తీన్‌మార్


Thu,January 17, 2019 01:04 AM

- మొదలైన మూడోవిడుత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు
- హుస్నాబాద్ డివిజన్‌లో మూడోవిడుత పోలింగ్
- డివిజన్ పరిధిలో 122 గ్రామాలు, 1066 వార్డులు
- 36 క్లస్టర్ కేంద్రాలు ఏర్పాటు..ఈనెల 19 సాయంత్రం 5 గం.ల వరకు నామినేషన్ల స్వీకరణ
- తొలిరోజు సర్పంచ్‌కు 96 నామినేషన్లు, వార్డు స్థానాలకు 218 నామినేషన్లు
- ఐదు మండలాల్లో మొదలైన కోలాహలం
- అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేస్తున్న అభ్యర్థులు
- రెండోవిడుత ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు నేడు ఆఖరు


హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: పంచాయతీ పోరులో మూడో ఘట్టం మొదలైంది. జిల్లావ్యాప్తంగా మూడు విడుతల్లో ఎన్నికలు జరగనుండగా..చివరి విడుత పోలింగ్ హుస్నాబాద్ డివిజన్‌లో ఈనెల 30న జరుగనుంది. దీనికి సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం మొదలైంది. డివిజన్ పరిధిలో 5 మండలాలు..122 గ్రామాలు, 1066 వార్డులు ఉన్నాయి. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మండల కేంద్రాల్లో 36 క్లస్టర్ కేంద్రాలు ఏర్పాటు చేసి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. తొలిరోజు అభ్యర్థులు భారీ ర్యాలీలు నిర్వహించి మద్దతుదారులతో కలిసివచ్చి నామినేషన్లు సమర్పించారు. బుధవారం సర్పంచ్ స్థానాలకు 96 నామినేషన్లు, వార్డు స్థానాలకు 218 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 19న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను దాఖలు చేయొచ్చు. అలాగే రెండోవిడుత ఎన్నికలు జరిగే గజ్వేల్ డివిజన్ పరిధిలో నామినేషన్ల ఉపసంహరణకు నేడు తుదిగడువు. మధ్యాహ్నం 3 గం.ల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. దీని తర్వాతే అభ్యర్థులు ఎంతమంది బరిలో ఉంటారో లెక్క తేలనుంది. మొదటి విడుత ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే 21 గ్రామాలు ఏకగ్రీవం కాగా.. రెండోవిడుతలో 8 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మొదటి విడుత పోలింగ్ ఈనెల 21న ఉండడంతో అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికెళ్లి గుర్తులను చూపిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.

జిల్లాలో మూడో విడుత నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. బుధవారం హుస్నాబాద్ డివిజన్‌లో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. ఇప్పటికే రెండు విడుతలుగా నామినేషన్లు స్వీకరించిన అధికారులు, ఇక మూడో విడుతపై దృష్టి సారించారు. ఈ నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మొదటి విడుతలో సిద్దిపేట, రెండో విడుతలతో గజ్వేల్, మూడో విడుతలో హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్లలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయగా, మొదటి రెండు విడుతల్లో నామినేషన్ల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన అధికారులు మూడో విడుతలో కూడా నామినేషన్ల స్వీకరణను ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. హుస్నాబాద్ డివిజన్‌లోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి, మద్దూరు మండలాల్లో మూడో విడుత పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకుసంబంధించి బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్లను స్వీకరించారు. 19వ తేదీ సాయంత్రం 5గంటల వరకు మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు. 20వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఆర్డీవోకు అప్పీలు చేసుకోవడం, 21సాయంత్రం 5గంటల వరకు అప్పీళ్ల పరిశీలన, 22వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, ఇదే రోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. 30వ తేదీ ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్, ఇదే రోజు మధ్యాహ్నం 2గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆయా మండలాల ఎంపీడీవో ఇప్పటికే పూర్తి చేశారు.

122మంది సర్పంచ్,
1,066 వార్డు స్థానాలకు ఎన్నికలు..
హుస్నాబాద్ డివిజన్‌లో జరిగే మూడో విడుతలో 122 సర్పంచ్, 1,066 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. హుస్నాబాద్ మండలంలో 17 జీపీలు, అక్కన్నపేటలో 32, కోహెడలో 27, బెజ్జంకిలో 23, మద్దూరులో 23 జీపీలున్నాయి. వార్డుల వారీగా చూస్తే హుస్నాబాద్‌లో 140, అక్కన్నపేటలో 270, కోహెడలో 244, బెజ్జంకిలో 204, మద్దూరులో 208 వార్డులున్నాయి. ఐదు మండలాల్లో 36 క్లస్టర్ కేంద్రాలను ఏర్పాటు చేసి, నామినేషన్లను స్వీకరిస్తున్నారు. సుమారు 3వేల మంది ఆర్‌వో, ఏఆర్‌వోలు, సిబ్బంది నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో విధులు నిర్వహిస్తున్నారు.

డివిజన్‌లో 1,33,450మంది ఓటర్లు..
హుస్నాబాద్ డివిజన్‌లోని ఐదు మండలాల్లో మొత్తం 1,79,340మంది జనాభా ఉండగా, 1,33,450మంది ఓటర్లున్నారు. ఇందులో 66,367మంది పురుషులు, 67,083మంది మహిళలు ఉన్నారు. మండలాల వారీగా హుస్నాబాద్‌లో 15,944మంది ఓటర్లు, అక్కన్నపేటలో 30,478, కోహెడలో 32,951, బెజ్జంకిలో 26,008, మద్దూరు మండలంలో 28,069మంది ఓటర్లు ఉన్నారు.

మొదటి రోజు మామూలుగా..
మూడో విడుతలో భాగంగా బుధవారం జరిగిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మామూలుగా సాగింది. సంక్రాంతి వేడుకల్లో జరుపుకునే కనుమ పండుగ కావడంతో ఈ రోజు నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ఎక్కువగా ఆసక్తిని చూపలేదు. దీంతో ప్రతి క్లస్టర్‌లో ఒకటి రెండు మినహా నామినేషన్లు పడలేదు. గురు, శుక్రవారాల్లో నామినేషన్లు అధికంగా దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గురువారం కూడా కొందరికి ఘాతవారం అవుతున్నందున శుక్రవారం పెద్ద సంఖ్యలో నామినేషన్లు పడుతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఏర్పాట్లు పూర్తి..
హుస్నాబాద్ డివిజన్‌లో జరిగే మూడో విడుత ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూరి చేశారు. గ్రామాలు, వార్డుల వారీగా ఓటరు జాబితాలను పంపిణీ చేయడంతో పాటు ఆయా గ్రామ పంచాయతీల్లో ఓటరు జాబితాను అందుబాటులో ఉంచారు. మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించే 36 క్లస్టర్లలో సరిపడా సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ప్రతీ ఐదు వేల ఓటర్లకు ఒకటి చొప్పున క్లస్టర్లు ఏర్పాటు చేసి, క్లస్టర్ కేంద్రంలోనే నామినేషన్లు స్వీకరిస్తున్నారు. నామినేషన్లు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు సైతం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక ఎంపీడీవోలు, ఎస్‌ఐలు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

165
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...