గులాబీ బాహుబలి


Wed,September 12, 2018 02:38 AM

-టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా సూర్యాపేట జిల్లా
-మంత్రి జగదీష్‌రెడ్డి నేతృత్వంలో బలపడిన పార్టీ
-80శాతం స్థానిక సంస్థల సభ్యులు టీఆర్‌ఎస్‌లోనే
-ఫిదా అవుతున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు
-అభివృద్ధికి ఆదరణ చూపుతున్న సాధారణ ప్రజలు
సూర్యాపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ:జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి పటిష్టమై తిరుగులేని శక్తిగా అవతరించి ప్రతిపక్షాల పాలిట బాహుబలిగా మారింది. రాజకీయాలకు అతీతంగా జిల్లాలో మంత్రి జగదీష్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న ప్రజాసంక్షేమ పథకాలతో జిల్లా మొత్తం రాజకీయంగా ఏకతాటిపైకి వచ్చింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు గులాబీ దళ సభ్యులుగా మారుతుండడంతో ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలూ తమ బాధ్యతగా బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలు పంచుకోవడానికి 80శాతం పైనే టీఆర్‌ఎస్‌లో చేరారు. నాలుగు నియోజకవర్గాల పరిధిలో 323 గ్రామ పంచాయతీలకు గాను 261 మంది సర్పంచ్‌లు టీఆర్‌ఎస్‌లో చేరగా, 262 మంది ఎంపీటీసీలలో158 మంది, 18 మంది ఎంపీపీలలో 14 మంది, 17 జడ్పీటీసీలలో 8మంది టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు. దాదాపు ప్రతి కుటుంబం ప్రభుత్వ లబ్ధిదారులే కావడంతో సాధారణ ప్రజలు సైతం టీఆర్‌ఎస్‌పై ఆదరణ చూపుతున్నారు. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ వెంట ఎవరిని తిప్పుకోవాలి, ఎలా ప్రచారం చేయాలో పాలుపోక ప్రతిపక్షాలు బిత్తర పోయే పరిస్థితి నెలకొంది.

సాయుధ పోరాటం... గ్రంథాలయోధ్యమం... వర్తక సంఘం.. లాంటి అనేక ఉద్యమాలకు పుట్టినిళ్లు అయిన సూర్యాపేటలో రాజకీయ చైతన్యం కూడా అదే స్థాయిలో ఉంటుంది. దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో పలు మార్లు సూర్యాపేటలోనే భిన్నమైన ఫలితాలను ఇచ్చిన చైతన్య వంతులు ఈ ప్రాంత ప్రజలు. అలాంటిది ప్రత్యేక రాష్ట్రంలో మొదటి ప్రభుత్వంగా టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రాంతం రాజకీయంగా దాదాపుగా ఏకతాటిపైకి వస్తుంది. దానికి కారణం రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖల మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి నేతృత్వంలో గతానికి భిన్నంగా సూర్యాపేట జిల్లా టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా మారి ప్రతిపక్షాలకు తన అధిపత్యాన్ని కనబర్చుతుంది. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతోపాటు కొత్తగా అభివృద్ధి, సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా చేపడుతుండడంతో సాధారణ ప్రజలు టీఆర్‌ఎస్‌కు దగ్గరవుతుండడంతో గత్యంతరం లేక ఇతర పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలతోపాటు వామపక్షాల నేతలు కూడా గులాబీ కండువ కప్పుకున్నారు. ప్రధానంగా ప్రతి గ్రామంలో వందలాది మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు తలెత్తుకునేలా వెయ్యి నుంచి 1500 పెన్షన్లు ఇస్తుండడంతో ఆయా కుటుంబాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కీర్తిస్తున్నారు. వీరితోపాటు హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం, రేషన్‌కార్డుపై తలా ఒక్కంటికి 6కిలోల బియ్యం, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతులకు పెట్టుబడి సాయం కింద రైతుబందు తదితర పథకాల ద్వారా గ్రామాల్లో టీఆర్‌ఎస్ ప్రతిష్ట తారాస్థాయిలో పెరిగింది. దీంతో ప్రజల పక్షాన్నే ఉండకుంటే రాజకీయంగా రాణించడం కష్టతరంగా భావించిన ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజల బాటనే ఎంచుకొని గులాబీదళంలో చేరారు. సూర్యాపేట నుంచి మంత్రి జగదీష్‌రెడ్డి, తుంగతుర్తి నుంచి గాదరి కిశోర్‌కుమార్‌లు టీఆర్‌ఎస్ నుంచి ప్రాతినిధ్య వహించగా కాంగ్రెస్ నుంచి కోదాడ పద్మావతి, హుజూర్‌నగర్ నుంచి పీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జగదీష్‌రెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధిలో జిల్లా రూపురేఖలే మారిపోయాయి.

80శాతం పంచాయతీలు..
జిల్లాలో టీఆర్‌ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలే కాకుండా కాంగ్రెస్ ఉన్న కోదాడ, హుజూర్‌నగర్‌లలో సైతం అభివృద్ధిని చూసి పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్ జెండాఎత్తుకున్నారు. సూర్యాపేట మున్సిపాలిటీపై టీఆర్‌ఎస్ జెండాఎగురవేయగా కోదాడ, హుజూర్‌నగర్ మున్సిపాలిటీలు సైతం టీఆర్‌ఎస్ వశం అయ్యాయి. అంతే కాకుండా నాలుగు నియోజకవర్గాలలో పెద్ద నాయకులు మొదలుకొని మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు దాదాపు 80 శాతానికి పైనే టీఆర్‌ఎస్‌లో చేరారు. జిల్లాలో తాజామాజీ ప్రజాప్రతినిధుల సంఖ్యలు పార్టీల వారీగా టీఆర్‌ఎస్ బలాన్ని పరిశీలిస్తే... నాలుగు నియోజకవర్గాల పరిధిలో 323 గ్రామ పంచాయతీలకు గాను 261 మంది సర్పంచ్‌లు టీఆర్‌ఎస్‌లో చేరగా, 262 మంది ఎంపీటీసీలలో158 మంది, 18 మంది ఎంపీపీలకు గాను 14, 17 జడ్పీటీసీలకు గాను 8మంది టీఆర్‌ఎస్ వారే ఉన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్‌ను రద్దు చేయగా త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ప్రయత్నాలు ప్రారంభించిన విషయం విదితమే. ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు గాను 105 మంది అభ్యర్థులను ప్రకటించగా నేడు జిల్లాలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, తాజామాజీ ప్రతినిధులతో పాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ గెలుపు కోసం ఎన్నికల కదనరంగంలోకి దిగారు. గతంలో ఏనాడూ లేని విధంగా తాము ఈ ప్రభుత్వానికే మద్దతు పలుకుతామంటూ సాధారణ ప్రజలు బహిరంగంగా ప్రకటిస్తుండడం విశేషం.

138
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...