జగత్ కిలాడీ!


Tue,September 11, 2018 11:43 PM

-స్వాతంత్య్ర సమరయోధుల భూములకు స్పాట్
-అధికారం అండతో బెదిరించి భూకబ్జాలు
-అమీన్‌పూర్‌లో భూ అక్రమాలను బయటపెట్టిన విజిలెన్స్
-నివేదికలను తొక్కిపెట్టిన గత కాంగ్రెస్ ప్రభుత్వం
-స్వరాష్ట్రంలో సాగని అక్రమాలు
-ఇప్పుడు మనుషుల అక్రమ రవాణా కేసులో అరెస్ట్..
-జగ్గారెడ్డి తీరుపై సొంత పార్టీ నేతల ఆగ్రహం
సంగారెడ్డి, నమస్తేతెలంగాణ ప్రధానప్రతినిధి:భూ కబ్జాల నుంచి మనుషుల అక్రమ రవాణా వరకు... బెదిరింపుల నుంచి నకిలీ పత్రాలు సృష్టించే వరకు.. కావేవీ అనర్హం అన్నట్లు సాగాయి మాజీ శాసన సభ్యుడు జగ్గారెడ్డి అరాచకాలు. సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నపుడు నకిలీ పత్రాలు సృష్టించి అమీన్‌పూర్‌లో స్వాతంత్ర ్య సమరయోధుల భూములను ఆక్రమించాడు. ఈ విషయాన్ని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బయటపెట్టినా.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నివేదికలను తొక్కిపెట్టింది. రామచంద్రాపురం మండలం ఈదుల నాగులపల్లి, కంది, ఉత్తర్‌పల్లి, కొత్తపూర్, ధర్మాసాగర్, కులబ్‌గురు ఇలా ఏ ఊరుకెళ్లినా భూకబ్జాలు, బెదిరింపులు, నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు.. ఇలా అక్రమాల చిట్టా బయటపడుతున్నది. తాజాగా మనుషుల అక్రమ రవాణా కేసులో అరెస్టు కావడంపై సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక అక్రమాలకు పాల్పడ్డ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) కటకటాల పాలవడంపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మనుషుల అక్రమ రవాణా కేసులో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్ రాజకీయంగా కలకలం సృష్టించింది. మొదటి నుంచి వివిధ రకాల కేసులతో సంబంధం ఉన్న ఆయన ఇప్పుడు ఈ కేసుతో జైలుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. తన భార్యాపిల్లల పేరుతో ఇతరులను అమెరికాకు పంపడాన్ని తన సన్నిహితులు, సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా తప్పుపడుతున్నారు. దేశ ద్రోహానికి పాల్పడిన వారికి శిక్ష పడాల్సిందే అంటున్నారు. ఇదే క్రమంలో గతంలో జగ్గారెడ్డి అవినీతి, అక్రమాలను గుర్తు చేసుకుంటున్నారు. అమీన్‌పూర్‌లో స్వతంత్ర సమరయోధుల భూములను అక్రమ పత్రాలు సృష్టించి జగ్గారెడ్డి భూములు కాజేసిన ఘటనలపై ఇప్పుడు చర్చ జరుగుతున్నది. అయితే అన్నిచోట్లా పేదల భూములకే ఆయన స్పాట్ పెట్టడం గమనార్హం. జగ్గారెడ్డి భూ బాగోతాలను ఓ సారి పరిశీలిస్తే...
-అమీన్‌పూర్‌లో 343 సర్వే నంబర్‌లో ప్రభుత్వం స్వతంత్ర సమరయోధులకు భూములు కేటాయించింది. ఇందులో దాదాపు 35 ఎకరాలు ఏడుగురికి కేటాయించినట్లు అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే తమకు భూమి ఇవ్వకుండానే తమ పేర్లు మీడియాలో చూసుకున్న బండారు సావిత్రమ్మ , కొమురయ్య, సుంకనపల్లి దేవయ్య, రాజనర్సు, నర్సింలు, మల్లేశం, వీరమల్లు, భద్రయ్య కలెక్టర్‌ను ఆశ్రయించారు. దీంతో అక్రమ బాగోతం బయటపడింది. అప్పడు సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డి అక్రమ పత్రాలు సృష్టించి భూమికి స్పాట్ పెట్టినట్లు తేలింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సర్కారు నివేదిక ఇచ్చింది. జగ్గారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా ఆ నివేదికలో పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ సర్కారు విజిలెన్స్ రిపోర్టును బయటకు రాకుండా చూసింది.

-రామచంద్రాపురం మండలం ఈదుల నాగులపల్లిలోని 134, 135 సర్వే నంబర్లలో దాదాపు 760 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉన్నది. ఈ భూమికి కూడా నకిలీ పత్రాలు సృష్టించి జగ్గారెడ్డి ఇతర అనుచరులతో స్పాట్ పెట్టారు. లేని కోర్ కంపెనీని సృష్టించి కొంత భూమిని అమ్మారు. హైదరాబాద్‌లోని జూవెల్లరీ వ్యాపారులు సురేశ్‌గుప్తా, ఇతరులు ఈ భూమిని కొనుగోలు చేసి జగ్గారెడ్డి తన చిన్నమ్మ కొడుకులు డబ్బులు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేల్చారు. అయితే సర్కారు భూములను కొనుగోలు చేసిన వారు ఆ భూములు తనఖా పెట్టి బ్యాంకు నుంచి రూ.100 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే భూములు సర్కారువి అని తెలిసి బ్యాంకులు విచారణ చేపట్టగా కోర్ కంపెనీలేదని గుర్తించారు. ఈ క్రమంలో బ్యాంకు యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. ఈ వ్యవహారం తనకు డబ్బులు ఇస్తానని చెప్పి జగ్గారెడ్డి మోసం చేశారని బీడీఎల్ బానూరు పోలీసు స్టేషన్‌లో జగ్గారెడ్డిపై కేసు నమోదైంది.

-కందిలో 615 సర్వే నంబర్లలో 5 ఎకరాల భూమిని పెద్ద ఫకీర్లకు ప్రభుత్వం ఇచ్చింది. వారిని బెదిరించి ఈ భూములను ఇతరుల పేరున జగ్గారెడ్డి రిజిస్టేషన్ చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి.
-ధర్మాసాగర్‌లో 240 ఎకరాల్లోని 63 ఎకరాల బిల్లదాఖల(సర్వే నంబర్లు లేని) భూములకు నకిలీ నంబర్లు సృష్టించి చేసిన భూమిని పలువురికి రిజిస్ట్రేషన్లు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఒకే భూమిని పలువురికి రిజిష్ర్టేషన్లు చేసి డబ్బులు దండుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
-కొత్లాపూర్‌లో 99 మంది పేదలకు ప్రభుత్వం భూములు ఇవ్వగా ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డి వారిని బెదిరించి ఆ భూములను లాక్కున్నారు. కాగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భూములు కోల్పోయిన పేదలకు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డబ్బులు ఇప్పించారు. డబుల్ బెడ్‌రూం ఇండ్లు కూడా ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
-ఉత్తర్‌పల్లిలో పేదలకు ఇచ్చిన 33 ఎకరాల, కులబ్‌గురులో కూడా పేదలను నమ్మించి భూమలు లాక్కుని ప్లాట్లు చేసి అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. సిద్దాపూర్, అలియాబాద్‌లలో కూడా జగ్గారెడ్డి అక్రమ భూ దందాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

కాంగ్రెస్ సర్కారు హయాంలోనే కేసులు, అరెస్టులు..

జగ్గారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి సునీతాలకా్ష్మరెడ్డిలు చేస్తున్న ఆరోపణలపై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జగ్గారెడ్డిపై కేసులు, అరెస్టులు అయ్యాయని టీఆర్‌ఎస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. పలు కేసుల్లో ఆయన జైలుకు కూడా వెళ్లారు. ప్రస్తుతం మనుషుల అక్రమ రవాణా కేసు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిందేనని గుర్తు చేస్తున్నారు.

జగ్గారెడ్డిపై నమోదైన కేసులు..

-2012లో సంగారెడ్డిలో టీఆర్‌ఎస్ నాయకులపై జగ్గారెడ్డి దాడి చేసిన కేసులో అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.
-2010, జూన్ 29న సిద్దిపేట శాసనసభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు జగ్గారెడ్డిపై కేసు నమోదైంది. కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జగ్గారెడ్డి కోర్టుకు హాజరుకాకపోవడంతో అప్పటి సిద్దిపేట జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ రాజేందర్ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. దీంతో పోలీసులు జగ్గారెడ్డిని సంగారెడ్డికి జైలుకు తరలించారు.
-గతంలో అప్పటి మెదక్ ఎంపీ విజయశాంతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డిపైకి ఎన్నికల కమిషన్ షోకాజు నోటీసులు జారీ చేసింది.
-పోలీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కూడా జగ్గారెడ్డిపై గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేటలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అప్పటి సంగారెడ్డి డీఎస్పీ సత్యనారాయణ నేతృత్వంలో పోలీసులు జగ్గారెడ్డిని అరెస్ట్ చేసి సిద్దిపేట కోర్టులో హాజరు పరిచారు.

సంగారెడ్డి కాంగ్రెస్‌లో కల్లోలం..

జగ్గారెడ్డి అరెస్ట్‌తో సంగారెడ్డి కాంగ్రెస్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నిన్నమొన్నటి వరకు గొప్ప నాయకుడని జగ్గారెడ్డి వెంట ఉన్న సన్నిహితులు మనుషులను అక్రమ రవాణా చేశాడని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి అవినీతి, అక్రమాల కేసుల్లో ఇరుక్కున్న జగ్గారెడ్డి ఇప్పుడు దేశ ద్రోహానికి పాల్పడడాన్ని సహించలేకపోతున్నారు. సంగారెడ్డి పేరు నాశనం చేశారని జగ్గారెడ్డి సన్నిహితులు మండిపడుతున్నారు. ఇలాంటి వ్యక్తి వెంట ఉంటే తమకు చెడ్డపేరొస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది నాయకులు, కార్యకర్తలు, జగ్గారెడ్డి ముఖ్య అనుచరులు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. మనుషుల అక్రమ రవాణా చేసిన జగ్గారెడ్డికి మద్దతుగా ఉండబోమని పలువురు కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఓ వైపు టీఆర్‌ఎస్ పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను తిరిగి అభ్యర్థిగా ప్రకటించగా జగ్గారెడ్డి అరెస్ట్‌తో కాంగ్రెస్ నేతలు అయోమయంలో పడ్డారు. దేశద్రోహం కేసు కావడంతో ఆయన ఇప్పట్లో జైలు నుంచి బయటకు రాడని చర్చించుకుంటున్నారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ శకం ఇక ముగిసిందని ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు నమస్తే తెలంగాణతో చెప్పుకువచ్చారు. మొత్తంగా జగ్గారెడ్డి అరెస్ట్‌తో సంగారెడ్డి కాంగ్రెస్‌లో కల్లోల పరిస్థితులు నెలకొనగా, అరెస్ట్‌పై అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మహిళల నుంచి మంచి స్పందన వచ్చింది.

156
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...