కాంగ్రెస్ ఖేల్ ఖతం


Mon,November 19, 2018 12:10 AM

-ముత్యంరెడ్డి చేరికతో జిల్లాలో హస్తవ్యస్తం
సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి సోమవారం సీఎం కేసీఆర్ సమక్షంలో సిద్దిపేటలో టీఆర్‌ఎస్‌లో చేరనుండగా, జిల్లాలో కాంగ్రెస్ కనుమరుగు కానుంది. కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోనుంది. కాంగ్రెస్ అధిష్ఠానం మహాకూటమిలో భాగంగా నమ్ముకున్న వారిని కాకుండా, డబ్బున్నోళ్లకే టికెట్లు ఇచ్చిందని, పార్టీ కోసం పని చేసే వారికి గుర్తింపు లేకుండా పోయిందని నాయకగణం మండిపడుతున్నది. పలువురు పార్టీకి రాజీనామాలు చేసి టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకపోతున్నది. జిల్లాలో నాలుగు శాసన సభ స్థానాలుంటే కేవలం ఒకే చోట పోటీ చేస్తున్నది. మహాకూటమిలో కీలక భాగస్వామి అయిన కాంగ్రెస్ సిద్దిపేట జిల్లాలో పోటీ చేయడానికి ముఖం చాటేసిందని చెప్పవచ్చు. దుబ్బాక నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి టికెట్ ఆశించారు. సీనియర్ నేత ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్న ముత్యంరెడ్డికి అధిష్ఠానం మొండి చెయ్యి చూపడంతో కాంగ్రెస్ నాయకులు నాయకత్వంపై మండిపడుతున్నారు. మహాకూటమి పొత్తులో భాగంగా సిద్దిపేట, దుబ్బాకలను టీజేఎస్‌కు, హుస్నాబాద్ సీపీఐకి, గజ్వేల్ కాంగ్రెస్‌కు వచ్చింది. అధిష్ఠానం తీరును కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేక ఆ పార్టీకి రాజీనామా చేసి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యవహారశైలి పై మండిపడుతున్నారు. ఉత్తమ్ కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టించారని ఆరోపిస్తున్నారు. ఎన్నో ఏండ్ల నుంచి పార్టీ కోసం పనిచేసే వాళ్లను విస్మరించి కేవలం పైరవీకారులకు, డబ్బున్న వాళ్లకే టికెట్లు ఇస్తున్నారని, కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు గల నాయకత్వం ఆరోపిస్తున్నది. ఏదేమైనా, సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్‌కు నూకలు చెల్లాయి.

142
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...