ఆగమాగం


Tue,September 18, 2018 12:29 AM

-కుదరని పొత్తులతో ప్రతిపక్షాలు అయోమయం
-అపవిత్ర పొత్తులపై కత్తులు దూస్తున్న నాయకులు
-పొత్తు పొడిస్తే ఆయా పార్టీలకు రాజీనామాకూ సై...
-స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి సిద్ధం
-పటాన్‌చెరు, ఖేడ్‌లలో గందరగోళ పరిస్థితులు
-దుబ్బాకలో కాంగ్రెస్‌లోనే టిక్కెట్ల కిరికిరి
-మెదక్‌లో కాంగ్రెస్, టీడీపీల్లో పంచాయితీ
-సంగారెడ్డిలో కాంగ్రెస్ నేతల మధ్యే పోరు
సంగారెడ్డి, నమస్తేతెలంగాణ ప్రధానప్రతినిధి:అధికార టీఆర్‌ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయి. సిద్దాంతాలను పక్కన పెట్టి అపవిత్ర కలయికకు సిద్ధమవుతున్నాయి. అయితే పొత్తులు పొడవక ముందే ఆయా పార్టీల నాయకులు కత్తులు దూస్తున్నారు. తమ స్థానాన్ని ఇతరులకు కేటాయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ముఖ్య నాయకులు సన్నిహితుల మధ్య చెప్పుకుంటున్నారు. ప్రధానంగా పటాన్‌చెరు, నారాయణఖేడ్, దుబ్బాక, సంగారెడ్డిలలో ప్రతిపక్ష పార్టీల్లో పొత్తులపై ఆసక్తి నెలకొన్నది. కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జన సమితి, వామపక్ష పార్టీల పొత్తులు కుదిరితే ఏ స్థానం ఏ పార్టీకి రానున్నదనే అంశంపై ఆయా పార్టీల నాయకుల మధ్య చర్చ జరుగుతున్నది. పొత్తులు కుదిరినా అవసరమైతే ఆ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని పలు చోట్ల టికెట్లు ఆశిస్తున్న కాంగ్రెస్, టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో పొత్తులు కుదిరేదెప్పుడు సీట్ల కేటాయింపులు ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొన్నది.

సంగారెడ్డిలో కాంగ్రెస్‌లోనే పోటీ...
జిల్లా కేంద్రమైన సంగారెడ్డి నియోజకవర్గంలో పార్టీల మధ్య పొత్తులు కుదిరితే కాంగ్రెస్‌లోని ముఖ్యనాయకుల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనుషుల అక్రమ రవాణా కేసులో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇక్కడి నుంచి జగ్గారెడ్డి తన భార్య నిర్మలను కాంగ్రెస్ నుంచి బరిలో నిలపనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. జగ్గారెడ్డి ఎంపీగా పోటీ చేయనున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇదే సంగారెడ్డిపై మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ సతీమణి పద్మిని దృష్టి సారించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్, టీడీపీ, జన సమితి పార్టీలు పొత్తులు పెట్టుకుంటే తమ పార్టీ అభ్యర్థికి సంగారెడ్డిని వదిలిపెట్టాలని కోదండరామ్ అడిగే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ లేదా జన సమతి అభ్యర్థులు పోటీ చేస్తే సీపీఐ, సీపీఏం పార్టీల మద్దతు ఏ మేరకు ఉండనున్నదనే ఆసక్తి నెలకొన్నది.

పొత్తులు కుదిరినా పోటీకి రెడీ..!
పటాన్‌చెరు నియోజకవర్గంలో ప్రతిపక్షాలల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌లో టిక్కెట్ల విషయంలో పోటీ నెలకొనగా పొత్తులు కుదిరితే పరిస్థితి ఏమిటనే చర్చ మొదలైంది. ఈ పార్టీ నుంచి గోదావరి అంజిరెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, పటాన్‌చెరు కార్పొరేటర్ శంకర్ యాదవ్, మాజీ సర్పంచ్ శశికళ, జెడ్పీటీసీ ప్రభాకర్‌లు పోటీలో ఉన్నారు. టీడీపీ టికెట్‌ను జడ్పీటీసీ శ్రీకాంత్‌గౌడ్ ఆశిస్తున్నారు. అయితే పొత్తులో ఈ స్థానాన్ని తమ పార్టీకి కేటాయించాలని జన సమితి అడిగే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో పొత్తులో ఏ పార్టీకి ఈ స్థానం దక్కనున్నదనే ఆసక్తి నెలకొన్నది. అయితే పొత్తులో ఇతర పార్టీలకు కేటాయించినా తాను పోటీలో ఉండనున్నట్లు టీడీపీ శ్రీకాంత్‌గౌడ్ తన సన్నిహితులతో అంటున్నాడు. అలాగే గత ఎన్నికల్లోనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అంజిరెడ్డి ఈ సారి తన భార్య గోదావరిని పొత్తులు కుదిరినా తిరిగి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిపే అవకాశమున్నట్లు సన్నిహితులు ప్రచారం చేసుకుంటున్నారు.

పొత్తులు కుదిరితే టీడీపీకి గుడ్‌బై..?
కాంగ్రెస్, టీడీపీల మధ్య పొత్తులు కుదిరితే నారాయణఖేడ్ రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇక్కడి నుంచి అధికార పార్టీ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తిరిగి పోటీలో ఉన్న విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ సురేశ్ శెట్కార్, మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డి, టీడీపీ నుంచి విజయ్‌పాల్‌రెడ్డిలు టికెట్ ఆశిస్తున్నారు. అయితే పొత్తులు కుదిరితే టీడీపీకి టిక్కెట్ ఇస్తే షెట్కార్, సంజీవరెడ్డిలు, కాంగ్రెస్‌కు ఇస్తే విజయ్‌పాల్‌రెడ్డి ఊరుకునే పరిస్థితులు కనిపించడం లేదు. కిష్టారెడ్డి చనిపోయిన తరువాత వచ్చిన ఉప ఎన్నికల్లో తాను పోటీ చేశానని, ప్రజల్లో తమ కుటుంబంపై సెంటిమెంట్ ఉన్నదని, ఈ స్థానాన్ని ముమ్మాటికి కాంగ్రెస్‌కే కేటాయించాలని సంజీవరెడ్డి గట్టి పట్టుతో ఉన్నాడు. సీనియర్‌నైన తనకే అవకాశం ఇవ్వాలని షెట్కార్ అధిష్ఠానాన్ని డిమాండ్ చేస్తున్నాడు. అయితే పొత్తులో భాగంగా ఖేడ్‌ను కాంగ్రెస్‌కు కేటాయిస్తే తాను టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటానని విజయ్‌పాల్‌రెడ్డి సన్నిహితులు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్, టీడీపీల పొత్తును ఆయన అపవిత్ర పొత్తులుగా పేర్కొంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అవసరమైతే టీడీపీని వీడటానికి కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

దుబ్బాక కాంగ్రెస్‌లో కేటాయింపు పంచాయతీ...
దుబ్బాక కాంగ్రెస్‌లో పొత్తులపై ఆసక్తికర పంచాయతీ జరుగుతున్నది. ఓ వైపు కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి ముత్యంరెడ్డి, అతడి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డిలు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఇదే స్థానాన్ని గత ఎన్నికల్లో మెదక్ ఎంపీగా పోటీ చేసిన డాక్టర్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి అడుగుతున్నాడు. అయితే నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, తమకు నియోజకవర్గంలో మంచి ఆదరణ ఉన్నదని ముత్యంరెడ్డికి ఇవ్వని పక్షంలో తన అభ్యర్థిత్వాన్ని ఓకే చేయాలని అతడి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి పట్టుబడుతున్నాడు. ఇదిలా ఉండగా జన సమితి నుంచి చిందం రాజ్‌కుమార్ టిక్కెట్ ఆశిస్తున్నాడు. పొత్తులు కుదిరితే ఆయన పరిస్థితి ఆగం కానున్నది. పొత్తులు కుదిరి ఇతర పార్టీలకు దుబ్బాక స్థానం కేటాయిస్తే మరోసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని ఆయన సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నాడు.

గజ్వేల్, సిద్దిపేటలు గులాబీ మయం...
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిసున్న గజ్వేల్ నియోజకవర్గంలో, మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గాల్లో ప్రతిపక్షాలు దాదాపుగా కనుమరుగయ్యాయి. గజ్వేల్ కాంగ్రెస్ నుంచి వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రచారం చేసుకుంటున్నప్పటికీ ఓట్లు మాత్రం వచ్చే పరిస్థితులుండబోవని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే కోట్లాది రూపాయలతో జరిగిన అభివృద్ధి గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించనున్నది. ఈ క్రమంలో ఎప్పటిలాగే మంత్రి హరీశ్‌రావు భారీ మెజార్టీతో తిరిగి గెలుపొందనున్నారు. మొత్తంగా ఈ రెండు నియోజకవర్గాలు పూర్తిగా గులాబీ కోటలుగా మారిపోయాయి.

మెదక్ కాంగ్రెస్‌లో గ్రూపుల లొల్లి..
మెదక్ కాంగ్రెస్‌లో గ్రూపుల లొల్లి కొనసాగుతున్నది. ఇప్పటికే ఆరుగురు టిక్కెట్లు ఆశిస్తుండగా పొత్తుల్లో భాగంగా మెదక్‌ను జన సమితికి ఇవ్వాలని కోదండరామ్ గట్టి పట్టుతో ఉన్నారు. ఈ క్రమంలోనే కోదండరామ్ ఎక్కువ సార్లు మెదక్‌కు వచ్చివెలుతున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, బట్టి జగపతి, కంటారెడ్డి తిరుపతిరెడ్డి, సుప్రభాతరెడ్డి, చంద్రపాల్, మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అల్లుడు ప్రతాప్‌రెడ్డిలు టిక్కెట్లు ఆశిస్తున్నారు. అయితే ఇక్కడ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ్మ, మాజీ మంత్రి సునీతాలకా్ష్మరెడ్డి గ్రూపులు ఉన్నాయి. ఇదిలా ఉండగా టీడీపీ నుంచి ఎకే.గంగాధర్‌రావు, జన సమితి నుంచి న్యాయవాది జనార్థన్‌రెడ్డిలు టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌లో ఎవరికి టిక్కెట్ వచ్చినా తమ గ్రూపు నాయకుడికి టిక్కెట్ వచ్చిందని మరో గ్రూపు బయటకు వచ్చే అవకాశమున్నది. ఈ క్రమంలో అవసరమనుకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు.

నర్సాపూర్, అందోల్, జహీరాబాద్‌లలో టీఆర్‌ఎస్ ఢీ...
ఉమ్మడి మెదక్ జిల్లాలో పొత్తులు కుదిరినా నర్సాపూర్, అందోల్, జహీరాబాద్ నియోజకవర్గాలను కాంగ్రెస్‌కు కేటాయించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ మూడు చోట్ల టీఆర్‌ఎస్ బలంగా ఉండడమే కాకుండా అభ్యర్థులు గట్టిపోటీ ఇవ్వడంతో వారికి ఆ పార్టీలకు ఓటమి తప్పదని లెక్కలు వేస్తున్నారు. నర్సాపూర్ నుంచి మాజీ మంత్రి సునీతాలకా్ష్మరెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో ఉండనున్నాయి. అయితే మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికే ఆయన జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా అందోలు నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి రాజనరసింహ్మా బరిలో ఉండనున్నారు. అయితే స్థానిక కార్డుతో టీఆర్‌ఎస్ నుంచి జర్నలిస్టు క్రాంతి కిరణ్ బరిలో దిగారు. స్థానికుడనైన తన అభ్యర్థిత్వానికి అన్ని వర్గాల నుంచి అమోదం లభించిందని ఆయన రెట్టింపు ఉత్సాహంతో ప్రచారం చేసుకుంటున్నారు. జహీరాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే గీతారెడ్డి బరిలో ఉండే అవకాశమున్నది. అయితే ఆమె నాలుగున్నరేండ్లుగా నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని స్థానికంగా వ్యతిరేకత ఉన్నది. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో ప్రభుత్వం కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. అయితే టీఆర్‌ఎస్ నుంచి ఇంకా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉన్నది. బలమైన అభ్యర్థి బరిలో ఉండనున్నారని, గీతారెడ్డికి ఓటమి తప్పదని టీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తంగా నర్సాపూర్, అందోలు, జహీరాబాద్‌లలో గులాబీ గుబాలింపు తప్పదనే అభిప్రాయం జనం నుంచి వినిపిస్తున్నది.

194
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...