ఉచితంగా మట్టి గణపతులు


Wed,September 12, 2018 02:35 AM

-జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 1390 విగ్రహాల పంపిణీ
- ఓడీఎఫ్ గ్రామాలకు ప్రాధాన్యం
- రూ.5లక్షలు విడుదల చేసిన కాలుష్య నియంత్రణ మండలి
- ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో పంపిణీకి ఏర్పాట్లు
సూర్యాపేటసిటీ : పండుగ అంటేనే పదిమంది ఒక చోట చేరి ప్రకృతి ఒడిలో సేదతీరడం...మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగం. కానీ నేడు అందం, అకర్షణ పేరుతో గొప్పకు పోయి కొందరు వ్యక్తులు ప్రకృతిని నాశనం చేస్తున్నారు. ఇది గ్రహించిన ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ద్వారా గత సంవత్సరం నుంచి మట్టి విగ్రహాలను ఉచితంగా అందజేస్తున్నది. ఇప్పటికే విగ్రహాల తయారీకి జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆయా వర్గాల నుంచి టెండర్లను ఆహ్వానించగా.. టెండర్లు దక్కించుకున్న వారు విగ్రహాల తయారీతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసి పంపిణీ ప్రక్రియకు సిద్ధంగా ఉన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను తగ్గించి మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కలెక్టర్ సురేంద్రమోహన్ ఆదేశాల ప్రకారం ముందుకు పోతున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి జి.జ్యోతి తెలిపారు.

టెండర్ దక్కించుకున్న వారికి ప్రత్యేక శిక్షణ ..
ప్రభుత్వం గత ఏడాది నుంచి జిల్లాలో పలు చోట్ల మట్టి విగ్రహాలను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సహకారంతో అందిస్తున్నారు. కలెక్టర్ చొరవతో ఈ ఏడాది రూ.5లక్షలనుమట్టి విగ్రహాల తయారీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సహకారం అందించడంతో కలెక్టర్ పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా బీసీ సంక్షేమ శాఖకు అప్పగించారు. జిల్లాలో కుమ్మరి వృత్తిదారులను ప్రోత్సహించేందుకు మట్టి విగ్రహాల తయారీకి జిల్లాలో టెండర్ ప్రక్రియను ప్రారంభించారు. టెండర్ల ఎంపికలో భాగంగా సూర్యాపేటకు చెందిన ఓం శివ, చివ్వెంలకు చెందిన దుర్గాదేవి సొసైటీలు అతి తక్కువ కోడింగ్ చేసి టెండర్‌ను పొందారు. ఈ సొసైటీలో 37మంది సభ్యులకు జిల్లా కేంద్రంలోని సీతరామ ఫంక్షన్‌హాల్‌లో విగ్రహాల తయారీ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నాలుగు రోజులపాటు నిపుణులతో శిక్షణ ఇప్పించారు. వీరి ఆధ్వర్యంలో మొత్తంగా 1340 మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయించి పంపిణీకి సిద్ధంగా ఉంచారు.

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో..
ఈ నెల 13న జరుగనున్న వినాయక చవితి ఉత్సవాలకు జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో తయారు చేసిన 1340 మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. 1340 విగ్రహాల్లో ఐదున్నర అడుగులవి 80, మూడు అడుగులవి 10, 8 అంగులాలవి 1250 విగ్రహాలు ఉన్నాయి. జిల్లాలోని 23 మండలాల్లోని ఎంపీడీఓ కార్యాలయాలకు, జిల్లాలోని నాలుగు మున్సిపాల్టీలకు వీటిని ఇవ్వనుండగా ఆ తర్వాత వాటిని ప్రజలకు అందజేయనున్నారు. ఈ మట్టి గణపతి విగ్రహాలను జిల్లాలో 100శాతం ఓడీఓఫ్ సాధించిన గ్రామాలకు ప్రాధాన్యత క్రమంలో అందించనున్నారు.

పర్యావరణ పరిరక్షణకే..
ప్లాస్టర్ ఆఫ్ ఫ్యారిస్ వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బ తింటున్నది. వీలైనంత వరకు ప్రజలు మట్టితో తయారు చేసిన విగ్రహాలను ప్రతిష్టించడం మంచిది. మట్టి విగ్రహాల తయారీలో కుల వృత్తుల వారిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఓడీఎఫ్ గ్రామ పంచాయతీలకు ప్రాధాన్యత ఇస్తూ విగ్రహాల పంపిణీకి జాబితా రూపొందించి పంపిణీ చేస్తున్నాం.
-జి.జ్యోతి(బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, సూర్యాపేట)

148
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...