నామినేషన్లు షురూ


Mon,November 12, 2018 11:33 PM

- ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- జిల్లాలో నాలుగు శాసనసభ స్థానాలు
- 19 దాకా నామినేషన్ల స్వీకరణ
- 20న నామినేషన్ల పరిశీలన
- 22న ఉపసంహరణ
- తొలిరోజు ఒకే ఒక్క నామినేషన్ దాఖలు
సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : శాసనసభ ఎన్నికల నగారా మోగింది. సోమవారం జిల్లా ఎ న్నికల అధికారి కృష్ణభాస్కర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా, నామినేషన్ల ప్రకియ షురూ అయ్యింది. ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్లు స్వీకరిస్తారు. 20న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. తదుపరి శాసనసభ ఎన్నికల బరిలో నిలిచే ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. డిసెంబర్ 7న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 11న కౌటింగ్ చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.

రిటర్నింగ్ అధికారులు
ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజవర్గ కేంద్రాల్లోని రిటర్నింగ్ అధికారుల కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. సిద్దిపేట రిటర్నింగ్ అధికారిగా జయచంద్రారెడ్డి(9849904287), గజ్వేల్‌కు విజయేందర్‌రెడ్డి(7331187576), హుస్నాబాద్‌కు అనంతరెడ్డి(7331887577), దుబ్బాకకు సోమేశ్వర్(9000751997) ఉన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారుల సమక్షంలోనే నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. రిటర్నింగ్ కార్యాలయాల వద్ద వంద మీటర్ల దూరంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో సహాయక కేంద్రాలు సైతం ఏర్పాటు చేశారు. నామినేషన్ పత్రాల పూరింపులో ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేస్తారు. పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటుగా వికలాంగుల కోసం ప్రత్యేకంగా ర్యాంప్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

తొలి నామినేషన్ దాఖలు
నోటిఫికేషన్ వెలుడిన తొలి రోజు ఒకే ఒక్క నామినేసన్ దాఖలైంది. మొదటి రోజు దుబ్బాక నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మాదవనేని రఘునందన్‌రావు తన కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ వేశారు. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్‌లో ఎవరూ నామినేషన్ వేయలేదు.

జిల్లాలో వేడెక్కనున్న రాజకీయం
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల ప్రక్రియ షురూ కావడంతో జిల్లాలో రాజకీయం మరింత వేడెక్కనుంది. ఆయా పార్టీల నాయకులు దూకుడు పెంచనున్నారు. జిల్లాలో నాలుగు నియోజకవర్గాలతో పాటు జనగామ నియోజకవర్గంలోని ఒక మున్సిపాలిటీతో పాటు మూడు మండలాలున్నాయి. అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత మరుసటి రోజున టీఆర్‌ఎస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం అభ్యర్థులు బీఫారం సైతం తీసుకున్నారు. రెండు నెలల నుంచి ఆయా నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

నిబంధనలివి..
-ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్లు వేయాలి.
-గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులు 19 తేదీ లోపు ఫారం-ఏ, బీని రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి.
-తదుపరి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే వారి జాబితాను అధికారులు వెల్లడిస్తారు.
-గుర్తింపు పొందిన రాష్ట్ర, జాతీయ పార్టీల అ భ్యర్థులకు ఒకరు ప్రతిపాదిస్తే సరిపోతుంది.
-గుర్తింపు పొందని, స్వతంత్ర అభ్యర్థులకు పది మంది ప్రతిపాదించాలి.
-అభ్యర్థి రాష్ట్రంలో ఎక్కడ ఓటు హక్కు ఉన్నా సరే, ప్రతిపాదకులు మాత్రం నియోజకవర్గంలోని వారై ఉండాలి.
-నామినేషన్ వేయడానికి అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే అవకాశం. లోనికి మూడు వాహనాలే అనుమతిస్తారు. అభ్యర్థుల వెంట వచ్చే వారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే ఉండాలి.
-నామినేషన్ వేసే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీలు రూ.5 వేలు, మిగతా వారు రూ.10 వేల ధరావత్ చెల్లించాలి. ఈ ధరావత్‌ను నగదు లేదా చలానా రూపంలోనే ఇవ్వాలి.

171
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...