజీద్‌పల్లి, వెలూరు, హుస్నాబాద్, పందిల్ల, మిర్జాపూర్, మహ్మదాపూర్, కోహెడ, శనిగరం, వరికోల్, సముద్రాల, బస్వాపూర్, శ్రీరాములపల్లి, తంగెలపల్లి, అక్కన్నపేట మండల కేంద్రంతోపాటు జనగామం, చౌటపల్లి, గౌరవెల్లి, బెజ్జెంకి మండల కేంద్రంతో పాటు గాగిళ్లాపూర్, దాచారం, మద్దూరు మండల కేంద్రం తోపాటు బైరాన్‌పల్లి, దూళ్మిట్ట, లద్నూరు గ్రామా ల్లో రైతు వేదిక నిర్మాణాలు చేపట్టనున్నారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...