విజేత మనమే!


Thu,January 17, 2019 01:01 AM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : 64వ జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ అండర్-17 చాంపియన్ షిప్‌లో తెలంగాణ బాల, బాలికల జట్లు సత్తా చాటి, మొదటి స్థానాలను కైవసం చేసుకున్నాయి. సిద్దిపేటలోని జయశంకర్ స్టేడియంలో ఐదు రోజులుగా హోరాహోరీగా సాగిన పోటీలు బుధవారం ముగిశాయి. ఫైనల్ మ్యాచ్‌లకు ముఖ్య అతిథిగా ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి హాజరై, మ్యాచ్‌లను ప్రారంభించారు. బాలుర విభాగంలో ద్వితీయ స్థానంలో ఢిల్లీ, తృతీయ స్థానంలో పంజాబ్ జట్లు, బాలికల విభాగంలో హర్యానా ద్వితీయ, ఢిల్లీ తృతీయ స్థానాల్లో నిలిచాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, కలెక్టర్ కృష్ణభాస్కర్, సీపీ జోయల్ డెవిస్, జేసీ పద్మాకర్, ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ సుజాత, హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్ హాజరై, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పోటీల ముగింపు కార్యక్రమంలో జక్కాపూర్, మల్యాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, అడిషన్ డీసీపీ నర్సింహారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ బాలాజి, ఎస్‌జీఎఫ్ క్రీడల అబ్జర్వర్లు వికేశ్, స్టేట్ అబ్జర్వర్ జగన్‌మోహన్‌గౌడ్, హ్యాండ్ బాల్ ఇండియా కోచ్ శివాజీ షిండే, ఓఎస్డీ బాల్‌రాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చరణ్‌దాస్, డీఈవో రవికాంత్‌రావు, టీఎన్‌జీవో, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్, పెట అధ్యక్షుడు సతీష్, పీఈటీలు కనకయ్య, కనకారెడ్డి, ప్రవీణ్, లక్ష్మణ్, అక్బర్, భాస్కర్‌రెడ్డి, కోచ్‌లు, మేనేజర్లు పాల్గొన్నారు.

సెమీ ఫైనల్‌లో సత్తా..
మంగళవారం జరిగిన సెమీ ఫైనల్‌లో మహిళల విభాగంలో గుజరాత్‌ను తెలంగాణ జట్టు ఓడించగా, ఢిల్లీని హర్యానా జట్టు ఓడించింది. బాలుర విభాగంలో పంజాబ్‌పై తెలంగాణ, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపొంది, ఫైనల్స్‌కు చేరాయి.

ఫైనల్స్‌ను ప్రారంభించిన ఎంపీ
బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లను ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు. అంతకు ముందు క్రీడాకారులను పరిచయం చేసుకొని, హ్యాండ్‌బాల్ త్రో చేశారు. మొదట మహిళల విభాగంలో జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ బాలికల జట్టు 16-12 గోల్స్ తేడాలో హర్యానాపై గెలుపొందింది. బాలుర విభాగంలో ఢిల్లీపై 25-19 తేడాతో తెలంగాణ బాలుర జట్టు విజయం సాధించి చాంపియన్లుగా నిలిచాయి. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు, బాలికల విభాగంలో ఢిల్లీ జట్లు నిలిచాయి. చాంపియన్లుగా నిలిచిన జట్లకు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ట్రోఫీలను, మెడల్స్‌ను అందజేశారు.

అభివృద్ధి, క్రీడల్లో నెం.1గా తెలంగాణ
సీఎం కేసీఆర్ నాయకత్వంలో అటు అభివృద్ధి, ఇటు జాతీయ స్థాయి క్రీడల్లోనూ తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం సంతోషంగా ఉందని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. పోటీల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడారు. తెలంగాణ అన్ని రంగాల్లోనూ సమగ్రంగా అభివృద్ధి సాధిస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేశారన్నారు. సిద్దిపేటలో జాతీయ స్థాయి పోటీలు జరుగడం గర్వంగా ఉందని, సిద్దిపేట అభివృద్ధిలో ఏ విధంగా దూసుకపోతుందో, క్రీడల్లోనూ అదే స్థాయిలో ముందంజలో ఉందన్నారు. సిద్దిపేటలో ఎప్పుడు చూసినా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలతో నిత్యం క్రీడాకారులతో మినీ స్టేడియంలో రద్దీగా ఉంటుందన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత మ్మెల్యే హరీశ్‌రావు కృషి ఫలితంగా సిద్దిపేటలోనూ జాతీయ స్థాయి క్రీడలు జరుగుతున్నాయన్నారు. జాతీయ స్థాయిలో గెలుపొందిన జట్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఓడిన వారు మరింత కష్టపడి ప్రతిభను కనబర్చాలన్నారు.

హరీశ్‌రావు సహకారంతో..
జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీల నిర్వహణకు ఎమ్యెల్యే హరీశ్‌రావు అందించిన సహకారం మరవలేనిదని ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్ పేర్కొన్నారు. తెలంగాణ క్రీడాకారులు మంచి నైపుణ్యం కనబర్చి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదుగాలని ఆకాంక్షించారు. రాష్ట్రం ఏర్పడిన ఐదేండ్లలోనే అటు అభివృద్ధిలోనూ, ఇటు క్రీడల్లోను ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందుకొని, మంచి క్రీడాకారులుగా తయారు కావాలని సూచించారు.

సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు
సిద్దిపేటలో జాతీయ క్రీడలు నిర్వహించేందుకు సహకరించిన వారందరికీ కలెక్టర్ కృష్ణభాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని 30 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పోటీల్లో పాల్గొని సిద్దిపేటకు దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చిందన్నారు. హ్యాండ్ బాల్ క్రీడా నిర్వహణ కమిటీ చైర్మన్, జేసీ పద్మాకర్ మాట్లాడుతూ పోటీలను విజయవంతం చేసేందుకు రెండు నెలలుగా శ్రమపడుతున్నామని, ఐదు రోజుల పాటు పోటీలు విజయవంతంగా జరుగడంపై సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ పాతూరి సుజాత మాట్లాడుతూ జాతీయ హ్యాండ్ బాల్ క్రీడల నిర్వహణతో పాటు విజయవంతం చేయడంలోనూ క్రీడల నిర్వహణ కమిటీలు టీమ్ స్పిరిట్‌తో పని చేశాయన్నారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు అందించిన సహాయ సహకారాలతో క్రీడలు విజయవంతంగా ముగిశాయన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...