ఎల్లమ్మ చెరువుకు కొత్తందాలు


Thu,February 14, 2019 11:33 PM

-జెట్‌స్పీడ్‌లో మినీట్యాంక్‌బండ్ పనులు
-రూ.6.55 కోట్ల వ్యయం..90 శాతం పూర్తయిన కట్ట నిర్మాణం
-కొనసాగుతున్న చూట్ డ్రైన్స్, పారాపేట్ వాల్ పనులు
-ఇప్పటికే పూర్తయిన రెండు తూములు, ప్రొటెక్షన్‌వాల్ నిర్మాణం
-ప్రస్తుతం ఆయకట్టు 1500ఎకరాలు, పనుల అనంతరం మరో వెయ్యి ఎకరాలు
-పూర్తయిన రాతికట్టడం,తూముల నిర్మాణం
-వానకాలంలోపు కాల్వల సిమెంట్ లైనింగ్ పూర్తి చేసే లక్ష్యం
-పనులన్నీ పూర్తయితే అతిపెద్ద పర్యాటక కేంద్రంగా గుర్తింపు

(హుస్నాబాద్, నమస్తే తెలంగాణ) కాకతీయుల కాలంలో నిర్మాణం చేయబడి ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లోనే అతిపెద్ద చెరువుగా పేరుగాంచిన హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు రూపురేఖలు మారుతున్నాయి. కట్ట వెడల్పుతో పాటు ఎత్తు కూడా పెరుగుతుండడంతో సరికొత్తగా కనిపిస్తున్నది. ఈ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం దీనికి రూ.6.55కోట్ల నిధులు కేటాయించగా, పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కట్ట పనులు ఇప్పటికే 90శాతానికి పైగా పూర్తి కాగా, మిగతా పనులూ సత్వరంగా పూర్తి చేయించేందుకు అధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. పురాతన చెరువుగా పేరుగాంచిన ఈ చెరువు ద్వారా ఇప్పటికే సుమారు 1,500ఎకరాల ఆయకట్టు ఉంది. పనులు మొత్తం పూర్తయితే ఆయకట్టు విస్తీర్ణం మరింత పెరగడంతో పాటు ఈ ప్రాంతంలోనే అతిపెద్ద పర్యాటక కేంద్రం గా విలసిల్లే అవకాశముంది. ఎల్లమ్మ చెరువు కట్ట సరికొత్తగా కనిపిస్తుండటంతో హుస్నాబాద్ పట్టణ వాసులే కాకుండా ఇతర గ్రామాల ప్రజలు కూడా వచ్చి కట్టను సందర్శిస్తున్నారు. కట్టపై నుంచి కనిపించే పచ్చని పొలాల అందాలను ఆస్వాదిస్తున్నారు. చెరువు కట్టను స్వయంగా సందర్శించి నిధులు కేటాయించి పనులు సత్వరంగా పూర్తయ్యేలా ఆదేశాలు జారీ చేసిన అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మరిన్ని నిధుల మంజూరుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌కు ఈ ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారు.

పెరిగిన కట్ట వెడల్పు, ఎత్తు
మినీట్యాంక్ బండ్ పనులు ప్రారంభం కాకముందు ఉన్న కట్టకు ఇప్పటి కట్టకు ఎలాంటి పోలిక లేకుండా ఉంది. 1,400మీటర్ల వెడల్పు ఉన్న ఎల్లమ్మ చెరువు కట్టపైన కేవలం మూడు నుంచి నాలుగు మీటర్ల వెడల్పు మాత్రమే ఉండేది. కట్ట ప్రారంభం నుంచి 300ల మీటర్ల వరకు 15మీటర్ల వె డల్పు, మిగతా 1,100 మీటర్ల వరకు 8మీటర్ల వెడల్పుతో క ట్ట నిర్మించారు. ప్రారంభంలో ఉన్న కట్టకంటే ప్రస్తుతం 5అడుగుల ఎత్తు పెరిగింది. కట్టపైన ఇరువైపులా ప్యారాపీట్ వాల్ నిర్మాణం 50శాతం, కట్ట అడుగు భాగంలో ప్రొటక్షన్ వాల్ పూర్తయింది. ఇంకా మిగిలిన కట్టకు ఇరువైపులా రెయిలింగ్ పనులు, వరదనీటి కోసం చూట్‌డ్రైన్స్ నిర్మించాల్సి ఉంది. కట్టకు ఇరువైపులా విద్యుత్ స్తంభాల ఏర్పాటు, లైటింగ్ సిస్టం పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. కట్టకు ఒకవైపు గ్రాస్ పనులు చేపట్టనున్నారు.

పూర్తయిన తూములు, కాలువ
ఎల్లమ్మ చెరువుకు ఉన్న రెండు తూముల పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. కాకతీయుల శిల్పకళా చిహ్నంతో నిర్మించిన పెద్దతూము, చెరువు కట్ట ప్రారంభంలోనే ఉన్న చిన్న తూము పనులను పూర్తి చేశారు. చిన్న తూము ద్వారా పంటపొలాలకు నీళ్లు వెళ్లే కాలువ పనులు సగం వరకు పూర్తయింది. దాదాపుగా శిథిలావస్థలో ఉన్న రెండు తూముల పనులు పూర్తి కావడంతో కట్టకు కొత్తదనం వచ్చింది. పెద్దతూము కాలువలతో పాటు ఇతర కాలువలను శుభ్రం చేయాల్సి ఉంది. వచ్చే వానకాలంలో లోపు కాలువ పునరుద్ధరణ పనులను కూడా పూర్తి చేయనున్నారు. కట్టలోపలిభాగంలో రాతికట్టడం పనులు కూడా దాదాపుగా పూర్తికావొచ్చాయి. ప్రస్తుతం సిమెంటు పనులు నడుస్తున్నాయి. ఈ పనులు కూడా పూర్తయితే చెరువుకట్టకు నిజమైన నిండుదనం వస్తుందని చెప్పొచ్చు.

చిల్ట్రన్స్ పార్క్ నిర్మాణం
ఎల్లమ్మ చెరువు కట్ట కింద ఉన్న సుమారు మూడెకరాల స్థలంలో చిల్ట్రన్స్ పార్క్ నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదలను ప్రభుత్వానికి పంపారు. ఈ పార్కులో రకరకాల పూలమొక్కలు, గ్రాస్‌ను పెచడంతో పాటు పిల్లలు ఆడుకునే ఆటవస్తువులను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి స్థలాన్ని ఇప్పటికే చదును చేసి మట్టి కూడా పోశారు. నిధులు మంజూరు కాగానే, పనులు మొదలు కానున్నాయి. అలాగే మినీ ట్యాంక్‌బండ్ పనులు పూర్తి కాగా, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చెరువులో బోటింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించేందుకు కృషి చేస్తున్నారు. మినీట్యాంక్‌బండ్, చిల్డ్రన్స్ పార్క్ పనులు పూర్తయితే సాయంత్రం వేళలో సేదతీరేందుకు ఎంతో దోహదపడుతుందని పలువురు భావిస్తున్నారు.

పర్యాటక కేంద్రంగా మారుతుంది..
ఎల్లమ్మ చెరువు మినీట్యాంక్‌బండ్ పనులు పూర్తయితే మంచి పర్యాటక కేంద్రంగా మారుతుంది. గౌరవెల్లి రిజర్వాయర్‌తో ఈ చెరువుకు అనుసంధానం చేసి ఏ సీజన్‌లోనైనా ఇందులో నీళ్లు ఉండేలా కృషి చేస్తా. బోటింగ్ సౌకర్యం కూడా కల్పించి, ప్రజలు బోటింగ్‌ను ఆస్వాదించేలా చేస్తాం. కట్ట పనులు దాదాపుగా పూర్తి కావస్తున్నందున త్వరలోనే మిగతా పనులు పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించాం. చిల్డ్రన్స్ పార్క్ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయి. పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలిపేందుకు ఎల్లవేళలా కృషి చేస్తా.
- వొడితెల సతీశ్‌కుమార్, ఎమ్మెల్యే

పనులు త్వరగా పూర్తయ్యేలా కృషి..
చెరువు కట్ట పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి. మిలిగిన పనులను కూడా సత్వరంగా పూర్తి చేయించేందుకు కాంట్రాక్టర్‌తో మాట్లాడాం. కట్టకు సంబంధించి ఇప్పటి వరకు 60శాతం పనులు పూర్తయ్యాయి. సిమెంటు పనులు మాత్రం మిలిగి ఉన్నాయి. వీటిని కూడా త్వరలోనే పూర్తి చేయిస్తాం. రెండు తూములను మంచి నాణ్యతతో పునర్నిర్మించాం. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడటం లేదు. మట్టి, సిమెంటు పనులు నాణ్యతతో జరిగేలా చూస్తున్నం.
- శ్రీధర్, నీటి పారుదల శాఖ ఏఈ, హుస్నాబాద్

160
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...