అనైతికమే..!


Thu,September 13, 2018 12:27 AM

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే.. ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమైంది తెలంగాణ టీడీపీ. రెండు కండ్ల సిద్ధాంతంతో తెలంగాణతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ దాదాపుగా కనుమరుగైన ఆ పార్టీకి ఒక్కరో ఇద్దరో నేతలు తప్ప కార్యకర్తలు ఎక్కడా మిగల్లేదు. అంతంత మాత్రంగానే తయారైన తమ పరిస్థితికి తెలుగుదేశం తోడైతే బలం చేకూరుతుందేమో అన్న ఆశతో కాంగ్రెస్ చేసిన ఈ పొత్తుల ప్రయత్నం.. బూమరాంగ్‌లా తిరిగి ఆ పార్టీనే దెబ్బతీసే పరిస్థితి కనిపిస్తోంది. రెండు పార్టీల మధ్య చిగురిస్తున్న పొత్తుల ఎత్తులపై ఆయా పార్టీల్లోనే ఎక్కడా స్వాగతం లభించడం లేదు. 30ఏండ్లుగా ఉప్పూ నిప్పులా కలిసి పని చేసిన ఇరు పార్టీల క్యాడర్ ఇప్పుడు కలిసి ఎలా పని చేస్తుందని.. ఈ పొత్తు పూర్తిగా అనైతికమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

పునరాలోచనతో లెక్కల్లో మునిగిన నాయకులు
12అసెంబ్లీ స్థానాలకు గత ఎన్నికల్లో ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయిన టీడీపీ.. దేవరకొండ, కోదాడల్లో మాత్రమే రెండో స్థానంలో నిలిచింది. దేవరకొండలో టీడీపీ నుంచి పోటీ చేసిన బిల్యా నాయక్ ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. ఈ రెండు స్థానాలతోపాటు మిగిలిన అన్ని స్థానాల్లోనూ గత ఎన్నికల్లో ఆ పార్టీ వెంట ఉన్న క్యాడర్ దాదాపుగా టీఆర్‌ఎస్‌లో చేరింది. అలాంటప్పుడు ఎక్కడా బలం లేని తెలుగుదేశంతో జత కట్టడం కాంగ్రెస్‌కు ఒరగబెట్టేదేమి లేదన్నది రాజకీయుల విశ్లేషణ. లాభం సంగతి పక్కన పెడితే.. కాంగ్రెస్‌ను ఓడించడమే లక్ష్యంగా స్థాపించిన తెలుగుదేశంతో జత కట్టడం కాంగ్రెస్ క్యాడర్ సైతం దిగ మింగుకోలేక పోతోందన్నది బహిరంగ రహస్యం. రాష్ట్ర స్థాయిలో నాయకులు పొత్తులు ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో ఇరు వర్గాల మధ్య ఏండ్లుగా పచ్చి గడ్డి వేస్తే భగ్గుమన్న పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు అదే పార్టీతో అస్సలు కలిసి పని చేయలేమని కాంగ్రెస్ క్యాడర్ ఖరాఖండిగా చెప్తోంది. ఇది పొత్తులపై ఆశలు పెట్టుకున్న హస్తం పార్టీకి ఊహించని పరిణామంగా మారింది. తాము వేసిన ఎత్తు తమకే నష్టం చేసే పరిస్థితులు కల్పిస్తున్న నేపథ్యంలో నాయకులు ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. కలిస్తే లాభమెంత? తమ కార్యకర్తలే సహకరించకుంటే కలిగే నష్టమెంత? అన్న లెక్కల్లో పలువురు నేతలు మునిగి తేలారు. పొత్తుల నేపథ్యంలో తమ సీట్లకు ఎక్కడ ఎసరు వస్తుందేమో అన్న ఆందోళన ఎలాగూ ఉండనే ఉంది. ఈ మొత్తం ప్రక్రియ వెరసి పలువురు కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు టీఆర్‌ఎస్ అభ్యర్థులతో చేరికలపై మంతనాలు జరుపుతున్నారు.

135
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...