తొలి విడుత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం


Sun,January 20, 2019 11:30 PM

దుబ్బాక, నమస్తే తెలంగాణ: నియోజకవర్గంలో మూడు మండలాల్లో నేడు జరుగనున్న తొలి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. నియోజకవర్గంలో ఏడు మండలాల్లో మొత్తం 149 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట మండలాల్లో సోమవారం ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మూడు మండలాల్లో 72 గ్రామపంచాయతీలలో 6 గ్రామపంచాయతీలు దుబ్బాక మండలం వెంకటగిరితండా, మిరుదొడ్డి మండలం బేగంపేట, వీరారెడ్డిపల్లి, తొగుట మండలంలో కాన్గల్, గోవర్ధనగిరి, బ్రాహ్మణ బంజరుపల్లి ఏకగీవ్రమైన విషయం తెలిసిందే. వీటితో పాటు 121 వార్డులు ఏకగ్రీమయ్యాయు. ఇక మిగిలిన 66 గ్రామ పంచాయతీలలో సోమవారం ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో దుబ్బాక మండలంలో 29 గ్రామపంచాయతీలు, మిరుదొడ్డి మండలంలో 18, తొగుట మండలంలో 19 గ్రామపంచాయతీలలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం మండలకేంద్రాల నుంచి రిటర్నింగ్ అధికారులు సంబంధిత పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్‌లను, పోలింగ్ సామగ్రిని సిబ్బందితో తరలించారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలింగ్ అధికారులను, సిబ్బందిని వాహనాలలో తరలించారు.ఈ ఎన్నికల సందర్భంగా పోలింగ్‌కేంద్రాల్లో సిబ్బందికి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ముందస్తుగా సిబ్బందిని అదనంగా నియమించారు. దుబ్బాకలో లచ్చపేట మోడల్‌స్కూల్‌లో ఎన్నికల సామగ్రి, విధులకు హాజరైన సిబ్బంది తదితర వాటిని కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎన్నికల పరిశీలకులు దినకరబాబు పరిశీలించారు.

66 గ్రామపంచాయతీలకు 558 పోలింగ్ కేంద్రాలు..
దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట మండలాల్లో సోమవారం తొలి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు, పోలీసులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టారు. మూడు మండలాల్లో 66 గ్రామ పంచాయతీలలో 558 పొలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 66 గ్రామపంచాయతీలకు 413 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 558 వార్డులకు 1408 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దుబ్బాక మండలంలో 30 గ్రామ పంచాయతీలలో ఒక గ్రామం ఏకగ్రీవం కావంటతో 29 గ్రామ పంచాయతీలలో 116 మంది సర్పంచ్ అభ్యర్థులు, 214 వార్డులకు 554 మంది బరిలో నిలిచారు. మిరుదొడ్డి మండలంలో 18 గ్రామపంచాయతీలలో 231 మంది సర్పంచ్ అభ్యర్థులు, 172 వార్డులకు 495 మంది బరిలో ఉన్నారు. తొగుట మండలంలో 19 గ్రామపంచాయతీలలో 66 మంది సర్పంచ్‌కు, 172 వార్డులకు 359 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందుకు 19 రూట్లలో 1570 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. దుబ్బాక మండలంలో 5 రూట్‌లలో 566 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఐదు రూట్‌లకు ఐదుగురు జోనల్ అధికారులు, 29 మంది స్టేజ్-2 అధికారులు ఒక పోలింగ్ కేంద్రానికి ఒక పోలింగ్ అధికారి, ఒక అదర్ పోలింగ్ అధికారి(ఓపీఓ)లను నియమించారు. మిరుదొడ్డి మండలంలో 9 రూట్‌లలో 404 మంది సిబ్బంది, తొగుట మండలంలో 5 రూట్‌లలో 6 వందల మంది ఎన్నికల సిబ్బందిని ఏర్పాటు చేశారు.

మిరుదొడ్డి : ఈ నెల 21వ తేదీ సోమవారం జరుగనున్న 18 గ్రామ పంచాయతీల ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిసిట్లు అసిస్టెంట్ జిల్లా ఎన్నికల అధికారి, మిరుదొడ్డి ఎంపీడీవో రాగంపేట మల్లికార్జున్ తెలిపారు. ఆదివారం ఆదర్శ పాఠశాల/కళాశాలలో 18 గ్రామ పంచాయతీలకు సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికల సామగ్రిని ఎన్నికల సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఎన్నికల జిల్లా అసిస్టెంట్ అధికారి మాట్లాడుతూ...20 గ్రామ పంచాయతీలకు గాను బేగంపేట, వీరారెడ్డిపల్లి గ్రామాలు ఏక గ్రీవంగా ప్రజలు ఎన్నుకున్నారన్నారు. మండల వ్యాప్తంగా 172 బూతులు, 9 రూట్లు, ప్రిసైడింగ్ (పీవోలు) 172 మంది, అసిస్టెంట్ (ఏపీవో) అధికారులు 232 మంది కలిపి మొత్తం 404 మంది అధికారులను నియమించడం జరిగిందన్నారు. మండలంలో ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌సీటీ మొబైల్ టీమ్స్‌ను, 3 జోనల్, 3 రూట్లను ఏర్పాటు చేశామన్నారు. మండల కేంద్రమైన మిరుదొడ్డిని మాత్రం వెబ్‌కాస్టు (సమస్యత్మకమైన) గ్రామంగా గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. 18 మంది సర్పంచ్ స్థానాలకు 231 మంది, 172 వార్డు సభ్యుల స్థానాలకు గాను 495 మంది కలిపి 726 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మిరుదొడ్డి తహసీల్దార్ ఎండీ.అరిఫా, ఎన్నికల మండల సూపర్ వైజర్ జి.ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు సహకరించాలి...
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరైన అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే వారిని కఠినంగా శిక్షిస్తామని సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ బాలాజీపవార్ హెచ్చరించారు. ఆదివారం మిరుదొడ్డి ఆదర్శ పాఠశాల/ కళాశాలలో గ్రామపంచాయతీ ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ...ఆయా గ్రామాల ప్రజలందరు సహనంతో ఉంటూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాని తెలిపారు. ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల సంఘం తగు ఏర్పాట్ల్లను చేసిందన్నారు.

131
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...