ప్రజాసేవలోనే ప్రాణం విడిచాడు


Wed,September 12, 2018 11:48 PM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : సిద్దిపేట జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి అంజయ్య విధి నిర్వహణలోనే గుండెపోటుకు గురై మృతి చెందాడు. బుధవారం సిద్దిపేట మార్కెట్ యార్డులో రైతులకు పాడిగేదెలు, గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, ఫారూఖ్‌హుస్సేన్‌లకు స్వాగతం పలుకుతున్న సమయంలోనే అంజయ్య హఠాత్తుగా కుప్పకూలారు. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయనను హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో పాడి గేదెల పంపిణీ కార్యక్రమంలో విషాదం నెలకొంది. ఆయనతో పనిచేసిన అధికారులు ఆయన సేవలను గుర్తు చేసుకొని బాధపడ్డారు. డా.అంజయ్య వెటర్నరీ డాక్టర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి జాయింట్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. సిద్దిపేటలో 20 సంవత్సరాలుగా ఆయన పశువైద్యాధికారిగా సేవలందిస్తున్నారు. డా. అంజయ్య ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రఘునాథ్‌పల్లి మండలం కిలాషాపురం గ్రామానికి చెందిన వారు.

ఆయన 1985లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో వెటర్నరీ డాక్టర్‌గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. ఆ తరువాత చిన్నకోడూరు మండల ఎంపీడీవోగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2003లో డివిజనల్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పదోన్నతి పొంది 2008 వరకు పనిచేశారు. 2008లో సిద్దిపేటకు బదిలీపై వచ్చి వెటర్నరీ డాక్టర్‌గా సేవలందించారు. 2015లో సిద్దిపేట డివిజనల్ స్థాయి సహాయ సంచాలకులుగా పదోన్నతి పొందారు. 2016లో నూతన జిల్లాల ఆవిర్భావంతో జిల్లా జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అప్పజెప్పిన పనిని అంకిత భావంతో పూర్తి చేసే అధికారిగా ఆయనకు పేరు పొందారు. ఉద్యమ సమయంలోనూ ఉద్యోగుల సంఘం నాయకుడిగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఉత్తమ అధికారిగా గుర్తించి అవార్డులను అందజేసింది. తక్కువ సమయంలోనే చిన్నకోడూరు మండలాన్ని వంద శాతం మరుగుదొడ్లు నిర్మించడంలో అహర్నిషలు కృషిచేశారు. హరితహారం కార్యక్రమ నిర్వహణలో చురుకైన అధికారిగా పేరుపొందారు.

మంత్రుల పరామర్శ
డా.అంజయ్య మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు హుటాహుటిన సిద్దిపేట మెడికల్ కళాశాల ఆసుపత్రికి చేరుకొని అంజయ్య మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. విషయం తెలుసుకున్న పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సిద్దిపేటకు చేరుకొని అంజయ్య మృతదేహానికి నివాళులు అర్పించారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, ఫారూఖ్‌హుస్సేన్, పశు సంవర్దక శాఖ అధికారి లకా్ష్మరెడ్డి, జేసీ పద్మాకర్, ట్రైనీ కలెక్టర్ అవిశ్వాంత్‌పండా, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్‌తో పాటు ఆయా ఉద్యోగ సంఘాల అధికారులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై అంజయ్య మృతదేహం వద్ద నివాళులు అర్పించారు.

ఆత్మీయున్ని కోల్పోయాం
గత 20 ఏండ్లుగా సిద్దిపేటలో వెటర్నరీ డాక్టర్‌గా, ఏడీగా, జేడీగా వివిధ హోదాల్లో పనిచేసి అందరి మన్ననలు పొందిన వ్యక్తి డా. అంజయ్య అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అంజయ్య మృతితో ఆత్మీయున్ని కోల్పోయానని మంత్రి భావోద్వేగానికి లోనయ్యారు. ఉద్యోగిగా, ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఉద్యమంలోనూ చురుకైన పాత్ర పోషించారన్నారు. పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ ఎప్పుడు చురుగ్గా, హుషారుగా నవ్వుతూ కనిపించే డా. అంజయ్య మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. విషయం తెలియగానే హైదరాబాద్ నుంచి హుటాహుటిన వచ్చానన్నారు. వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.

172
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...