సిద్దిపేటకు సీఎం కేసీఆర్


Fri,November 16, 2018 11:12 PM

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉద్యమాల పురిటిగడ్డ సిద్దిపేటలో సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఈ నెల 20న సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల ప్రజలతో సిద్దిపేట పట్టణంలోని పత్తి మార్కెట్ యార్డు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో భారీ బహిరంగ సభను నిర్వహించడానికి టీఆర్‌ఎస్ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ మేరకు శుక్రవారం రోజు సభాస్థలి, హెలీప్యాడ్ స్థల ఏర్పాట్లను సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్, డీసీపీ నర్సింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా డైరెక్టర్, 10వ వార్డు కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, సీనియర్ నాయకులు పూజల వెంకటేశ్వర్‌రావు, మోహన్‌లాల్ తదితరులు పరిశీలించారు. టీఆర్‌ఎస్ ప్రచారాన్ని మరింత ఉధృతం చేసింది. శాసన సభ రద్దు చేసిన మరుసటి రోజే ఏకకాలంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. మరుసటి రోజే హుస్నాబాద్‌లో సెప్టెంబర్ 7న భారీ బహిరంగ సభ నిర్వహించారు.

ఈ సభను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. టీఆర్‌ఎస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గంలో అప్పటి నుంచి మంచి జోష్‌లో ఉన్న గులాబీ పార్టీ ఇంటింటికీ తిరిగి ప్రచారాన్ని ఉధృతం చేసింది. జిల్లాలోని నాలుగు శాసన సభ స్థానాలు సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గాలతో పాటు జనగామ, మానకొండూరు నియోజకవర్గాల టీఆర్‌ఎస్ అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలతో మమేకమై, ఇంటింటికీ వెళ్లి నాలుగున్నరేండ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని ప్రతి గడపకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే మొదటి విడుత ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసిన అభ్యర్థులు మలివిడత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 14న గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్, సిద్దిపేట నుంచి హరీశ్‌రావు, దుబ్బాక నుంచి సోలిపేట రామలింగారెడ్డి, హుస్నాబాద్ నుంచి వొడితెల సతీశ్‌కుమార్, జనగామ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. 21న మెదక్‌లో కూడా సీఎం కేసీఆర్ సభ నిర్వహిస్తున్నట్లు షెడ్యూల్ విడుదల చేశారు.

187
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...