ప్రకటన ఎప్పుడొచ్చినా సిద్ధం


Thu,September 13, 2018 12:28 AM

-ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
-షెడ్యూల్ ప్రకారం ఓటరు మార్పులు, చేర్పులు
-డిస్ట్రిబ్యూషన్ పాయింట్లు, కౌంటింగ్ కేంద్రాల గుర్తింపు
-అన్నీ సవ్యంగా కొనసాగేందుకు ప్రత్యేకాధికారుల నియామకం
-రికార్డు స్థాయి పోలింగ్ శాతం జరిగేలా ప్రజలను చైతన్యం చేస్తాం
-ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్
సూర్యాపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : శాసనసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడు ప్రకటన చేసినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.. షెడ్యూల్ ప్రకారం కొత్త ఓటరు నమోదుతోపాటు మార్పులు, చేర్పుల ప్రక్రియ కొనసాగుతోంది.. నియోజకవర్గాల వారీగా రిసిప్షన్ అండ్ ఎన్నికల సామగ్రి, డిస్ట్రిబ్యూషన్ పాయింట్లను గుర్తిస్తుండగా కౌంటింగ్ కేంద్రంగా జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలను పరిశీలించి ప్రతిపాదనలు పంపించాం.. ఎన్నికల విషయంలో జిల్లాలోని అధికారులు, సిబ్బంది మొత్తం కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే పనిచేయాల్సి ఉంటుంది అని కలెక్టర్ సురేంద్రమోహన్ అన్నారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాట్లపై నమస్తే తెలంగాణతో ఆయన పలు వివరాలు వెల్లడించారు.

అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎప్పడు ప్రకటన వచ్చినా సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే హైదరాబాద్‌లో కలెక్టర్లకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం), ఓటర్ వెరిఫైబల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీ ప్యాట్)లపై శిక్షణ జరిగింది. భారత్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ద్వారా ఈ నెల 18న జిల్లా ఈవీఎం మిషన్లు, వీవీప్యాట్స్ రాబోతున్నాయని కలెక్టర్ సురేంద్రమోహన్ తెలిపారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే. జిల్లా వ్యాప్తంగా నాలుగు నియోజకవర్గాల పరిధిలో 1089 పోలింగ్ బూత్‌లు ఉండగా ఈ నెల 10న 8,33,846 మందితో కూడిన ఓటర్ల జాబితా విడుదలైంది. ఓటరు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25 వరకు కొత్త ఓటర్ల నమోదుతోపాటు, సవరణకు అవకాశం ఉంది. ఈ నెల 15, 16 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా పోలింగ్ బూత్‌లలో స్పెషల్ క్యాంపియన్ నిర్వహించబోతున్నాం. రెండు రోజులపాటు ఆయా కేంద్రాల్లో బూత్ లెవల్ అధికారులు స్థానికంగానే ఉండి ఓటర్ల జాబితాను చదివి జనవరి 1, 2018నాటికి 18 ఏండ్లు నిండిన వారిని కొత్త ఓటర్లుగా నమోదు చేయడం, చనిపోయిన వారి పేర్లు తొలగించడంతోపాటు తప్పొప్పులు సరిదిద్దడం చేస్తారు. ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అక్టోబర్ 4 నాటికి ఓటర్ల జాబితాను పూర్తి చేసి 7వ తేదీన కంప్యూటర్లలో డాటాబేస్ చేసి అక్టోబర్ 8న తుది జాబితా విడుదల చేస్తాం. ఈ తంతు సక్రమంగా జరిగేందుకు సూపర్‌విజన్ చేయడం, కో-ఆర్డినేషన్ తదితరాల కోసం జిల్లాలో నలుగురు ప్రత్యేకాధికారులను నియమిస్తున్నాం. జిల్లా వెటర్నరీ అధికారి, కో-ఆపరేటివ్ అధికారి, ఆడిట్, మైనారిటీ వెల్ఫేర్ అధికారులను నియమించాం. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాలో 5,227 మంది సిబ్బంది కావాల్సి ఉండగా 7,300 మంది ఉన్నారు.

18న జిల్లాకు ఈవీఎం, వీవీపాట్‌లు..
ఈ నెల 18న బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ నుంచి జిల్లాకు ఈవీఎంలతోపాటు వీవీపాట్‌లు రానున్నాయి. వీటిని భద్ర పర్చేందుకు వ్యవసాయశాఖ గోదాంలను సేకరించి మరమ్మతులు చేపడుతున్నాం. అన్నీ వచ్చిన తరువాత జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల ఎదుట ఫస్ట్ లెవల్ చెక్(ఎఫ్‌ఎల్‌సీ) నిర్వహిస్తాం. దీనికి కూడా నలుగురు ప్రత్యేకాధికారులు జిల్లా ఇండస్ట్రియల్ అధికారి, చీఫ్ ప్లానింగ్ అధికారి, సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్‌తోపాటు డ్వామా ఏపీడీలను నియమించాం. వివిధ పార్టీల నాయకులకు ముందస్తుగా నోటీసుల ద్వారా సమాచారం ఇచ్చి వారి సమక్షంలోనే సీసీ కెమెరాల మధ్యన కొన్ని ఓట్లు వేసి ఈవీఎంలు, వీవీప్యాట్‌ల పనితీరు, కచ్చితమైన ఫలితాలను చూపిస్తాం. ఎవరికీ ఎలాంటి అనుమానాలు ఉన్నా నివృత్తి చేస్తారు.

సరిపడా మిషన్లు ..
జిల్లాకు కావాల్సినన్ని ఈవీఎం, వీవీపాట్‌లు రాబోతున్నాయి. 1089 పోలింగ్ స్టేషన్లకుగాను 25శాతం రిజర్వ్ చేసుకోవాల్సి ఉంది. దీని ప్రకారం జిల్లాకు 1350 ఈవీఎంలు, 1740 బ్యాలెట్ యూనిట్లు, 1350 కంకట్రోల్ యూనిట్లతోపాటు 1470 వీవీ పాట్‌లు అలాట్ అయ్యాయి. వీటిలో 25 మిషన్లను అన్ని వర్గాల ప్రజలకు అవగాహన పెంపొందించేందుకు కేటాయిస్తున్నాం. నాలుగు నియోజకవర్గాలలో ఒక్కో నియోజకవర్గానికి 6 చొప్పున ఈవీఎంలు, వీవీప్యాట్‌లను కేటాయించి ప్రతి మండలంలో డీటీ, ఆర్‌ఐ, ఈఓఆర్‌డీ లేదా సూపరింటెండెంట్‌తోపాటు ఏంఈఓలతో కూడిన ఓ టీంను నియమిస్తాం. వీరందరికీ మిషన్లపై ట్రైనింగ్ ఇచ్చి ఆయా మండలాల్లో ఎన్జీఓలు, జర్నలిస్టులు, ఉద్యోగులతోపాటు ప్రజలకు ఉండే అనుమానాలను నివృత్తి చేస్తాం.

సమస్యలు చిన్నవి... బాధ్యతలు గుర్తెరగాలి..
మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉద్యోగులుగా మనం ప్రజాస్వామ్య బెన్‌ఫిట్స్ పొందుతున్నాం. కాబట్టి అధికారులు, సిబ్బంది ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి. ఈ అవకాశం ఉద్యోగులకు మినహా మరెవ్వరికీ రాదు. టీఏలు సరిపోవడం లేదు, ఇతరత్రాలంటూ చిన్నచిన్న సమస్యలను ఎత్తి చూడకుండా మంచి అవకాశంగా భావించి ప్రజాస్వామ్యంలో భాగస్వామి కావాలి.

మౌలిక వసతుల కోసం మండలానికి లక్ష
పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని మౌలిక వసతుల కల్పన కోసం ప్రతి మండలానికి లక్ష కేటాయించాం. నియోజకవర్గాల వారీగా ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను గుర్తించాం. జిల్లా కేంద్రంలో కౌంటింగ్ కేంద్రాన్ని కూడా గుర్తించాం. ప్రతిపాదనలు పంపించాల్సి ఉంది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూంలకు లింకు చేయడం ద్వారా ఎన్నికల సమయంలో ఎక్కడ ఏం జరుగుతుందో వెంటనే తెలిసి పోతుంది. జిల్లాలో రూట్‌ల వారీగా మొత్తం 100 జోన్‌లు ఏర్పాటు చేస్తున్నాం.

156 సెంటర్లు క్రిటికల్‌గా గుర్తించాం
ఎన్నికల నిర్వహణ సందర్భంగా జిల్లా ఎస్పీతో జరిగిన సమావేశంలో జిల్లాలో 156 ప్రాంతాలు సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించాం. 519 సాధారణం, 262 సున్నితం, 154 అత్యంత సున్నిత కేంద్రాలుగా గుర్తించాం. తదనుగుణంగా బందోబస్తు నిర్వహిస్తారు.

212
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...