800 మందితో పోలీస్ బందోబస్తు


Wed,September 12, 2018 02:35 AM

-గణేష్ నవరాత్రోత్సవాలకు మండపాల నిర్వాహకులే బాధ్యత తీసుకోవాలి
-మఫ్టీలో పోలీసుల నిఘా
-డీజే నిషేధం కొనసాగింపు
-చెరువులు నిండుగా ఉన్నందున ఎక్కడి వారు అక్కడే నిమజ్జనం చేసుకోవాలి
-సమస్యాత్మక ప్రాంతాలు జిల్లాలో లేవు
-ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు
సూర్యాపేటసిటీ : వినాయక విగ్రహాలను ప్రజలు తిరిగే రోడ్లపై ప్రతిష్టించి ట్రాఫిక్‌కు అడ్డంకులు సృష్టించవద్దని ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు జిల్లా ప్రజలకు సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని మండప నిర్వాహకులు, జిల్లా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్త, పోలీసింగ్ విధానం ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాలపై జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరం 2700 వరకు విగ్రహాలు ఏర్పాటు చేశారని, ఈ సంవత్సరం అదే స్థాయిలో ఉండవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. వినాయకుడిని పెట్టదలచిన వారు ఒక కమిటీగా ఏర్పడి మొదటి నుంచి చివరి వరకు వారే బాధ్యతలు తీసుకోవాలన్నారు. విగ్రహం ఏర్పాటు చేసేవారు కచ్చితంగా సంబంధిత పోలీస్‌స్టేషన్‌లలో పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో మండపాల వద్ద డీజేలను నిషేధించామని, మైక్‌లకు మాత్రమే అనుమతి ఉందని చెప్పారు. డీజేలు ఎవరైనా వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండపం నిర్వాహకులు కరెంట్ కలెక్షన్‌లు సక్రమంగానే తీసుకోవాలని సూచించారు.

జిల్లాలో వినాయక బందోబస్తుకు 800 మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని, అవసరమైతే మరింత బలగాలు వాడనున్నామని తెలిపారు. విగ్రహాల వద్ద ఎవరైనా అనైతిక చర్యలకు పాల్పడినా పోలీసులు మఫ్టీలో తిరుగుతారని అన్నారు. ఈ సారి వర్షాలు సమృద్ధిగా కురవడంతో అంతటా చెరువులు నిండుగా ఉండడం వల్ల ఎక్కడి వారు అక్కడే విగ్రహాలు నిమజ్జనం చేసుకుంటే మంచిదని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా మున్సిపల్, ఎక్సైజ్, మిగిలిన ప్రభుత్వ సంస్థలతో కలుపుకొని పని చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో పండుగల సందర్భంగా ఎలాంటి గొడవలు జరిగిన సంఘటనలు లేవని, ఇక మీదట జరగవని భరోసా కల్పించాలన్నారు. జిల్లాలో అందరూ కుల, మతాలతో సంబంధం లేకుండా సోదరభావంతో ఉన్నారని, ఇదే సంప్రదాయం కొనసాగించాలని ఆయన కోరారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లా ప్రజలు స్నేహ పూర్వక వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని ఆయన జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీ ఎస్.ఐ నర్సిరెడ్డి, ఆర్‌ఐ శ్రీనివాస్‌రావు, గోవిందరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...